Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయంఏఐ అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి

ఏఐ అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి

- Advertisement -

ఇది మానవ చరిత్ర పరివర్తనలో భాగం : ప్రధాని మోడీ
ఏఐ భవిష్యత్తు కీలుబొమ్మలా మారదు : యూఎన్‌సెక్రెటరీ జనరల్‌

న్యూఢిల్లీ : కృత్రిమ మేథ (ఎఐ) అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో గురువారం మోడీ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని అత్యంత చారిత్రాత్మక ఏఐ సమ్మిట్‌కు మీ అందరికీ నా స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్‌ పూల్‌కు భారతదేశం కేంద్రం. భారత్‌లో ఏఐ సమ్మిట్‌ నిర్వహించడం గ్లోబల్‌ సౌత్‌కు గర్వకారణం. సిగ్న‌ల్స్‌ను మొదట వైర్‌లైస్‌గా ప్రసారం చేసినప్పుడు ఒకరోజు మొత్తం ప్రపంచం రియల్‌ టైమ్‌కి అనుసంధానించబడి ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

కృత్రిమ మేథస్సు అనేది మానవ చరిత్ర యొక్క ఒక పరవర్తన. ఈరోజు మనం చూస్తున్నది, మనం అంచనా వేస్తున్నది దాని ప్రభావానికి ప్రారంభం మాత్రమే అని ఆయన అన్నారు. భారత్‌ ఏఐని ప్రయోజనకర రీతిలో చూస్తుంది. అందుకే మేము ‘సర్వజన్‌ హితయే, సర్వజన్‌ సుఖయే’ను థీమ్‌గా ఎంచుకున్నాం. అందరికీ, ముఖ్యంగా గ్లోబల్‌ సౌత్‌కు ప్రజాస్వామ్యబద్ధగా ఉండటానికి మనకు ఏఐ అవసరం అని అన్నారు. అలాగే ఎఐ యంత్రాలను తెలివైనవిగా మారుస్తోంది. కానీ అంతకంటే ఎక్కువగా ఇది మానవ సామర్థ్యాలను అనేక రెట్లు పెంచుతోంది అని మోడీ అన్నారు. ‘ఏఐ రంగంలో భారత్‌ కీలక పాత్ర’- సమ్మిట్‌లో యూఎన్‌ చీఫ్‌, టెక్‌ దిగ్గజాల ప్రసంగం

ఏఐ భవిష్యత్‌ను కొందరు నిర్ణయించలేరు: యూఎన్‌ చీఫ్‌
గ్లోబల్‌ సౌత్‌లో మొదటి ఏఐ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న భారత్‌కు యూఎన్‌ సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ అభినందనలు తెలియజేశారు. భారత్‌లో జరిగే ఈ ఏఐ సమ్మిట్‌కు ప్రత్యేక అర్థం ఉందని చెప్పారు. ఏఐ భవిష్యత్తును కొన్ని దేశాలు లేదా కొంత మంది బిలియనీర్లు నిర్ణయించలేరని స్పష్టం చేశారు. నిజమైన ఇంపాక్ట్‌ అంటే జీవితాలను మెరుగుపరిచి, భూమిని రక్షించే సాంకేతికత అని అభిప్రాయపడ్డారు.

దేశంలో మార్పుల వేగాన్ని చూసి ఆశ్చర్యపోతున్నా : సుందర్‌ పిచాయ్
తాను భారత్‌ను సందర్శించిన ప్రతిసారీ దేశంలో మార్పుల వేగాన్ని చూసి ఆశ్చర్యపోతున్నానని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్ స్పష్టం చేశారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్‌కు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ మీదుగా వెళ్లేవాడిని తెలిపారు. ఇప్పుడు తీరప్రాంత నగరమైన అదే విశాఖపట్నంలో గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ ఏఐ హబ్‌ ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఈ హబ్‌ గిగా వాట్‌ స్కేల్‌ కంప్యూటర్‌, కొత్త అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్‌ గేట్‌వేను కలిగి ఉంటుందని అన్నారు. దీని వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. అలాగే భారత ప్రజలకు అత్యాధునిక ఏఐ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

ప్రతి పౌరుడికి ఏఐని అందించడమే లక్ష్యం : టాటా సన్స్‌ చైర్మెమన్‌ చంద్రశేఖరన్‌
ప్రజలపై ఏఐ చాలా బలమైన ప్రభావాన్ని చూపుతుందని టాటా సన్స్‌ చైర్మెన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ అభిప్రాయపడ్డారు. సమాజంపై తీవ్ర ప్రభావం చూపే తదుపరి ప్రధాన మౌలిక సదుపాయం ఏఐయేనని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఏఐ టూల్స్‌ అందేలా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్యక్రమాలకు భారత్‌ సాక్షిగా నిలుస్తోందన్నారు.

ఏఐతో అవకాశాలతో పాటు సవాళ్లూ ఉన్నాయి : ఆంథ్రోపిక్‌ సీఈఓ
ఏఐ రంగంలో భారత్‌ కీలక పాత్ర పోషించనుందని ఆంథ్రోపిక్‌ సీఈఓ డారియో అమోడెయ్ అభిప్రాయపడ్డారు. గత రెండున్నరేళ్లలో ఏఐ రంగంలో భారత్‌ మంచి పురోగతి సాధించిందని పేర్కొన్నారు. అందుకే ఇటీవల వారంలో బెంగళూరులో తాము ఒక కార్యాలయాన్ని ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు.

118 దేశాలు హాజరు
గ్లోబల్‌ సౌత్‌లో మొదటిసారి జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో 118 దేశాలు పాల్గొన్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏఐ సదస్సు ఇదేనని పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసిన దేశాధినేతలు, నాయకులు, టెక్‌ నిపుణులకు ధన్యవాదాలు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -