Saturday, February 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎ.ఐ: డేటా ఎవరిది? లాభాలు ఎవరికి?

ఎ.ఐ: డేటా ఎవరిది? లాభాలు ఎవరికి?

- Advertisement -

మనం జీవిస్తున్న కాలాన్ని ”ఏఐ (Artificial Intelligence) యుగం”గా చెప్పుకుంటే అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే.. ఇకపై కృత్రిమ మేధస్సు ప్రయోగశాలలకు మాత్రమే పరిమితం కాదు, మన జీవితంలోకి ఒక శక్తిగా ప్రవేశిస్తుంది. ఇది మన కాలపు అత్యంత శక్తివంతమైన సాంకేతిక విప్లవం. డేటా అనే ఇంధనంతో, ఆల్గోరిథమ్స్‌ అనే యంత్రాంగంతో, అపార గణనశక్తితో దూసుకొస్తున్న ఈ విప్లవం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఉపాధి నిర్మాణాన్ని, జ్ఞాన ఉత్పత్తి విధానాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇది ఇప్పుడు సాంకేతిక అభివృద్ధిని మాత్రమే కాదు, ఆధునిక సమాజ రూపురేఖలనే మార్చే పరిణామంగా ముందుకొస్తోంది. విద్యా వైద్యం నుంచి వ్యవసాయం వరకు, పరిశ్రమల నుంచి పరిపాలన వరకు ప్రతీ రంగంలోనూ దీని ప్రభావాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఒక్కటే… ఈ సాంకేతిక విప్లవం మానవ సమాజాన్ని సమానత్వ దిశగా నడిపిస్తుందా? లేక సంపద కేంద్రీకరణకు మరో ఆయుధంగా మారుతుందా?

చరిత్రలోకి చూస్తే మూడు మహా పరివర్తన దశలు స్పష్టంగా కనిపిస్తాయి. వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఇప్పుడు మనం జీవిస్తున్న డిజిటల్‌ విప్లవం. ఈ ప్రతి సాంకేతిక విప్లవం సమాజానికి ఒక గొప్ప వాగ్దానం చేసింది. వ్యవసాయ విప్లవం ”ఆహార భద్రత”ను వాగ్దానం చేసింది. పారిశ్రామిక విప్లవం ”సమృద్ధి”ని వాగ్దానం చేసింది. ఇప్పుడు డిజిటల్‌-ఏఐ విప్లవం సైతం అపారమైన ”మేధో అవకాశాలు”ను వాగ్దానం చేస్తోంది. కానీ, ఈ ప్రతి దశలోనూ చరిత్ర పదేపదే నిరూపించిన సత్యం ఒకటే… అదేమిటంటే, ”వాగ్దానాలు అందరికీ, లాభాలు మాత్రం కొందరికే”. వ్యవసాయ విప్లవం మనిషిని స్థిర జీవనానికి తీసుకు వచ్చింది. భూమి ఉత్పత్తి సాధనంగా మారింది. భూ యాజమాన్యమే అధికారానికి పునాది అయింది. సమాజం వర్గీకృతమైంది. అసమానత వ్యవస్థీకృతమైంది. పారిశ్రామిక విప్లవం ఈ నిర్మాణాన్ని కూల్చలేదు, అది రూపం మార్చింది. యూరప్‌లో మొదలైన ఆ మార్పు యంత్రాన్ని, పెట్టుబడిని కేంద్రంగా పెట్టింది. ఉత్పత్తి సామర్థ్యం విపరీతంగా పెరిగింది. కానీ, యంత్రం ఎవరి చేతుల్లో వుందో వారే సంపదను సొంతం చేసుకున్నారు. కార్మికశ్రమ మార్కెట్‌లో వస్తువుగా మారింది. మరి డిజిటల్‌ విప్లవం ఏం చేయబోతోంది.


ఏఐ రాకతో డిజిటల్‌ విప్లవం అసాధారణమైన శక్తిని సంతరించుకుంది. ఇది కేవలం శ్రమను కాదు, ఆలోచనను కూడా యంత్రాలతో పంచుకుంటోంది. డేటా సేకరణ, విశ్లేషణ, నిర్ణయాలు.. ఇవన్నీ ఆల్గోరిథమ్‌ల చేతుల్లోకి వెళ్తున్నాయి. మానవ మేధస్సు కూడా ఇప్పుడు కొలవదగిన, ప్రోగ్రాం చేయదగిన వనరుగా మారుతోంది. ఏఐ – కేవలం మరో సాంకేతిక సాధనం కాదు, అది ఒక శక్తి సమీకరణం. సమాచా రాన్ని గ్రహించి, విశ్లేషించి, నమూనాలు గుర్తించి, అంచనాలు వేయగల వ్యవస్థ. మనిషి మేధస్సు చేసే పనుల్లో కొన్ని యంత్రాలకు అప్పగించగల స్థాయికి టెక్నాలజీ చేరిన దశ ఇది. అందుకే దీని శక్తిసామర్థ్యాలు విస్తృతమైనవి.
ఏఐ ప్రధాన శక్తి డేటా విశ్లేషణలో అసాధారణ సామర్థ్యం. లక్షల కోట్ల డేటాలో దాగి ఉన్న నమూనాలను క్షణాల్లో గుర్తించి వ్యాధి నిర్థారణ, మార్కెట్‌ ధోరణులు, వాతావరణ మార్పులు వంటి అంశాలను ముందుగానే అంచనా వేయగలదు. పునరావృత పనులు, భారీ లెక్కలు, క్రమబద్ధమైన ప్రాసెసింగ్‌ వంటి కార్యాలను వేగంగా, తప్పుల్లేకుండా పూర్తిచేసి పరిశ్రమల్లో ఖర్చు తగ్గిస్తుంది, సేవారంగంలో వేగం పెంచుతుంది. ప్రభుత్వ పనుల్లో ఆలస్యం తగ్గిస్తుంది. భవిష్యత్‌ అంచనాల ద్వారా పంట దిగుబడులు, వ్యాధి వ్యాప్తి వంటి విషయాల్లో ముందస్తు నిర్ణయాలను మెరుగుపరుస్తుంది. విద్య, ఆరోగ్య, వ్యవసాయ సూచనలు అందిస్తుంది. రచన, అనువాదం వంటి సాంకేతికతలతో స్థానిక భాషల్లో జ్ఞానాన్ని ప్రజలకు చేరువచేస్తుంది. సంగీత పరిశోధనల్లో సహాయకారిగా సృజనాత్మక ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్య అత్యవసరాల్లో ముందస్తు హెచ్చరికలు ఇచ్చి సంక్షోభ నివారణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ఇవన్నీ కలిపి చూస్తే, ఏఐ ఒక అసాధారణమైన శక్తిగా కనిపిస్తుంది. దాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే ప్రజల అభివృద్ధికి ఇదొక తిరుగులేని సాధనం. ఇది ఉత్పాదకతను పెంచగలదు. ఖర్చులను తగ్గించగలదు. సేవలను సమర్థవంతం చేయగలదు. జ్ఞానాన్ని, అవకాశాలను విస్తరించగలదు. కానీ, ఒక సత్యం గుర్తుంచుకోవాలి. మంచిగానీ, చెడుగానీ అది స్వతహాగా ఏదీ చేయదు. ఏఐ శక్తి దాని వినియోగంపై ఆధారపడి ఉంటుంది. అది ప్రపంచాన్ని సమాన అవకాశాల దిశగా మలచగలదు, అసమానతను మరింత గాఢం చేసే దిశగానూ నడుపగలదు.

ప్రస్తుత ప్రపంచ దృశ్యాన్ని చూస్తే రెండు ప్రధాన నమూనాలు కనిపిస్తాయి. మొదటిది అమెరికా నమూనా. అక్కడ ఏఐ అభివృద్ధి పూర్తిగా ప్రయివేటు పెట్టుబడిపై ఆధారపడు తోంది. పరిశోధన, ప్రతిభ, ఆవిష్కరణలన్నీ భారీ కార్పొరేట్‌ పెట్టుబడుల చుట్టూ తిరుగుతున్నాయి. డేటా, డిజిటల్‌ వేదికలు, ఆల్గోరిథమ్‌లు కొద్దిమంది టెక్‌ దిగ్గజాల చేతుల్లో కేంద్రీకృతమయ్యాయి. వెంచర్‌ క్యాపిటల్‌ ప్రవాహం, స్టాక్‌ మార్కెట్‌ అంచనాలు, మోనోపోలీ స్థాయి టెక్‌ దిగ్గజాల ఆధిపత్యం… ఇవన్నీ ఆ నమూనా స్వభావాన్ని నిర్ధారిస్తున్నాయి. ఇక్కడ ఏఐ ఒక ప్రజా సాధనం కాదు, అది వ్యాపార ఆస్తి. డేటా ప్రజల జీవితాల నుంచి సేకరించబడుతుంది, కానీ, దాని విలువ షేర్‌ హోల్డర్లకు చేరుతుంది. ఆల్గోరిథమ్‌లు పారదర్శకత కంటే లాభదాయకతను ముందుకు నెడతాయి. పోటీ పేరుతో కొన్ని కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా డేటా మౌలిక వసతులను నియంత్రించే స్థాయికి చేరాయి. ఫలితంగా డిజిటల్‌ ప్రజాస్వామ్యం క్రమంగా మార్కెట్‌ ఆధిపత్యంగా మారుతోంది. ఏఐ శక్తి సామూహిక ఆస్తిగా కాక, కార్పొరేట్‌ మూలధనంగా మారుతున్న ప్రమాదం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక రెండోది చైనా నమూనా. అక్కడ ఏఐ అభివృద్ధి ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. ఒక వ్యూహాత్మక దిశలో ముందుకు సాగుతోంది. దీర్ఘకాల ప్రణాళిక, ప్రభుత్వ పెట్టుబడులు, నియంత్రణలు, స్వదేశీ టెక్నాలజీ సామర్థ్యాల పెంపు… ఇవి ఆ దిశను నిర్ణయిస్తున్నాయి. తయారీ రంగంతో ఏఐని సమన్వయం చేయడం, స్వంత చిప్‌ పరిశ్రమను అభివృద్ధి చేయడం, భారీ డేటా మౌలిక వసతులు నిర్మించడం లాంటివన్నీ వేగవంతమైన పురోగతికి దారి తీస్తున్నాయి. అక్కడ సాంకేతికతను కేవలం మార్కెట్‌ లాభాలకే పరిమితం చేయడంలేదు, జాతీయ అభివృద్ధి వ్యూహంలో భాగం చేస్తున్నారు. ముఖ్యంగా ఆవిష్కరణలను స్వదేశీ సామర్థ్యంగా మార్చుకోవడంలో చైనా దృఢ సంకల్పం గమనించదగినది. ఏఐను దిగుమతి చేసుకునే సాంకేతికతగా కాక, స్వయంగా సృష్టించే శక్తిగా అభివృద్ధి చేయాలన్న దృష్టి అక్కడ స్పష్టంగా ఉంది.

మరి ఈ ఆధునికశక్తి సమీకరణంలో భారత్‌ ఎక్కడ నిలబడి ఉంది? మన దగ్గర విస్తారమైన డేటా ఉంది. యువ జనాభా, డిజిటల్‌ వినియోగం, చవక ఇంటర్నెట్‌ మనకు బలమైన వనరులుగా ఉన్నాయి. కానీ, ఆ డేటాకు విలువను సృష్టించే మౌలిక వసతులు మనవేనా? ఆధునిక చిప్‌ తయారీ, అధిక సామర్థ్య కంప్యూటింగ్‌, ప్రాథమిక ఏఐ పరిశోధనలపై తగిన కేంద్రీకరణ లేదు. మనం సాంకేతిక సృష్టికర్తలమా? లేక కేవలం వినియోగదారులం మాత్రమేనా? ఇదే కీలక ప్రశ్న. మన దేశంలో ప్రాథమిక పరిశోధనలపై పెట్టుబడులు తక్కువ. విశ్వవిద్యా లయాలు-పరిశ్రమల అనుసంధానం పరిమితం. హై-ఎండ్‌ చిప్‌ తయారీ, భారీ కంప్యూటింగ్‌ మౌలిక వసతులు, స్వదేశీ ఏఐ మోడళ్ల అభివృద్ధి.. ఇవన్నీ ఇంకా కనీస దశలో కూడా లేవు. సమ్మిట్‌లలో పెద్ద లక్ష్యాలు వినిపిస్తున్నా, పరిశోధనలూ ప్రయోగశాలల్లో మాత్రం అవసరమైన కార్యాచరణ కనిపించడం లేదు. దీన్ని అధిగమించకపోతే, మనం ప్రపంచానికి కేవలం డేటా వనరుగా, చవక శ్రమ వనరుగా, వినియోగదారుల మార్కెట్‌గా మారే ప్రమాదం ఉంది. డేటా మన ప్రజలదయి, దాని విలువను సృష్టించే వేదికలు ఇతరులవైతే, అది ఆధునిక రూపంలోని వలసవాదమే అవుతుంది. ఇది కేవలం సాంకేతిక వెనుకబాటుతనం కాదు, ఆలోచనా వెనుకబాటుతనం. పరిశోధనను ఖర్చుగా కాక పెట్టుబడిగా చూడగల దృక్పథం అవసరం. లేకపోతే మనం డిజిటల్‌ యుగంలో కూడా ముడి వనరులు సరఫరా చేసే దేశంగానే మిగిలిపోతాం.

అంతిమంగా మనం గుర్తించాల్సిన అంశమేమింటే.. ఏఐ మనిషిని భర్తీ చేయడానికి వచ్చిన విప్లవం కాదు, మనిషి సామర్థ్యాలను విస్తరించేందుకు వచ్చిన శక్తి. కానీ, చరిత్ర మనకు నేర్పిన పాఠం ఏమిటి? ప్రతి శక్తివంతమైన సాధనం రెండు దిశల్లో ప్రయాణించగలదు. ఒక దిశ అసమానతలు లేని అభివృద్ధి వైపు, మరో దిశ ఆధిపత్యం వైపు. ఏఐ సమాన అవకాశాలను విస్తరించగలదు. గ్రామీణ విద్యార్థికి ఉత్తమ బోధన అందించగలదు. చిన్న రైతుకు శాస్త్రీయ సూచనలు ఇవ్వగలదు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా మార్చగలదు. వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురాగలదు. ఇవన్నీ మానవ గౌరవాన్ని పెంచే దిశలు. అదే సమయంలో, ఇదే టెక్నాలజీ ఉద్యోగాలను అస్థిరం చేయగలదు. డేటాను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించ గలదు. వ్యక్తిగత గోప్యతను క్షీణింపజేయగలదు. ప్రజల ప్రవర్తనను అంచనా వేసి నియంత్రించే నిఘా సాధనంగా కూడా మారగలదు. ఇవి ఆధునిక ఆధిపత్య రూపాలు.

ఇప్పుడు ప్రశ్న ఏఐ శక్తి గురించి కాదు, ఈశక్తి ప్రజల నియంత్రణలో ఉంటుందా? లేక మార్కెట్‌ నియంత్రణలో ఉంటుందా? దాని దిశను నిర్ణయించేది ఎవరు? మనం దాన్ని విముక్తి సాధనంగా మలిస్తే, అది మానవ సామర్థ్యాల వికాసానికి దోహదం చేస్తుంది. ఆధిపత్య యంత్రంగా మలిస్తే, అది అసమానతలను మరింత గాఢం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చర్చ జరగాల్సింది ఏఐ సాంకేతిక సామర్ధ్యం గురించి కాదు, దానిపై యాజమాన్యం, నియంత్రణ, లాభాల పంపిణీ గురించి. ఏఐ ఎవరికి సేవ చేస్తుంది? ప్రజలకా? లేక కార్పొరేట్లకా? భవిష్యత్తు ఏఐ కోడ్‌లలో లేదు, దాని నియంత్రణలో దాగివుంది.

రమేష్‌ రాంపల్లి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -