– జూన్ 2న శంకుస్థాపన అంటూ ప్రచారం
– భూసేకరణకు చర్యలు ప్రారంభించిన అధికారులు
– మాస్టర్‌ప్లాన్‌లో సానుకూలమైన భూమి ఉన్నట్టు నిర్ధారణ
– పౌర, మిలటరీ విమానాలు దింపేందుకు చర్యలు
– ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రం?
నవతెంగాణ – ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం (ఎయిర్ బస్) కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో రెండు విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చింది. దీంతో వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఎయిర్‌పోర్టులు త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆదిలాబాద్ పరట్యనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి అడవుల జిల్లాలో యేడాది తిరిగేలోపు ఎయిర్ బస్ దింపుతామని మాట ఇవ్వడంతో ఇక్కడి ప్రజల్లో ఆశలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మాస్టర్ ప్లాన్ వచ్చేసిందని మున్సిపల్ ఎన్నికల అయిన వెంటనే బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హడావుడి చేశారు. తాజాగా జూన్ 2న ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయించే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివాసీ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిపరిచి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి మాట ఇవ్వడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ వచ్చిందని ఎమ్మెల్యే, ఎంపీ ప్రకటించడంతో రన్‌వే ఎటువైపు వెళ్తుందోనని, ఆ వైపు భూములు కోల్పోయే రైతులు నష్టపరిహారం ఎంత వరకు ఇస్తారోనని ఎదురుచూస్తున్నారు. భూసేకరణకు నిధులు మంజూరు చేశామని సీఎం ప్రకటించారు. ప్రస్తుతమున్న 369 ఎకరాలతోపాటు 415 ఎకరాల భూమి సేకరిస్తే రన్‌వేకు సరిపోతుందని అధికారులు, ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు..?
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ శివారులో ఉన్న 369 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూమిని గతేడాది ఏప్రిల్‌లో విమానాశ్రయానికి కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. పౌర విమానాలతోపాటు సైనిక విమానాలు దింపేందుకు, ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రం సైతం ఏర్పాటు చేయాలని భావించారు. పదేండ్ల కిందట శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన సర్వే చేయాలని ఆదిలాబాద్ ఆర్‌డీఓకు ఆదేశాలు రావడంతో అప్పట్లో కచ్‌కంటి గ్రామంతోపాటు 68 సర్వే నెంబర్‌లో భూములు పోతాయని ప్రచారం సాగింది. నాటి నుంచి విమానాశ్రయానికి అవసరమయ్యే 1400 ఎకరాల వరకు అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.
సర్వేలు తప్పనిసరి
ఎక్కడైనా విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నారంటే తప్పనిసరిగా ఆఫ్టికల్ లిమిటేషన్ సర్వే(ఓఎన్‌ఎస్) చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అలాంటి సర్వేలు చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నాయకులు ప్రకటించిన మాస్టర్ ప్లాన్‌లో అనుకుంట గ్రామ శివారుతో పాటు ఆదిలాబాద్ శివారు ప్రాంతమైన నిశాన్‌ఘాట్ శివారు ప్రాంత భూములు అవసరమని తెలుస్తోంది. ఓఎన్‌ఎస్ సర్వే ద్వారా రన్‌వే ప్లాన్ ఎటు వైపు వెళ్తుదో అటుగా ఏమైన నిర్మాణాలు, గృహాలు ఉన్నాయో చూడాలి. విమానాలు ఎగరటానికి చెట్లు, గుట్టలు, భవనాలు అడ్డు రాకుండా ఉందా? లేదా? అని చూస్తారు. ఈ సర్వే పూర్తి చేస్తే కాని నాయకులు ప్రకటించిన మాస్టర్‌ప్లాన్ ఫైనల్ కాదని తెలుస్తోంది. ఎవరెన్ని చెప్పినా భూమికి సంబంధించినవి అన్నీ ప్రతిపాదనలు మాత్రమేనని, పూర్తిస్థాయి నివేదిక సిద్ధం కాలేదని, దీనిపై పలు దఫాలు చర్చలు సాగాల్సి ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.



