– ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ వశం
– రికార్డు టైటిల్ వేటలో జకోకు భంగపాటు
– ఫైనల్లో జకోవిచ్‌పై మెరుపు విజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్, పురుషుల సింగిల్స్ ఫైనల్. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ రికార్డులపై కన్నేసి బరిలో నిలిచారు. కెరీర్ 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆల్‌టైమ్ రికార్డుపై జకోవిచ్ గురి పెట్టగా.. కెరీర్ స్లామ్‌పై యంగ్ బుల్ అల్కరాస్ గురి.
చారిత్రక 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో నొవాక్ జకోవిచ్‌కు మళ్లీ నిరాశే ఎదురవగా.. 22 ఏండ్ల కార్లోస్ అల్కరాస్ అద్భుతం చేశాడు. పిన్న వయసులోనే కెరీర్ స్లామ్ పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2016 తర్వాత ఓ ఆటగాడు కెరీర్ స్లామ్ అందుకోవటం ఇదే ప్రథమం.
మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా)
మెల్‌బోర్న్‌లో యంగ్ స్పెయిన్ బుల్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) అరుదైన ఘనత సాధించాడు. టెన్నిస్ చరిత్రలో 86 ఏండ్ల పాటు చెక్కుచెదరని ఓ రికార్డును అల్కరాస్ బద్దలుకొట్టాడు. వింబుల్డన్, ఫ్రెంచ్, యుఎస్ ఓపెన్‌తో పాటు తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన కార్లోస్ అల్కరాస్ 22 ఏండ్ల వయసులోనే కెరీర్ స్లామ్ పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అమెరికా టెన్నిస్ దిగ్గజం డాన్ బడ్జె (1938) నెలకొల్పిన రికార్డును అల్కరాస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయంతో అధిగమించాడు. ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2-6, 6-2, 6-3, 7-5తో నొవాక్ జకోవిచ్‌పై కార్లోస్ అల్కరాస్ విజయం సాధించాడు. నాలుగు గంటల పాటు సాగిన నాలుగు సెట్ల టైటిల్ పోరులో నాల్గో సీడ్ జకోవిచ్‌కు భంగపాటు తప్పలేదు.
అల్కరాస్ అదుర్స్
ఇటలీ స్టార్, రెండో సీడ్ యానిక్ సినర్‌ను సెమీఫైనల్లో అద్భుత ఆటతీరుతో ఓడించిన జకోవిచ్.. ఒక్క రోజు విరామంలో మరో యంగ్‌స్టర్‌ను జయించటంలో విఫలం అయ్యాడు. జకోవిచ్ విశేష అనుభవం, నైపుణ్యంతో తొలి సెట్లో తెలివిగా పాయింట్లు రాబట్టాడు. రెండు సార్లు అల్కరాస్ సర్వ్‌ను బ్రేక్ చేసిన జకోవిచ్ తొలి సెట్‌ను 6-2తో సొంతం చేసుకున్నాడు. బేస్‌లైన్ వద్ద మాయాజాలం చేసిన జకోవిచ్.. తొలి సెట్లో ఎటువంటి పొరపాటుకు అవకాశం ఇవ్వలేదు. కార్లోస్ అల్కరాస్ పాయింట్ల వేటలో శ్రమించినా పెద్దగా ఉపయోగం లేదు. కానీ రెండో సెట్‌లో గొప్పగా పుంజుకున్న అల్కరాస్.. జకోవిచ్ తడబాటుకు గురయ్యే విధంగా ఆడాడు. ఫలితంగా రెండు బ్రేక్ పాయింట్లతో జకోవిచ్ జోరుకు బ్రేక్ వేశాడు. 6-2తో రెండో సెట్‌ను కైవసం చేసుకుని లెక్క సమం చేశాడు. రెండో సెట్లో పైచేయి సాధించటం అల్కరాస్ ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసింది. మాజీ చాంపియన్ల గ్యాలరీలో ఆరాధ్య ఆటగాడు రఫెల్ నాదల్ ఉండటం అల్కరాస్‌ను మరింత ఉత్తేజానికి గురి చేసింది. అదే జోరులో మూడో సెట్‌ను 6-3తో గెల్చుకున్న అల్కరాస్.. నాల్గో సెట్‌ను 7-5తో సొంతం చేసుకున్నాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన నాల్గో సెట్లో జకోవిచ్ గట్టిగా ప్రతిఘటించాడు. అల్కరాస్, జకోవిచ్‌లు సర్వ్ నిలుపుకోవటంతో నువ్వా నేనా అన్నట్టు ఉత్కంఠ రేగింది. కీలక సమయంలో బ్రేక్ పాయింట్ సాధించిన అల్కరాస్ 5-5 నుంచి వరుస గేమ్‌లు గెలుపొందాడు. 7-5తో నాల్గో సెట్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అల్కరాస్ 9 ఏస్‌లు, 2 డబుల్ ఫాల్ట్స్‌తో పాటు 36 విన్నర్లు కొట్టాడు. 46 అనవసర తప్పిదాలు చేసిన జకోవిచ్ 32 విన్నర్లే కొట్టాడు. అల్కరాస్ ఐదు బ్రేక్ పాయింట్లు సాధించగా, జకోవిచ్ 2 బ్రేక్ పాయింట్లతో సరిపెట్టాడు. పాయింట్ల పరంగా 118-106తో అల్కరాస్ పైచేయి నిలుపుకున్నాడు.



