ఆవిష్కరణలకు అది అడ్డంకి కాదు
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
గ్లోబల్ స్ట్రాటెజిక్ సంస్థల సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భద్రతను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు అడ్డంకిగా కాకుండా, 21వ శతాబ్దపు ‘ఏరోడైనమిక్స్’గా భావిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతోన్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ లో గురువారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా డిజిటల్ గవర్నెన్స్ అడ్వయిజరీ, ఆల్ బ్రైట్ స్టోన్‌బ్రిడ్జ్ గ్రూప్ (డీజీఏఏఎస్‌జీ) లాంటి గ్లోబల్ స్ట్రాటెజిక్ అడ్వయిజరీ సంస్థల ప్రతినిధులు, ఏఐ సేఫ్టీ కనెక్ట్ సంస్థల నిపుణులను ఉద్దేశించి మాట్లాడారు.
విమానయాన రంగం ప్రారంభ దశలో భద్రతపై ఆందోళనలు ఉన్నప్పటికీ.. సీటు బెల్టులు, రాడార్ వంటి కఠినమైన భద్రతా ప్రమాణాలు ఆ రంగాన్ని ఆపలేదనీ, మరింత ఎత్తుకు ఎదగడానికి అవి అవకాశాన్ని కల్పించాయని ఆయన గుర్తుచేశారు. ఏఐకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి ఏఐ హబ్‌గా ఎదగడం ద్వారా 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే తెలంగాణ లక్ష్యమని మంత్రి చెప్పారు.
తొలి నెట్-జీరో నగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’
సుస్థిరతను ప్రధాన వృద్ధి వ్యూహంగా తెలంగాణ ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తోందన్నారు. కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా.. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుస్థిరమైన జీవనానికి అనుగుణంగా ‘ఏఐ సిటీ’ని, దేశంలోనే తొలి నెట్-జీరో నగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లను తీర్చిదిద్దుతున్నట్టు శ్రీధర్‌బాబు చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి సార్వభౌమ ఏఐ హబ్ ‘ఐకామ్’ (ఏఐకామ్)ను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. అలాగే తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ (టీజీ డెక్స్) పేరిట ప్రపంచంలోనే తొలి సావరిన్ ఓపెన్ డేటా పైప్‌లైన్‌ను నిర్మించామన్నారు. దీని ద్వారా 28 ప్రభుత్వ శాఖలకు చెందిన 1,084 డేటాసెట్ల (500 జీబీ)ను ప్రజోపయోగంగా మార్చినట్టు తెలిపారు.
ప్రస్తుతం 360 ఏఐ మోడల్స్ ఈ డేటాను వినియోగించుకుంటుండగా.. 950 మందికి పైగా నిపుణులు, అంకుర సంస్థలు ఈ ప్లాట్‌ఫామ్‌పై చురుకుగా పనిచేస్తున్నాయన్నారు. ప్రోయాక్టివ్ గవర్నెన్స్‌లో భాగంగా 2027 నాటికి ‘ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫారమ్’ (ఐడీఎస్‌పీ) ద్వారా 4 కోట్ల మంది పౌరులకు 300కు పైగా ప్రభుత్వ సేవలను అరచేతిలోనే అందించనున్నట్టు వెల్లడించారు. మూసీ నది పునరుజ్జీవం నుంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తరగతి గదుల వరకు భవిష్యత్తు కోసం 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. సాంకేతికత అనేది… పీల్చే గాలిలాగా అత్యవసరంగా, అదృశ్యంగా, అన్నింటికంటే మించి సురక్షితంగా ఉండే భవిష్యత్తు కోసం తాము శ్రమిస్తున్నామని స్పష్టం చేశారు.



