ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)అనే కృత్రిమమేధ చుట్టూ పరిభ్రమిస్తున్న ప్రపంచ ఆర్థిక సాంకేతిక చర్చ ఇప్పుడు భారతదేశాన్నీ తెలుగు రాష్ట్రాలనూ తాకింది. విశాఖలో గూగుల్ అదానీ ఏఐ డేటా సెంటర్ స్థాపనకు ఒప్పందంతో ఈ చర్చ మరింత వేడిపుంజుకుంది. 1500 కోట్ల డాలర్ల పెట్టుబడితో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయనే ప్రచారంపైనా చాలా వాదోపవాదాలు నడిచాయి. ఈ డేటా సెంటర్ల భూసేకరణ, పర్యావరణంపై, ప్రభావంపైన కూడా భిన్నాభిప్రాయాలు ఇంకా సాగుతున్నాయి కూడా. ఈ క్రమంలో విశాఖ డేటా సెంటర్ క్రెడిట్ వార్ పరాకాష్టకు చేరి మేమంటే మేమని వైసీపీ, టీడీపీలు ప్రచారం హోరెత్తించాయి. ఆ రాజకీయాలు అలా వుంచితే ఈ సమయంలో ప్రపంచ వ్యాపితంగా ఇదే విధంగా ఎఐపై చర్చలు సాగుతున్నాయి. ఉత్పత్తి సాధనాలు సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరణలో ఎప్పుడూ ముందుకు పోవలసిందే. కానీ అదే సమయంలో ఉద్యోగాలపై, ఉత్పత్తిపై దాని ప్రభావం ఏమిటనేది కూడా తప్పక అవగాహన పెంచుకోవలసిన విషయం. ఇతరులెవరో కాకుండా నేరుగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల సిఇవోలు, ప్రఖ్యాత ఆర్థికవేత్తలు ఈ విషయంలో ఏం చెప్పారో తెలుసుకోవడం కన్నా ఇందుకు మెరుగైన మార్గం వుండదు.
సిఇవోల సంకేతాలు
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సిఇవో సుందర్ పిచారు మొన్న బుధవారం మాట్లాడుతూ ప్రస్తుతం ఎఐకి సంబంధించి సాగుతున్న హడావుడిలో హేతుబద్దత కొంత లోపిస్తున్నదని వ్యాఖ్యానించారు.ప్రపంచ వ్యాపితం గా పెద్దకంపెనీలు ఎఐ వ్యవస్థలకు మారడం ద్వారా ఖర్చులు తగ్గించుకునేందుకు,లాభాలు పండించు కోవడానికి భారీ బడ్జెట్లు కేటాయించడం జరుగుతున్నది. గూగుల్ జెమినీ చాట్‌బాట్, ఎఐ చిప్స్ తీసుకొచ్చింది. ఓపెన్ ఎఐ మైక్రోసాఫ్ట్ మధ్య పోటీ కూడా సాగుతున్నది. గత ఏడు నెలల్లో ఆల్ఫాభెట్ షేర్ల విలువ మూడున్నర లక్షల కోట్ల డాలర్లు పెరగడానికి ఎఐ వెల్లువ కారణమైంది.
ఎఐ బుడగకు కారణమైన సంక్లిష్ట ఆర్థిక ఇంజనీరింగ్ దీని వెనక వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎఐ బుడగ పగిలిపోతే గూగుల్ తట్టుకోగలదా? అని సుందర్ పిచారుని ప్రశ్నించినపుడు మాతో సహా ఏ కంపెనీ కూడా తప్పించుకోజాలదని సమాధానమిచ్చారు. గతంలో వచ్చిన ఇంటర్నెట్ వ్యవహారాన్ని ఇందుకు ఉదాహరణగా చూపారాయన. ఇంటర్నెట్ వచ్చిన పుడు కూడా ఇలాగే అతిగా పెట్టుబడులు పెట్టారు. అయితే అది ఇంటర్నెట్ నిజంగా అంత బలమైందా అని మాలాటి వాళ్లం ఎప్పుడూ ప్రశ్నించలేక పోయాము. అప్పుడు జరిగినట్టే ఇప్పుడూ జరుగుతుంది. ఇందులో కొంత హేతుబద్దత వుంది. ఇలాటి సమయాల్లో హేతురాహిత్యం కూడా కొంత వుంటుందని సుందర్ పిచారు తేల్చిచెప్పేశారు.
పిచారుతో పాటు ఓపెన్ ఎఐ సిఇవో శాం ఆల్మన్ కూడా ఎఐ సాంకేతిక వ్యవస్థలో కొన్ని అంశాలు నిజంగా గాలిబుడగ స్వభావంతో వున్నాయని వ్యాఖ్యానించారు. దాని గురించి చెప్పడం చాలా ఆసక్తిగానూ వు ంటుందన్నారు.అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాట్లాడుతూ దీనివల్ల ఎఐ ప్రభావంతో పారిశ్రామిక బుడగ కూడా వస్తుందని చెబుతూ ఈరెండింటికీ మధ్య తేడాను కూడా వివరించే ప్రయత్నం చేశారు.” బ్యాంకింగ్ బుడగ,బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభం.. 2008లో అది ఎంతో దుష్ప్రభావం చూపింది. సమాజం అలాంటి వాటిని రాకుండా చేయాలని కోరుకుంది. పరిశ్రమలకు సంబంధించిన బుడగల సంగతీ అంతే. అయితే మంచి బుడగలూ వుంటాయి.అంతా అయిపోయాక చూస్తే వాటివల్ల కలిగిన ఫలితాలేమిటో, ఎవరు విజేతలో, వాటివల్ల ఎవరు ప్రయోజనం పొందారో అర్థమవుతుంది” అంటూ నర్మగర్భంగా మాట్లాడారు.
మైక్రోసాఫ్ట్ సిఇవో సత్యనాదెళ్ల కూడా ఈ సమయంలో ఇండియాలోనే పర్యటిస్తున్నారు. ఎఐ శకంలో తమ వాణిజ్య నమూనా పూర్తిగా మరోసారి ఆలోచించుకోవలసి వుంటుందని ఆయన న్నారు. పదిహేనేండ్ల కిందట క్లౌడ్ కంప్యూటింగ్‌కు మారినప్పుడు తమకు పనిచేసిపెట్టిన నిపుణుడు రోల్ఫ్‌హార్మ్స్‌నే మళ్లీ ఈ దశలోనూ పరివర్తనకు తోడ్పడాలని తెచ్చుకున్నారు. 2025 జులైలో తమ ఉద్యోగులను దీనిపై లేఖరాసిన సత్యనాదెళ్ల అనిశ్చిత పరిస్థితి, గజిబిజిలో లే ఆఫ్‌లకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పరిశ్రమలో కావలసింది విజయమేనంటూ వినియోగదారుల కొత్త అవసరాలను అందుకోవడం కోసం ఇప్పుడున్న వాణిజ్య నమూనా మార్పుతో కొత్త తరహా ఉద్యోగాలు సృష్టించాల్సి వస్తుందన్నారు. దీర్ఘకాలంలో మైక్రోసాప్ట్ మనుగడ కోసం ఎంతో ఆందోళన సత్య నాదెళ్ల లేఖలో ప్రతిబింబించిందని మీడియా వ్యాఖ్యానించింది.
మినీ కంప్యూటర్లను ఒకప్పుడు పాలించిన డిజిటల్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్ కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేసిన కారణంగా మటుమాయమై పోయిన ఉదాహరణ తనను వెంటాడుతున్నదని పేర్కొన్నారు.మనం సృష్టించిన కొన్ని అతిపెద వ్యాపార వ్యవస్థలు మనం ముందుకు పోతున్నకొద్ది కొరగానివిగా మారిపోవచ్చని హెచ్చరించారు. మైక్రోసాఫ్ట్ అనేది వినియోగదారీ పరి కరాలను సరఫరా చేసే పరిస్తితి నుంచి ఎఐ ఏజెంట్లకు అంటే యంత్రాలకు మౌలిక సదుపాయాల కల్పనలో సహకరించే పాత్రలోకి మారిపోవచ్చని సూచించారు. వాస్తవానికి సత్యనాదెళ్ల స్వయంగా తన గత పాత్రనుంచి మారిపోగా మరొకరిని తీసుకొచ్చారు.సుందర్ పిచారు మాట్లాడుతూ ఎఐ అనేది సిఇవోలను కూడా వదలి పెట్టబోదని చెప్పిన దాని ప్రభావం ఇక్కడ మనకు కనిపిస్తుంది.సత్యనాదెళ్ల మాటలు అతి తీవ్ర హెచ్చరిక అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అమెరికా ఆరాటం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా నిర్వహించిన ఐటి కంపెనీల అధినేతల సమావేశంలోనే ఎఐపై పెట్టుబడులు పెంచాలని నిర్ణయానికి వచ్చిన విషయం గతంలో చెప్పుకున్నాం. ఆర్థికంగా తీవ్ర సవాళ్లలో కూరుకుపోయిన అమెరికా ఇప్పుడు ఎఐ గాలిబుడగపై కేంద్రీకరించాలని నిర్ణయించింది. డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో భారీఎత్తున ఈ కంపెనీల సమావేశం నిర్వహించారు. ప్రపంచ మంతటా ఏఐ కేంద్రాలపై భారీగా పెట్టుబడి పెట్టాలనీ, ప్రోత్సహించాలనీ నిర్ణయానికొచ్చారు. ఇందులో భాగంగా గూగుల్ 25 బిలియన్లు, బ్లాక్ స్టోన్ 25 బిలియన్లు, కోర్‌వీవ్ 6 బిలియన్లు ఇలా పెట్టుబడిపెట్టేందుకు అంగీకరించాయి. ఈ ఊపులో ట్రంప్ వైట్‌హౌస్‌లో తలపెట్టిన బాల్‌రూం నిర్మాణానికి గూగుల్ 20 మిలియన్లు కేటాయించింది, ఆపిల్,మెటా, మైక్రో సాఫ్ట్‌లు,లాక్‌హీడ్ వంటివి కూడా పాలుపంచుకుం టున్నాయి.
ఎఐ గురించి ఇంతగా చెబుతున్నా, ఇప్పటికీ కంపెనీల కార్యకలాపాలలో దాని వినియోగం 9.2శాతం మాత్రమే వుందని, బాగా పెంచాలని నిర్ణయానికొచ్చాయి. ఇంకా చెప్పాలంటే రీగన్ కాలంలో సైనిక పారిశ్రామిక వ్యవస్థ తరహాలో ఎఐ వ్యవస్థను పెంపొందించాలనేది వ్యూహం.అందుకే మీరు ఇప్పుడు ఏ పత్రిక చూసినా డేటా సెంటర్‌పై లేదా ఎఐపై ఇంత పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్టు ప్రకటనలే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు టిసిఎస్‌తో కలసి డేటా సె ంటర్ ఏర్పాటు చేయడానికి టిపిజి ఒప్పందం చేసుకోగా అందుకు 200 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడతామన్నారు.1.2 గిగావాట్స్ సామర్థ్యంతో డేటా సెంటర్ నిర్మాణానికి దాదాపు 700 కోట్ల దాటర్లు పెట్టుబడి పెడతామని టిసిఎస్ ప్రకటించింది. సత్యనాదెళ్ల స్వయంగా కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్ తదితరులను కలుసుకున్నారు.
లేఆఫ్‌లు, తొలగింపులు..
అమెరికాలో ఇప్పుడు వరుస లేఆఫ్‌ల కాలం నడుస్తున్నది.ట్రంప్ టారిఫ్‌ల వల్ల నిర్వహణ వ్యయం పెరిగిపోయిందని అనేక కంపెనీలు చెబుతున్నాయి. ఇంకొన్ని ఎఐకి అనుగుణంగా మారడం వంటి కారణాలు చూపిస్తున్నాయి.43 రోజుల షట్‌డౌన్ దీనికి ఆజ్యం పోసింది. 4.4శాతం నిరుద్యోగం పెరిగింది. మహిళల్లో 7.5శాతం నిరుద్యోగం పెరిగింది.ఒక్క ఆగష్టు నెలలోనే 4వేల ఉద్యోగాలు ఊడాయి. నవంబరులో వెరిజోనా కంపెనీ 13వేల మందినీ, జనరల్ మోటర్స్ 1700 మందినీ, పారమౌంట్ 2వేలమందిని అంటే పదిశాతం సిబ్బందిని,అమెజాన్ 14వేల మందినీ తొలగిస్తున్నట్టు ప్రకటించాయి. మొత్తం 30 వేల కార్పొరేట్ ఉద్యోగాలు కత్తిరిస్తున్నట్టు అమెజాన్ వెల్లడించింది. యుపిఎస్ 48 వేల ఉద్యోగాల కోత ప్రకటించింది. నెస్లె ప్రపంచ వ్యాపితంగా 16వేలమందిని తొలిగిస్తానని చెబితే, డేనిష్ ఫార్మా కంపెనీ నోవో నోర్సిడిక్ 9 వేల ఉద్యోగాలకు ఎసరుపెట్టింది.
ఇంటెల్ ఇప్పుడున్న 99,500 మంది ఉద్యోగుల సంఖ్యను 75 వేలకు తీసుకురానున్నట్టు సిఇవో లిప్ బూ తాన్ వ్లెడించారు.మైక్రోసాఫ్ట్ సరే 6వేలమందినీ, ప్రాక్టర్ అండ్ గాంబిల్ 7 వేలమందినీ తొలగిస్తామని ప్రకటించాయి. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం సంపన్న దేశాలలో 40 శాతం, పేద దేశాలలో 26శాతం ఉద్యోగాలకు దెబ్బ తగులుతుంది, మెకన్సీ, జెపి మోర్గాన్ వంటివి కూడా ఈ విషయమై ఇలాటి అంచనాలే ఇచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం ఆహ్వానించాదగిందైనా మార్కెట్ ఫైనాన్స్ పెట్టుబడి స్వార్థ ప్రయోజనాలు, వినాశక వ్యూహాలు దాన్ని తప్పుదోవ పట్టించడం ఇందుకు కారణం. మానవాళి శ్రేయస్సుకు గాక ఖర్చులు తగ్గించుకోని లాభాలు పెంచు కోవడమే వాటి ఏకైక లక్ష్యంగా వుంటుంది. మరి, మన పాలకులు కూడా ఇందులో తమ వాటా కోసం పాకులాడుతుంటారు తప్ప దీర్ఘకాలిక అంశాలు పట్టించుకోరు.
అవగాహన.. అప్రమత్తత
మిగిలిన వాటికి భిన్నమైన ఒక ప్రత్యేక లక్షణం ఎఐ బుడగలో ఏమంటే ఇది భూములతో అంటే రియల్ ఎస్టేట్‌తో ముడిపడి వుంటుంది. దీనిపై ‘మనీ కంట్రోల్ ‘ పత్రిక ప్రత్యేక కథనమే ప్రచురించింది.ప్రత్యేకమైన భూ ఖండాలు, చాలా అధునాతమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు సిద్ధం చేసి పెద్ద కాలహరణం కూడా జరగకుండా అందజేసేందుకు సిద్ధమవుతున్నాయట. విశాఖ వంటి నగరాలు అటుంచి నవీ ముంబారు, చెన్నరు, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా వంటి చోట ఇందుకోసం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. గతంలో నైతే డేటా సెంటర్ల నిర్వాహకులు భూములు కొనుకొన్ని తమకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పుడు వారు చాలా తొందరలో వుండటంతో అన్నీ అమ్మకం దారులే చేయవలసి వస్తున్నది.వీటినిఏ ప్లగ్ అండ్ ప్లే డేటా సెంటర్లు అంటున్నారు.దీనికి చాలా అధునాతనమైన విద్యుత్ సరఫరా ఏర్పాటు వ్యవస్థ కూడా సమ కూర్చాలి.అనేక రాష్ట్రాలు పోటీపడి రాయితీలిస్తున్నాయి.
ఈ డేటా సెంటర్ల నీటి అవసరాలు విద్యుత్, వాతావరణం వేడెక్కిపోవడం వంటి అంశాలపైనే స్పష్టత రావలసి వుండగా భూములు,ఉద్యోగాలు, సాంకేతిక మార్పిడి కూడా సవాళ్లు కాబోతున్నాయని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. సాంకేతిక వికాసం కోసం వీటిని ఆహ్వానించినా సమతుల్యత తగు రక్షణలు ఎలా తీసు కుంటారనే ప్రశ్న వుండనే వుంటుంది. విస్తారమైన ఈ మార్పు చివరిదాకా ఇలాగే కొనసాగుతుందా? ఈ బుడగ పెట్టుబడి మార్కెట్లను కాపాడుతుందా? అనే ప్రశ్నలు వాటి యజమానులను ప్రభుత్వాలను కూడా వేధిస్తున్నాయి. ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ వంటివారు దీనికి ఎప్పుడో జవాబు చెప్పేశారు.ఆర్థిక రంగానికి ఎఐ చేసే దోహదం నామమాత్రమేననీ, అదే సమయంలో తాత్కాలి కంగా కొన్ని రకాల ఉద్యోగాలు వచ్చినా దీర్ఘకాలంలో మాత్రం పెద్ద మార్పు వుండబోదనీ వివరించారు.
ఒకప్పుడు వచ్చిన డాట్ కాం బుడగతో దీన్ని పోలుస్తున్నారు. సుందర్ పిచారు ఇంటర్నెట్‌ను ఉదహరించారు. రియల్ బుడగ, సబ్ ప్రైం సంక్షోభం వంటివన్నీ ఈర్థిక సంక్షోభాల అనేక రూపాలుగా చూడవలసి వుంటుంది. వీటన్నిటికి తలపైన శాశ్వతంగా సైనిక పారిశ్రామిక వ్యవస్థ వుంటుంది. ఆయుధాల వ్యాపారం వుంటుంది. అమెరికా ఏకకాలంలో ఇప్పుడు ఆయుధాల అమ్మకం ఒప్పందాలు కూడా పెంచుకోవడం చూస్తాం, ఆ జాబితాలోనూ భారత దేశం వున్నది. తెలుగు మీడియా రెండవ కోణం అసలు ఇవ్వకపోవడం ఆశ్యర్యం కలిగిస్తుంది. అందుకే ఈ అంశంపై ఊకదంపుడు కన్నా వాస్తవాల ప్రాతిపదికన లోతైన అధ్యయనం, అప్రమత్తత అనివార్యమవుతున్నాయి.
తెలకపల్లి రవి


