– జీవనోపాధిపై తీవ్ర ప్రభావం
– ఇప్పటికే పలు ఉద్యోగాలు ఊస్ట్
– హెచ్చరిస్తున్న నిపుణులు
న్యూఢిల్లీ : సాంకేతిక ప్రపంచంలో రోజురోజుకూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో కృత్రిమ మేధ (ఏఐ) కీలకంగా మారింది. దీని రాక మధ్యతరగతి ప్రజలకు ముప్పుగా మారే అవకాశం ఉన్నదని సాంకేతిక నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏఐ వల్ల మధ్యతరగతి ప్రజలు ఆధారపడిన జీవనోపాధిపై దెబ్బ పడుతుందని చెప్తున్నారు. పలు కంపెనీలలో మానవులు చేసే పలు ఉద్యోగాలను యాజమాన్యాలు ఏఐతో భర్తీ చేస్తుండటం శాపంగా పరిణమించింది. దీనిపై భారతదేశ పరిస్థితులకు సంబంధించి మెకిన్సే నివేదిక ఆందోళనను వ్యక్తం చేసింది.
ఏఐ ప్రమేయంతో దేశ సామాజిక ఆర్థిక నిర్మాణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సామూహిక నిరుద్యోగం ఎదురయ్యే ప్రమాదముంది. అసమానతలు పెరుగుతాయి. మానవ గౌరవం దెబ్బతినే పరిస్థితులు ఎదురవుతాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. కొన్ని గణాంకాల ప్రకారం భారత్‌లో దాదాపు 38 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే, వీరిలో ఏఐ ప్రభావంతో స్వల్పంగా నికర ఉద్యోగ నష్టం కూడా విపత్తును కలిగిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ప్రతీ ఏటా 1.2 కోట్ల మంది యువత ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారన్నది ఒక అంచనా. విపరీతమైన పోటీని తట్టుకొని ఉద్యోగ ప్రపంచంలో కొత్తగా అడుగుపెడుతున్నవారికి.. ఏఐ రూపంలో భయం పట్టుకుంటున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
మెకిన్సే అంచనాల ప్రకారం 23 శాతం రోల్స్ రూపాంతరం చెందాయి. 83 మిలియన్ల పొజిషన్లు తొలగించబడ్డాయి. పలు సంస్థలు నిర్ణయాత్మక పనులను ఆటోమేట్ చేయటంతో లక్షలాది మంది భారతీయులు ఉద్యోగ, ఉపాధికి దూరమయ్యారు. డిజిటల్ పరికరాలు, వేదికలను ఉపయోగించి చేసే పనులను డిజిటల్ లేబర్ అంటారు. అయితే, ఈ డిజిటల్ లేబర్‌పై ఏఐ ప్రభావంతో ఆకస్మిక నిరుద్యోగం ఏర్పడుతుంది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి క్రమంగా వ్యక్తుల సామాజిక గౌరవం, భద్రతపై ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా, సేవారంగంపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్న మధ్యతరగతి ప్రజలకు ఏఐ ఒక శాపంగా మారనుందని హెచ్చరిస్తున్నారు. ప్రతీరంగంలోనూ ఏఐ వినియోగం అనేది ఒక వ్యసనంగా మారింది. ప్రతీ చిన్న పనులకూ దీనిని వాడటం వైపే సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయటం, పనితీరు అంచనాలను రూపొందించటం వంటివి కూడా దీనితోనే జరుగుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. ఏఐ విపరీత వినియోగం పై ప్రభుత్వాలు దృష్టిని సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగ, ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడకుండా దానిని నియంత్రిం చేందుకు సంబంధిత ఫ్రేమ్‌వర్క్‌ను వేగవంతం చేయాలని అంటున్నారు.
మధ్యతరగతికి ఏఐ ముప్పు
- Advertisement -
- Advertisement -