Sunday, April 12, 2026
E-PAPER
Homeబీజినెస్క్లిష్ట పరిస్థితుల్లో ఎయిరిండియా

క్లిష్ట పరిస్థితుల్లో ఎయిరిండియా

- Advertisement -

– సమిష్టి కృషితో రాణించాలి
– ఉద్యోగులతో టాటా సన్స్‌ చైర్మెన్‌ చంద్రశేఖరన్‌
న్యూఢిల్లీ:
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్గత నాయకత్వ మార్పుల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా ప్రస్తుతం ఒక క్లిష్ట దశను ఎదుర్కొంటోందని టాటా సన్స్‌ చైర్మెన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఉద్యోగుల అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా విమాన సర్వీసుల రద్దు, మార్గాల మార్పు, పెరిగిన ఇంధన ధరలు సంస్థపై తీవ్ర ఒత్తిడి పెంచాయని వివరించారు. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతానికి విమాన రాకపోకలు 30 శాతానికి పడిపోయాయని తెలిపారు. యూరప్‌ వెళ్లే విమానాలు ఆఫ్రికా మీదుగా సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన దీర్ఘకాలిక మార్పులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
గడిచిన నాలుగేండ్లలో సుమారు 17,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవడం, నాలుగు ఎయిర్‌లైన్స్‌ను రెండుగా విలీనం చేయడం, విమానాల్లో అత్యాధునిక సదుపాయాలను కల్పించడం వంటి కీలక మార్పులు జరిగాయని వివరించారు. సంస్థ నిర్వహణలో భద్రత అనేది అత్యంత కీలకమని, దీనిపై ఎటువంటి రాజీ ఉండబోదని ఆయన పునరుద్ఘాటించారు. విమానంలో మొదటి వరుసలో ఉన్న వారితో పాటు చివరి వరుసలో కూర్చున్న ప్రయాణికులకు కూడా సమానమైన గౌరవం, మర్యాద దక్కాలన్నదే తమ ప్రధాన విధానమని ఆయన ఉద్యోగులకు వివరించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఉద్యోగులు చూపుతున్న పట్టుదల అభినందనీయమని.. టాటా గ్రూప్‌ ఎల్లప్పుడూ ఎయిర్‌ ఇండియాకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. బయట నుండి వచ్చే విమర్శలను సానుకూలంగా స్వీకరించి ఒకవేళ అవి సహేతుకమైతే లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. ఉద్యోగులంతా సమష్టిగా కృషి చేసి సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చంద్రశేఖరన్‌ కోరారు. కస్టమర్‌ సంతృప్తిని పరమావధిగా పెట్టుకుని ముందుకు సాగాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -