రూ.899 వరకు పెంపు
న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా తమ విమాన ప్రయాణికులపై అదనపు భారం మోపాలని నిర్ణయించింది. తన విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్‌చార్జీని భారీగా పెంచింది. విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరను చమురు మార్కెటింగ్ సంస్థలు సవరించిన నేపథ్యంలో పన్నులతో కలిపి 8.5 శాతం భారం పెరగడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త óచార్జీలు దేశీయ మార్గాల్లో ఏప్రిల్ 8 నుంచి, అంతర్జాతీయ మార్గాల్లో ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తాయి. ఎయిరిండియాతో పాటు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులపై కూడా ఈ భారం పడనుంది. పశ్చిమాసియా యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
దేశీయ మార్గాల్లో దూరాన్ని బట్టి కనిష్టంగా రూ.299 (500 కి.మీ వరకు) నుంచి గరిష్టంగా రూ.899 (2,000 కి.మీ పైన) వరకు సర్‌చార్జీ వసూలు చేయనున్నారు. ఇక అంతర్జాతీయ ప్రయాణికులకు కనిష్టంగా 24 డాలర్ల నుంచి గరిష్టంగా 280 డాలర్ల వరకు భారం పెరిగింది. ముఖ్యంగా సింగపూర్‌కు 60 డాలర్లు, బ్రిటన్‌కు 205 డాలర్లు, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి సుదూర దేశాలకు 280 డాలర్లు చొప్పున అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
సీఈఓ క్యాంప్‌బెల్ రాజీనామా..
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. 2027 జూన్ వరకు పదవీకాలం ఉన్నప్పటికీ ఏడాది ముందే ఆయన బాధ్యతల నుంచి వైదొలగడం గమనార్హం. ఆయన నాయకత్వంలో విస్తారా విలీనం జరిగినప్పటికీ సేవల నాణ్యతలో లోపాలు, గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ ప్రమాదం వంటి ఘటనలపై టాటా యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిరిండియా తదుపరి అభివృద్ధి కోసం మరొకరికి బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయమని విల్సన్ పేర్కొనగా.. కొత్త సీఈఓ ఎంపికయ్యే వరకు ఆయన ఆరు నెలల నోటీసు పీరియడ్‌లో కొనసాగనున్నారు. ఇప్పటికే కొత్త సీఈఓ అన్వేషణ కోసం ప్రత్యేక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసింది.
ప్రయాణికులపై ఎయిరిండియా సర్‌చార్జీ
- Advertisement -
- Advertisement -



