Saturday, February 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏఐ స్టార్టప్‌ విలేజ్‌ ఏర్పాటుకు సిద్ధం

ఏఐ స్టార్టప్‌ విలేజ్‌ ఏర్పాటుకు సిద్ధం

- Advertisement -

హైదరాబాద్‌లో ఏఐ వార్‌ రూమ్‌
దేశాన్ని ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా నిర్మించాలి
ఇందుకోసం ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం : ఢిల్లీ ‘ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026’లో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రస్తుతం యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో భారత్‌ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. కృత్రిమ మేధస్సు వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్‌, ఇంటర్నెట్‌ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తు చేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదనీ, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని అభివర్ణించారు.

మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదనీ, విశ్లేషించగలదనీ, నిర్ణయాలు తీసుకోగలదని పేర్కొన్నారు. రోబోటిక్స్‌తో కలిసినప్పుడు యంత్రాలు మానసిక మేధస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని అన్నారు. ప్రపంచంలో ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందనీ, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్‌ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో విజయం సాధించిన భారత్‌, ప్రపంచ స్థాయి కోర్‌ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని అన్నారు. దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్‌మ్యాప్‌ అవసరమని స్పష్టం చేశారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో సెమీకండక్టర్‌ చిప్‌ తయారీ, జీపీయూ సామర్థ్యాలు, డేటా సెంటర్లు, గ్రీన్‌ ఎనర్జీ వినియోగం, ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు, అప్లికేషన్లలో భారత్‌ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం-రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ”ఏఐ వార్‌ రూమ్‌” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్‌ రూమ్‌ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సూచించారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనల ను ప్రస్తావిస్తూ, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని అన్నారు. అయితే సరైన రీ-స్కిల్లింగ్‌, అప్‌-స్కిల్లింగ్‌ చర్యల ద్వారా ఏఐ వల్ల సృష్టించబడే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

యువతను ఏఐ-ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్టార్టప్‌లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ”ఏఐ స్టార్టప్‌ విలేజ్‌”ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ అభివృద్ధి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్‌ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పని చేయాలని ఆయన కోరారు. ఈ మార్పు యుగంలో భారత్‌ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -