న్యూఢిల్లీ: తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్తగా నియమించినట్టు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి బీఎస్పీ కేంద్ర కార్యవర్గం, జాతీయ, రాష్ట్ర స్థాయిలోని సీనియర్, ఆఫీస్ బేరర్లు హాజరయ్యారు. పార్టీ సైద్ధాంతిక పునాదులను బలోపేతం చేసే దిశగా ఆకాశ్ ఆనంద్ అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారని ఆశిస్తున్నాము అని బీఎస్పీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ సిందూర్‌లో విజయం సాధించిన సాయుధ బలగాలను ప్రశంసించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు బీఎస్పీ ప్రకటించింది. డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.