నవతెలంగాణ వనపర్తి
రైతాంగ పోరాట కీర్తి ముద్ర వేసిన గొప్ప యోధురాలు, మహిళా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఐద్వా అధ్యక్షురాలు అరుణ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ జ్యోతి మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ నల్లగొండ రైతాంగ పోరాటంలో అణగారిన రైతులు, దళితులు, మహిళలకు అండగా నిలిచిన మహోన్నత నాయకురాలు అన్నారు. బలహీనుల పక్షాన నిలిచి, భూమి కోసం, హక్కుల కోసం, సమానత్వం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ఆ కాలంలో జమీందారుల శోషణకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేసి చరిత్రలో చెరగని ముద్ర వేశారన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఈనాటి మహిళా ఉద్యమాలకు మార్గదర్శనం అని పేర్కొన్నారు.
నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అన్యాయాలు, ఆర్థిక కష్టాలు, అసమానతలు దృష్ట్యా ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలను మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఐద్వా మరింత బలమైన ప్రజా పోరాటాలు చేపట్టి మహిళలకు న్యాయం సాధించే దిశగా ముందుకు సాగుతుందని ఆమె స్పష్టం చేశారు. జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మి మాట్లాడుతూ ఐలమ్మ కలలు కనిన సమాజం అంటే అందరికీ సమాన హక్కులు కలిగిన సమాజం అన్నారు. ఆ లక్ష్య సాధనకై ఐద్వా అఖండ పోరాటం చేస్తుంది. భూమి, గృహం, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కుల కోసం ఐలమ్మ సేవలో నడుస్తూ పోరాటాలను ముమ్మరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్ల అధ్యక్షురాలు సాయిలీల, కోశాధికారి కవిత ,సహాయ కార్యదర్శి ఉమా, ఉపాధ్యక్షురాలు శాంతమ్మ, కమిటీ సభ్యులు, మండల యాదమ్మ, రక్షిత, రాణి, కాంతమ్మ ,అలివేల నాయకులు, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఐలమ్మ కు నివాళులర్పించారు.