రాష్ట్ర ఖజానాలోకి ‘మద్యం’ ఏరులై ప్రవహిస్తోంది. ముప్తై శాతం (రూ.30,188 కోట్లు) ఆదాయం ప్రజల జీవితాలపై మరణశాసనం రాస్తోంది. ఈ ఆదాయాన్ని కాపాడటమే అభివృద్ధి అని భావిస్తే, ప్రజల ప్రాణాలకు, కుటుంబాలకు, భవిష్యత్తుకు ఎలాంటి విలువ ఉండదు. దేశ జనాభాలో సుమారు డెబ్బయి ఐదు శాతం మంది ప్రజలపై దీని ప్రభావం క్రూరంగా పడుతోంది. ధనికుడికి మద్యం ఒక విలాసం కావచ్చు, పేదవాడికి అది ఒక జీవితశిక్షతో సమానం. దినసరి కూలీ, ఆటోడ్రైవర్, వ్యవసాయ శ్రామికుడు, వీరి సంపాదన మద్యం షాపుల్లో కరిగిపోతోంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 47 ప్రకారం ప్రజారోగ్యానికి హానికరమైన మత్తు పానీయాలను నియంత్రించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. కానీ నేడు ప్రభుత్వాలే లిక్కర్ వ్యాపారులుగా మారాయి.
తుపాకీతో చంపితే నేరం, మద్యం విధానంతో వేల కుటుంబాలను నెమ్మదిగా హత్య చేయడాన్ని పాలన అంటున్నారు. ఇదే ఈ వ్యవస్థ అసలు ద్వంద్వ నీతి. మద్యం ప్రజల ఆలోచనా శక్తిని నిర్వీర్యం చేస్తోంది. ఓటు అనే పవిత్ర ఆయుధం బాటిల్ చేతిలో పడి మురికి అవుతోంది. ప్రజలు మత్తులో ఉండగానే నేరచరిత్ర కలిగినవారు, మాఫియా శక్తులు చట్టసభల్లోకి అడుగుపెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు,’మత్తు’ పాలన. మద్యం వల్ల కాలేయ వ్యాధులు, క్యాన్సర్లు, మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు లక్షల రూపాయల బిల్లులతో పేదలను దోచుకుంటున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాలు తమ భూములు, బంగారం, ఇళ్లు అమ్ముకుని చికిత్స కోసం రోడ్డున పడుతున్నారు.
మద్యం సమాజాన్నే మృగంగా మార్చుతోంది. మత్తులో గృహహింస, లైంగిక దాడులు, హత్యలు పెరుగుతున్నాయి. భార్యాభర్తల బంధంలో ప్రేమ స్థానంలో భయం, గౌరవం స్థానంలో హింస నిలుస్తోం ది. పిల్లలకు తండ్రి ఒక ఆశగా ఉండాల్సింది పోయి ఒక గాయంగా మారుతున్నాడు. ఇది కేవలం కుటుంబ సమస్య కాదు, ఇది జాతి భవిష్యత్తుపై జరుగుతున్న కుట్ర. మద్యం ఆదాయం లేకుండా పాలన సాధ్యం కాదన్న వాదన ప్రభుత్వాల సౌలభ్యం మాత్రమే. ఆదాయం కంటే ప్రజల ప్రాణాలే దేశ సంపద. గ్రామస్థాయి నుంచి మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఏకమై ”మద్యం వద్దు – బతుకు ముద్దు” అనే ఉద్యమాన్ని నిర్మించాలి. మద్య నిషేధానికి కట్టుబడి ఉన్న రాజకీయాలకు మాత్రమే ప్రజలు ఎన్నికల్లో మద్దతివ్వాలి.
పాపని నాగరాజు
మద్యం-మరణశాసనం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



