Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయంఏఐఐఈఏ ఉపాధ్యక్షులు బి.సాన్యాల్‌ కన్నుమూత

ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు బి.సాన్యాల్‌ కన్నుమూత

- Advertisement -

అనారోగ్యంతో చికిత్స పొందుతూ..
న్యూఢిల్లీ :
ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఎఐఐఈఏ) ఉపాధ్యక్షులు బి. సాన్యాల్‌ సోమవారం ఉదయం రారుపూర్‌లో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాన్యాల్‌ ఇక్కడి ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూనే సాన్యాల్‌ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సాన్యాల్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. సాన్యాల్‌ ఆకస్మిక మృతిపై ఎఐఐఇఎ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది. సాన్యాల్‌ లోటు పూడ్చలేదని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సాన్యాల్‌ కేవలం ఎఐఐఈఏ యొక్క సీనియర్‌ ఆఫీస్‌ బేరర్‌ మాత్రమే కాదని, ఒక మార్గదర్శక శక్తిగా, అవిశ్రాంత పోరాట యోధుడిగా, కార్మిక వర్గానికి నిస్వార్థ సేవ యొక్క స్వరూపంగా నిలిచారని ప్రకటనలో పేర్కొంది. అరుదైన నిబద్ధత, వినయం కలకలిసిన కామ్రేడ్‌గా అభివర్ణించింది. అన్ని అడ్డంకులను ఎదుర్కొని దృఢంగా నిలిచారని, సమిష్టి పోరాటం, కార్మిక వర్గ ఐక్యతపై అచంచలమైన నమ్మకంతో ఉన్నారని తెలిపింది. కార్మిక వర్గం యొక్క విముక్తి సిద్ధాంతం పట్ల సాన్యాల్‌ నిబద్ధత ఆదర్శప్రాయమైనదని, అనుసరించదగినదని తెలిపింది. సాన్యాల్‌ కేవలం ఎఐఐఇఎ జాయింట్‌ సెక్రటరీ, ఉపాధ్యక్షులనే కాకుండా సిజెడ్‌ఐఇఎ, ఆర్‌డిఐఇయు రారుపూర్‌ జనరల్‌ సెక్రెటరీగానూ బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేసింది. అలాగే, సాన్యాల్‌ ఉద్యమం కేవలం బీమా ఉద్యోగులకే పరిమితం కాలేదని, అసంఘటిత కార్మికుల ఉద్యమంలో ప్రదానంగా బొగ్గు కార్మికుల ఉద్యమంలో కూడా చురుకుగ్గా పాల్గొన్నారని, అదేవిధంగా అనేక ఏండ్లపాటు సీఐటీయూ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారని తెలిపింది. దేశంలోని ప్రగతిశీల, ప్రజాస్వామ్య ఉద్యమంతో చాలా దగ్గరగా పనిచేశారని తెలిపింది. ఇక బీమా ఉద్యోగుల ఉద్యమంలో ఆయన ప్రయాణం ఒక ప్రేరణగా పేర్కొంది. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన సాన్యాల్‌ తన నిజాయితీ, అంకిత భావం, తెలివితేటలు, సమగ్రత ద్వారా ఉద్యోగుల గౌరవం, ప్రశంసలను నిరంతరం పొందారని తెలిపింది, అనారోగ్యంతో బాధపడుతూ కూడా సాన్యాల్‌ ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల గురించి తీవ్ర ఆందోళన చేశారని ప్రకటనలో ఎఐఐఈఏ గుర్తు చేసింది. ఆయన వదిలిన ఆదర్శాలు, పనితీరు, విశ్వాసాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తమ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నట్లు ఎఐఐఈఏ ప్రకటనలో స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -