– జిల్లాలకు నోడల్ అధికారుల నియామకం
– రైతుల ఆదాయం పెంచే దిశగా పనిచేయలి : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తలపెట్టిన 99 రోజుల కార్యాచరణలో మే నాలుగో తేదీ నుంచి మే పదో తేదీ వరకు వ్యవసాయ రంగ వారోత్సవం నిర్వహించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ సంబంధింత కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమర్థవంతంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించామనీ, రంగారెడ్డి జిల్లాకు వ్యవసాయశాఖ సంచాలకులు గోపి, మహబూబ్ నగర్ జిల్లాకు హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, నల్లగొండ జిల్లాకు మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, మెదక్ జిల్లాకు స్పెషల్ సీసీ, ఆర్సీఎస్ రాహుల్ రాజ్ పీఎస్, నిజామాబాద్ జిల్లాకు మార్క్ ఫెడ్ ఎమ్‌డీ శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు టీజీఎస్‌ఓసీఏ డైరెక్టర్ కిరణ్ కుమార్, ఆదిలాబాద్ జిల్లాకు ఆగ్రోస్ ఎమ్‌డీ రాములు, కరీంనగర్ జిల్లాకు టీజీఎస్‌డబ్ల్యూసీ ఎమ్‌డీ కొర్ర లక్ష్మి, వరంగల్ జిల్లాకు హాకా ఎమ్‌డీ చంద్రశేఖర్ రెడ్డిలను నోడల్ అధికారులుగా నియమించామని తెలిపారు. రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ, నానో యూరియా వినియోగంపై అవగాహన, వానాకాలం పంటల సిద్ధతపై కార్యక్రమాలు, బ్యాంకర్లతో రుణ మేళాలు, రైతు-శాస్త్రవేత్తల సమావేశాలు, ఉత్తమ రైతులకు సన్మానాలు, రైతు మేళాలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించేలా ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సాగుపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతు ఉత్పత్తి సంస్థలు, వ్యవసాయ మార్కెట్ యార్డులు, సహకార సంస్థల బలోపేతం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మే 4 నుంచి 10 వరకు వ్యవసాయ వారోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



