బీసీ రిజర్వేషన్లపై జీవో
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు: బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
రవీంద్రభారతిలో చిట్యాల ఐలమ్మ 130వ జయంతి వేడుకలు
నవతెలంగాణ-కల్చరల్
వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాటస్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో వీరనారి చిట్యాల ఐలమ్మ 130వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజకుల ముద్దు బిడ్డ ఐలమ్మ సంపుటిని, ఇనగుర్తి మధు రాసిన పాటను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన ధీర వనిత ఐలమ్మ అని, ఆమె పోరాట స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలని తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదని, కాపాడుకునే బాధ్యత ప్రజలదని అన్నారు.
ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు కొంత మంది అడ్డంపడితే ఎలా కొట్లాడి సాధించుకున్నామో.. ఈరోజు రిజర్వేషన్లు కాపాడుకోవడానికి మనమంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కులవృత్తులు గౌరవప్రదమైనవే అయినా మారుతున్న కాలానికనుగుణంగా వాటిలో మార్పులు చేసుకోవాలని సూచించారు. యువత చదువును నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. 119 నియోజకవర్గాల్లో ఎలక్ట్రిక్ డ్రైక్లీనింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలైతే పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఐలమ్మ విగ్రహం, నిధుల కేటాయింపు, ఉపాధి కల్పన జరగడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే ఈ. శంకర్, బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్, కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES