Saturday, April 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎఐకెఎస్‌ తొంభైయేళ్ల ప్రయాణం - చారిత్రక రైతు ఉద్యమం

ఎఐకెఎస్‌ తొంభైయేళ్ల ప్రయాణం – చారిత్రక రైతు ఉద్యమం

- Advertisement -

ఏప్రిల్‌ 11, 2026. భారతీయ రైతాంగ చరిత్రలో ఇదొక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. దేశంలోని రైతులను ఒకే తాటిపైకి తెచ్చి, వారి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ‘అఖిల భారత కిసాన్‌ సభ’ నేటితో తొంభై వసంతాలను పూర్తి చేసుకుంటోంది. 1936లో ఉత్తరప్రదేశ్‌, లక్నో వీధుల్లో చిన్న మొలకగా ప్రారంభమైన ఈ సంస్థ, నేడు కోట్లాది మంది రైతుల గొంతుకగా మారి మహా వఅక్షంలా విస్తరించింది. ఈ సందర్భంగా కిసాన్‌ సభ పుట్టుకకు దారితీసిన పరిస్థితులు, దాని వీరోచిత పోరాటాలు, సామాజిక మార్పులో అది పోషించిన పాత్రను ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.

కిసాన్‌ సభ కేవలం ఒక సంఘం కాదు. అది శతాబ్దాల అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన ఒక విస్ఫోటనం. 1757 ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారతదేశంలో పాగా వేయడంతోనే మన వ్యవసాయ రంగం పతనం ప్రారంభమైంది. బ్రిటిష్‌ వారు మన వస్త్ర పరిశ్రమను క్రూరంగా దెబ్బతీశారు. భారతీయ ఉత్పత్తులపై భారీ పన్నులు విధించి, ఇంగ్లాండ్‌ నుండి వచ్చే యంత్ర తయారీ వస్తువులకు ద్వారాలు తెరిచారు. ఫలితంగా కోట్లాది మంది చేతివృత్తుల వారు నిరుద్యోగులై తిరిగి వ్యవసాయంపైనే ఆధారపడాల్సి వచ్చింది. మొఘల్‌ కాలంలో పంటలో మూడో వంతు మాత్రమే శిస్తు ఉండేది. కానీ, బ్రిటిష్‌ వారు జమీందారీ వ్యవస్థను తెచ్చి దానిని రెట్టింపు చేశారు. 1895లో 61 శాతంగా ఉన్న శిస్తు, 1921 నాటికి 73 శాతానికి చేరింది. 1770లో బెంగాల్‌లో వచ్చిన కరువులో దాదాపు కోటి మంది చని పోయారు. జనాల్ని ఆదుకోవాల్సిన బ్రిటిష్‌ ప్రభుత్వం శిస్తు వసూలును ఆపకపోగా, మరింత కఠినంగా వ్యవహరించింది. ఈ దుర్భర పరిస్థితులే రైతాంగంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆవేశాన్ని పెంచాయి.

రైతుల సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించడానికి ఒక వేదిక కావాలని వామపక్ష నాయకులు, సోషలిస్టులు నిర్ణయించారు. 1936 జనవరిలో మీరట్‌లో జరిగిన సమావేశం దీనికి బీజం వేసింది. చివరగా ఏప్రిల్‌ 11, 1936న లక్నోలో అఖిల భారత కిసాన్‌ సభ ఆవిర్భవించింది. మొదటి అధ్యక్షుడు స్వామి సహజానంద సరస్వతి (బీహార్‌ రైతు నాయకుడు), ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ ఎన్‌.జి. రంగ (ఆంధ్రప్రదేశ్‌ నుండి). ఈ సదస్సులో నెహ్రూ వంటి నాయకులు హాజరయ్యారు. సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడమే కాకుండా, భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయడమే తమ అంతిమ లక్ష్యమని కిసాన్‌ సభ ప్రకటించింది.
కిసాన్‌ సభ చరిత్ర అంతా త్యాగాలమయం. స్వాతంత్య్రానికి ముందు, తరువాత ఈ సంస్థ నేతృత్వంలో జరిగిన కొన్ని కీలక పోరాటాలు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1946-1951) ఇది ప్రపంచ రైతాంగ ఉద్యమాల్లోనే ఒక అద్భుతం. నిజాం నవాబు, అతని సాయుధ బలగాలైన రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు వీరోచితంగా పోరాడారు. దాదాపు మూడు వేల గ్రామాల్లో రైతుల రాజ్యం (గ్రామ స్వరాజ్యం) ఏర్పడింది. పదిలక్షల ఎకరాలకు పైగా భూమిని పేదలకు పంచారు. ఈ పోరాటంలో నాలుగు వేల మందికి పైగా అమరులయ్యారు. ఇది భారతదేశంలో భూసంస్కరణలకు ప్రధాన ప్రేరణగా నిలిచింది. తెభాగా ఉద్యమం (బెంగాల్‌) ”పంటలో మూడింట రెండు వంతులు కౌలుదారుడికే దక్కాలి” అనే డిమాండ్‌తో బెంగాల్‌లో ఈ ఉద్యమం సాగింది. జమీందార్ల గడీలను కదిలించిన ఈ పోరాటం, కిసాన్‌ సభ వర్గ స్పృహను చాటిచెప్పింది. పున్నప్ర-వయలార్‌, కయ్యూర్‌ కేరళలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో వందలాది మంది కిసాన్‌ సభ కార్యకర్తలు బ్రిటిష్‌, సంస్థానాల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించారు.

కిసాన్‌ సభ కేవలం ఆర్థిక సమస్యల మీదనే కాకుండా, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా కూడా పోరాడింది. అంటరానితనం, కుల ఆధిపత్యాన్ని కిసాన్‌ సభ తీవ్రంగా వ్యతిరేకించింది. మొదటి నుంచీ మహిళలను సంఘటితం చేయడంలో కిసాన్‌ సభ ముందుంది. కమలాదేవి చటోపాధ్యాయ, గోదావరి పారులేకర్‌ వంటి మహనీయులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. కేరళలో గ్రంథాలయ ఉద్యమం ద్వారా, త్రిపురలో విద్యావ్యాప్తి ద్వారా రైతులను చైతన్యవంతం చేసింది. 1991 తర్వాత ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు వ్యవ సాయ రంగాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టాయి. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ దశలో కిసాన్‌ సభ తన పోరాట పంథాను మార్చుకుంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పెట్టుబడి ఖర్చుపై యాభై శాతం లాభం కలిపి కనీస మద్దతు ధర (సి2+50శాతం) ఇవ్వాలని కిసాన్‌ సభ ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది. 2014 భూసేకరణ చట్టానికి వ్యతిరేక పోరాటం నుండి, ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన చారిత్రక రైతు ఉద్యమం వరకు ఏఐకేఎస్‌ కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐదువందలకు పైగా రైతు సంఘాలను సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఏకం చేయడంలో కిసాన్‌ సభ చురుగ్గా వ్యవహరిస్తోంది.

తొంభైఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కిసాన్‌ సభ ప్రయాణం నేటికీ పదును తగ్గకుండా సాగుతోంది. నాడు బ్రిటిష్‌ వారితో, నేడు కార్పొరేట్‌ శక్తులతో పోరాడుతూ ‘అన్నదాత’ ఆత్మగౌరవాన్ని కాపాడుతోంది. ”రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది” అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో చూపించిన ఏకైక సంస్థ అఖిల భారత కిసాన్‌ సభ. 1936 నుండి 2026 వరకు ఈ సంస్థ సాధించిన విజయాలు అద్భుతం. రాబోయే కాలంలో కూడా పీడిత రైతాంగం వైపు నిలబడి, సామాజిక న్యాయం కోసం పోరాడట మే ఈ తొమ్మిది దశాబ్దాల వేడుకల అసలైన సందేశం.

మూడ్‌ శోభన్‌
9949725951

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -