Tuesday, January 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు25న హైదరాబాద్‌లో ఐద్వా బహిరంగసభ

25న హైదరాబాద్‌లో ఐద్వా బహిరంగసభ

- Advertisement -

ఎస్వీకే నుంచి బస్‌భవన్‌ గ్రౌండ్‌ వరకు మహిళల ప్రదర్శన
25 నుంచి 28 వరకు ఐద్వా అఖిల భారత 14వ మహాసభలు
హాజరుకానున్న ఐద్వా జాతీయ నేతలు : టి.జ్యోతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈనెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌ ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఐద్వా 14వ జాతీయ మహాసభలు జరుగనున్నాయనీ, వాటిని పురస్కరించుకుని 25న హైదరాబాద్‌లో నిర్వహించే మహిళల ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా జాతీయ నాయకులు టి.జ్యోతి పిలుపునిచ్చారు. ఇంటికో మహిళ, గ్రామానికి ఒక బస్సు తరలివచ్చే విధంగా ఇంటింటి ప్రచార క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. బహిరంగ సభ నిమిత్తం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్‌భవన్‌ పక్కనున్న గ్రౌండ్‌ను సోమవారం సందర్శించారు. సభాస్థలిని పరిశీలించిన వారిలో జ్యోతితో పాటు ఐద్వా అఖిల భారత 14వ మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌, ఆర్‌.శ్రీరామ్‌ నాయక్‌, పైళ్ల ఆశయ్య, బి.ప్రసాద్‌ ఎం. శోభన్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ..25న బాగ్‌లింగంపల్లి సుందర్య పార్కు నుంచి నారాయణగూడ మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డు బస్‌భవన్‌ వరకు మహిళల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

బహిరంగ సభలో ఐద్వా సీనియర్‌ నేత బృందాకరత్‌, సుభాషిణి ఆలీ, అఖిల భారత అధ్యక్షులు శ్రీమతి, ప్రధాన కార్యదర్శి మరియం దావలే, కోశాధికారి ఎస్‌.పుణ్యవతి తో పాటు అనేకమంది నేతలు పాల్గొని మాట్లాడుతారని చెప్పారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, లైంగిక దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను వంటింటికే పరిమితం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ తిరోగమన విధానాలను అమలు చేయడానికి సిద్ధపడుతుందని విమర్శించారు. లైంగిక దాడులకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించక పోగా జైళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి గుర్రాల మీద ఊరేగిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలకు నోచుకోలేదని విమర్శించారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు పెరిగాయనీ, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని చెప్పారు. లేబర్‌ కోడ్‌లతో రాత్రివేళల్లో మహిళలు కంపెనీల్లో పనిచేయాల్సి వస్తుందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మంది వ్యవసాయ కార్మిక మహిళలకు రాజ్యాంగబద్ధంగా పని కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పని హక్కును దెబ్బ కొట్టిందని విమర్శించారు. ఉన్నత విద్యారంగంలో అశాస్త్రీయ భావాలను నింపే విధంగా న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీని తీసుకొస్తున్న తీరును ఎండగట్టారు. దేశవ్యాప్తంగా పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయనీ, దాని ప్రభావం మహిళలపై తీవ్రంగా పడుతున్నదని చెప్పారు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను ఎదుర్కొంటున్న తీరును వివరించారు. వాటన్నింటిపైనా జాతీయ మహాసభలలో చర్చించి భవిష్యత్తు ఆందోళన పోరాటాలకు కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -