Wednesday, October 15, 2025
E-PAPER
Homeజాతీయంవిశాఖలో ఏఐ హబ్‌

విశాఖలో ఏఐ హబ్‌

- Advertisement -

గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఐదేండ్లలో రూ.1,33,000 కోట్ల పెట్టుబడి
సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ
ప్రతి కుటుంబానికి ఎఐని దగ్గర చేస్తాం : సీఎం చంద్రబాబు

న్యూఢిల్లీ: విశాఖలో వన్‌ గిగావాట్‌ సామర్థ్యం గల ఏఐ హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఐదేండ్లలో రూ.1,33,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గూగుల్‌ ముందుకు వచ్చింది. మంగళవారం నాడిక్కడ తాజ్‌మాన్‌ సింగ్‌ హౌటల్‌లో జరిగిన కార్యక్రమంలో గూగుల్‌ ఏఐ హబ్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, గూగుల్‌ ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్టవ్‌, గూగుల్‌ క్లౌడ్‌ గ్లోబల్‌ సిఈవో థామస్‌ కురియన్‌, బికాష్‌ కొలే (వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌), కరణ్‌ బజ్వా (ప్రెసిడెంట్‌, ఏషియా పసిఫిక్‌ గూగుల్‌ క్లౌడ్‌) తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గూగుల్‌ క్లౌడ్‌ గ్లోబల్‌ సీఈవో థామస్‌ కురియన్‌ మాట్లాడుతూ భారత ప్రభుత్వ సహకారం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మద్దతుతో విశాఖపట్నంలో నూతనంగా వన్‌ గిగావాట్‌ సామర్థ్యంగల ఏఐ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించేందుకు తమకు ఆనందంగా ఉందన్నారు. ఇది అమెరికా తరువాత ప్రపంచంలో గూగుల్‌ నిర్మించబోయే అతి పెద్ద ఏఐ హబ్‌ అని పేర్కొన్నారు. వచ్చే ఐదేండ్లలో విశాఖ ఏఐ హబ్‌ నిర్మాణానికి 15 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు (రూ.1,33,000 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. వన్‌ గిగావాట్‌ సామర్థ్యంతో తాము ప్రారంభించే ఏఐ హబ్‌ను, భవిష్యత్తులో మరిన్ని గిగావాట్లకు విస్తరిస్తామని తెలిపారు.

ఇది ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాలలో ఉన్న ఏఐ సెంటర్స్‌ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంటుందన్నారు. భారతదేశంలో తాము నిర్మించే అతి పెద్ద ఎఐ కేంద్రం ఇదేనని తెలిపారు. దీనిద్వారా విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి కనెక్టివిటీ హబ్‌గా అభివద్ధి చేయబోతున్నామని అన్నారు. ఇందుకోసం విశాఖపట్నంలో సముద్రగర్భ కేబుల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సబ్‌ సీ కేబుల్‌ నెట్‌వర్క్‌ను అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ చేసి, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్‌ ఆధారిత వ్యవస్థలతో అనుసంధానిస్తామని పేర్కొన్నారు. ఎఐ టెక్నాలజీతో పాటుగా డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా అందిస్తామని, ఎఐ హబ్‌లో పూర్తి సాంకేతిక పరిష్కారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీనిలో టీపీయూ (టెన్సర్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను) వాడుతామని, ఇవి ఎఐ ప్రాసెసింగ్‌కు బలం చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఇవి రెండింతల పవర్‌-ఎఫిషియన్స్‌తో పని చేస్తాయని పేర్కొన్నారు.

స్థానికంగా డేటాను స్టోర్‌ చేసి సావరిన్‌ ఎఐ అవసరాలు తీర్చేలా ఎఐ హబ్‌ పని చేస్తుందని, జెమిని, ఇమేజైన్‌ విఒ, ఇంకా మా ఎఐ మోడళ్ళన్నింటితోపాటు యాప్‌ డెవలప్‌మెంట్‌ కోసం అవసరమైన ఎఐ ప్లాట్‌ఫామ్‌లను హబ్‌ అందిస్తుందన్నారు. దీనిద్వారా ఉద్యోగులు, వ్యాపారులు, యువత అందరి అవసరాలకు ఎఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందుబాటులోకి తీసుకురాగలమని భావిస్తున్నామన్నారు. గూగుల్‌ చాలాకాలంగా ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఇండియాలోని ఐదు కేంద్రాల్లో ప్రస్తుతం 14 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఐదేండ్ల క్రితం తాము భారత్‌లో గూగుల్‌ క్లౌడ్‌ సొల్యూషన్స్‌ సేవలు ప్రారంభించామని, ఇప్పుడు న్యూఢిల్లీ, ముంబయిలలో ఈ సేవలను అందిస్తున్నామని తెలిపారు. గూగుల్‌ డివైస్‌లను ఇండియాలో తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రపంచ వేదికపై విశాఖ గూగుల్‌ ఎఐ హబ్‌ కీలకపాత్ర: నారా లోకేష్‌
విశాఖ ఎఐ హబ్‌ కేవలం ఆంధ్రప్రదేశ్‌, గూగుల్‌కే కాదని, యావత్‌ భారతదేశానికి చరిత్రాత్మకమైందని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. గూగుల్‌ డేటా సెంటర్‌ గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, విస్తతమైన సేవలను అందిస్తుందన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న ఎఐ హబ్‌ కేవలం భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు సేవలు అందించడం మాత్రమే కాదని, ప్రపంచ వేదికపై ఇండియా కీలకపాత్ర పోషించేలా చేస్తుందని తెలిపారు. డేటా ఇంధనం అయితే, డేటా సెంటర్లు రిఫైనరీల లాంటివని తెలిపారు. 12 నెలల్లో పూర్తవుతుందనకున్న ఎఐ హబ్‌ ఎంఒయూ ఒక నెల ఆలస్యమైందని అన్నారు. అందరి సమష్టి కషితో దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్ట్‌ ఆవిష్కతమైందన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ గూగుల్‌ డేటా సెంటర్‌తో ఏపీ ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.

ఎఐ హబ్‌ బలమైన శక్తిగా పని చేస్తుంది: ప్రధాని మోడీ
విశాఖపట్నంలో గూగుల్‌ ఏఐ హబ్‌ ఏర్పాటు ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అన్ని కోణాల నుంచి వచ్చిన ఈ పెట్టుబడిలో గెగావాట్‌ – స్కేల్‌ డేటా సెంటర్‌ల రూపంలో మౌలిక సదుపాయాలు వికసిత్‌ భారత్‌కి దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. సాంకేతికతను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో విశాఖపట్నంలోని గూగుల్‌ ఎఐ హబ్‌ చాలా శక్తివంతంగా పనిచేస్తోందని అభివర్ణించారు. గూగుల్‌ ముందడుగు అందరికీ ఎఐ అనే నినాదానికి ఊతం ఇస్తోందని ఉద్ఘాటించారు.

దేశ ప్రజలకు కటింగ్‌ ఎడ్జి టూల్స్‌ అందించడంలో ఎంతో ఉపకరిస్తోందని వివరించారు. మన డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకి సహకరించడంతోపాటు సాంకేతికతలో ప్రపంచంలో ఇండియాని బలంగా నిలుపుతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దీనికి ముందు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచారు స్పందిస్తూ విశాఖపట్నంలో గూగుల్‌ తొలి ఎఐ హబ్‌కు సంబంధంచిన ప్రణాళిలను పంచుకునేందుకు ప్రధాని మోడీతో మాట్లాడానని, ఈ ఎఐ హబ్‌ ఓ కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. అలాగే విశాఖలో ఎఐ హబ్‌ ఏర్పాటుకు జరిగిన ఎంఒయూపై గౌతమ్‌ అదానీతో పాటు పలువురు స్పందించారు.

ప్రతి కుటుంబానికి ఎఐని దగ్గర చేస్తాం : సీఎం చంద్రబాబు
ప్రతి కుటుంబానికి ఎఐని దగ్గర చేసేలా ప్రయత్నిస్తామని ఏపీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంట్రప్రెన్యూర్‌తో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. గూగుల్‌ విశాఖలో అడుగుపెడుతోందని అన్నారు. గతంలో హైదరాబాద్‌ హైటెక్‌ సిటీని అభివద్ధి చేశామని, ప్రస్తుతం విశాఖను ఐటి హబ్‌గా తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు. అప్పుడు హైదారాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చామని, ఇప్పుడు విశాఖకు గూగుల్‌ను తీసుకొస్తున్నామని అన్నారు. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని, డిజిటల్‌ కనెక్టివిటీ, డేటా సెంటర్‌, ఎఐ, రియల్‌టైమ్‌ డేటా కలెక్షన్లు ముఖ్యమైనవని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుందని పేర్కొన్నారు.

రియల్‌టైమ్‌ డేటా కలెక్షన్లు ముఖ్యమైనవని, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుందని అన్నారు. హార్డ్‌ వర్క్‌ కాదు, స్మార్ట్‌ వర్క్‌ నినాదం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఐదేండ్లలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టడతామనడం సంతోషదాయకమని అన్నారు. కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సాంకేతికత ప్రపంచాన్నే మర్చేస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -