రాజకీయాలకు అతీతంగా అందర్నీ ఆహ్వానిస్తున్నాం
ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్, తెలంగాణ గవర్నర్, సీఎం
హీరో నాగార్జున, బ్రహ్మానందం కూడా వస్తారు
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక నిర్ణయం పార్టీదే : అలయ్ బలయ్ నిర్వహణ కమిటీ చైర్మెన్ బండారు విజయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పేలా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈ నెల మూడో తేదీన నిర్వహించనున్నట్టు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, అలయ్ బలయ్ నిర్వహణ కమిటీ చైర్మెన్ బండారు విజయలక్ష్మి ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్థి ఎవరనేది బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తానైతే రేసులో లేనని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అలయ్ బలయ్ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…2005లో రాజకీయాలకు అతీతంగా 200 మందితో ప్రారంభమైన అలయ్ బలయ్ కార్యక్రమం నేడు పది వేల మందితో నిర్వహించే స్థాయికి ఎదిగిందని చెప్పారు.
ఈసారి నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథిలుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎ రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మనోహర్‌లాల్ ఖట్టర్, భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సినీనటులు నాగార్జున, బ్రహ్మానందం, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తదితరులు హాజరవుతారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్‌కు గుర్తుగా ఆర్మీ కుటుంబాలను, ప్రతిఏటా మాదిరిగానే పద్మా అవార్డు గ్రహీతలను సన్మానిస్తామని చెప్పారు. సిద్ధాంతాలను పక్కన బెట్టి అన్ని రాజకీయ పార్టీల నేతలను ఒక వేదికపైకి తీసుకురావడంలోనూ, ఆత్మీయంగా పలుకరించుకునే చేయడంలోనూ అలయ్ బలయ్ కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో అలయ్ బలయ్ నిర్వహణ కమిటీ నుంచి చింతల రాంచంద్రారెడ్డి, గౌతంరావు, శ్యాంసుందర్‌గౌడ్, సత్య, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.