తెలుగు సినీ దిగ్గజ కవుల్లో ఆరుద్ర ఒక్కరు. మార్క్సిజాన్ని, ఆధ్యాత్మికాన్ని జోడు గుర్రాలుగా పరిగెత్తించిన దిట్ట. 1925 ఆగస్టు 31న విశాఖలో భాగవతుల నర్సింగరావు దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు అతనికి సదాశివ శంకర శాస్త్రి అని నామకరణం చేసిన… ఆయన ఆరుద్ర కలం పేరుతో సుప్ర ప్రసిద్ధుడయ్యారు. ఆయన కంటే 14 ఏళ్ల పెద్దవాడైన మహాకవి శ్రీశ్రీ అతనికి మేనమామ. ఈ క్రమంలో తండ్రి నరసింగరావు, మేనమామ శ్రీశ్రీలు ఇతనికి అపార సాహిత్య విజ్ఞానాన్ని కలిగించారు. దీంతో 13 ఏళ్లలోనే అతన్ని వారు కవిగా, రచయితగా తీర్చిదిద్దారు.
ఈ క్రమంలో చాగంటి సోమయాజులు మార్క్సిజాన్ని అవపోషణ పట్టించాడు. 1942లో శెట్టి ఈశ్వరరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేర్పించాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నియంతత్వాన్ని నిర్మూలించాలంటూ సైన్యంలో చేరాడు. కొంతకాలం తర్వాత ఆనందవాణి పత్రికలో ఉద్యోగం చేస్తూ మద్రాసులో స్థిరపడ్డాడు. 1949లో రచయితగా చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. దీంతో ఆయన సినీ ప్రయాణం విజయవంతంగా ముందుకు సాగింది. ఇక వెనుకకు చూడలేదు. పలు చిత్రాలకు కథ, మాటలు, పాటలు, పద్యాలు రాసి అవి విజయవంతం కావడంతో ప్రఖ్యాతి పొందాడు. ఈ నేపథ్యంలో 1955 ఏప్రిల్ దర్శక దిగ్గజం హెచ్ ఎం రెడ్డి, మహాకవి శ్రీశ్రీ లు పెళ్లి పెద్దలై రూ. 60 ఖర్చుతో జర్నలిస్ట్ రామలక్ష్మితో రిజిస్టర్ వివాహం చేయించారు. ఇక సినీ రచన పరంపరలో ‘బాలభారతం, యశోద కష్ణ, గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, భక్తతుకారం, మహాకవి క్షేత్రయ్య, వీర కంకణము’లతో కూడిన 150 చిత్రాలకు పైగా కథ, మాటలు, పాటలు, 500 చిత్రాలకు పైగా, నాలుగు వేలకు మించి జనరంజకంగా సూపర్ హిట్ పాటలను రాశాడు. ఇందుకు ఉదాహరణగా ‘పవిత్ర బంధం’లో ”గాంధీ పుట్టిన దేశమా ఇది?” అంటూ దేశంలో పెట్రేగిన అవినీతి, లంచగొండితనం, అక్రమాలు, నిరుద్యోగాన్ని, దోపిడి, దురాగతాలను ఎత్తి చూపాడు. ‘గోరంత దీపం’లో ”రాయినైనా కాకపోతిని రామ పాదము శోకగా” అంటూ… భక్తి వినమ్రతతో శ్రీరాముని స్తుతించాడు. ”రగిలింది విప్లవాగ్ని ఈరోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు” అంటూ సీతారామరాజు దేశభక్తిని, స్వాతంత్ర పోరాట, యుద్ధ పటిమను చాటాడు. ‘బాల భారతం’ సినిమాలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎదిగిన నేటి నేటి ఆధునిక మానవుడికి అన్వయిస్తూ మహాభారతం కాలం నాటి భీమసేనుని పోలుస్తూ ”మానవుడే మహానీయుడు” అన్న పాటతో ఆకాశానికి ఎత్తాడు. ‘ఆరాధన’ చిత్రంలో రాజులు ఎక్కువ అంబారిపై అందరూ ఎక్కుట తప్పు కదా అంటూనే ”రోజులు మారి రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు” అంటూ పాతకాలపు రాచరికపు పాలనకు భరతవాక్యం పలుకుతూ ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ప్రజాస్వామ్య భావాలకు పెద్దపీట వేశాడు. ‘అందాల రాముడు’తో ”ఎదగడానికి ఎందుకురా తొందర” అంటూ నిరుద్యోగుల స్థితిగతులను వివరిస్తాడు. ‘సిపాయి చిన్నయ్య’లో ”నా జన్మభూమి”, ‘చెంచులక్ష్మి’లో ”పాల కడలిపై”, ‘ఉయ్యాల జంపాల’లో ”కొండగాలి తిరిగింది…” ఇలా ఎన్నో సూపర్ హిట్ పాటలు…. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక, జానపద చిత్రాలు ఎన్నింటిలో తన పదునైన, తీయనైన కలంతో హాస్య, ప్రేమ, శంగారం, దైవ, దేశభక్తి, ప్రబోధ, రౌద్ర, సందేశాత్మకంగా రాసి ప్రఖ్యాతి పొందాడు, ముఖ్యంగా, ఆరుద్ర పాటల్లో అంత్యప్రాసలు ఆణిముత్యాలుగా అలరిస్తాయి. రత్నాలు, వజ్రాలుగా మెరుస్తాయి
అంతులేని మధుర రసపుష్టిని కలిగిస్తాయి. ఇది ఆరుద్ర ప్రత్యేక శైలి… ఇలా సినిమా రచన వత్తిని కొనసాగిస్తూనే… సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలు, రాముడికి సీత ఏమవుతుంది.?, గుడిలో సెక్స్, అహింసా రౌడీ, గ్రంథాలతో పాటు ఖడ్గతిక్కన నాటకం, కొండగాలి తిరిగింది పాటలు సంకలనం, ఇంకా కలలు, క్రీడలు, ఇంద్రజాలం, నాట్యశాస్త్రంలపై గొప్ప గ్రంథాలు వెలువరించారు. ఇంకా ఆయనపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇలా ఉండగా 1985లో షష్టిపూర్తి పురస్కరించుకొని ఆయన సాహిత్య సేవలకు గాను ఆయనకు మద్రాస్ రాని సీతల్ హాలులో ఘన సన్మానం జరిగింది. ఇలా కవిగా, రచయితగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. వద్ధాప్యంతో 73 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురై 1998 సెప్టెంబర్ 13న మద్రాస్‌లో కనుమూశారు. అనంతరం 2023 మార్చి 3న (భర్త దివంగతులైన 25 ఏళ్లకు) ఆయన ధర్మపత్ని రామలక్ష్మి మతి చెందారు. భర్త అడుగుజాడల్లో నడిచి ఆయన స్ఫూర్తిని పొంది ఆమె మహా రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఈమె అందించిన కథలతో పలు చిత్రాలు విజయవంతమైనాయి. అలాంటి వాటిలో సూపర్ హిట్ అయిన జీవనజ్యోతి చిత్రం ఒకటి… కవులు అజరామరులు.. వారి కావ్యాలు దిక్సూచిలా మానవ సమాజ జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఆరుద్ర, రామలక్ష్మి దంపతుల అపర సాహిత్య సేవలను స్మరించుకుంటూ నివాళులర్పిద్దాం.
– తాళ్లపల్లి యాదగిరి గౌడ్, 9949789939
అక్షర రుద్ర ఆరుద్ర
- Advertisement -
- Advertisement -