నవతెలంగాణ-హైదరాబాద్:కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్(AI Summit Delhi)లో ప్రసంగించిన సీఎం, ఏఐ మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని అభివర్ణించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సూచించారు.
ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ అభివృద్ధి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. ఈ మార్పు యుగంలో భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని ఆయన స్పష్టం చేశారు.



