నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా , నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పెషల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్లకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం రోజు కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు.
వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు వంటి ప్రత్యేక వర్గాల ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. కౌంటింగ్ హాలులో టేబుల్ ఏర్పాటు, కౌంటింగ్ సిబ్బంది ఏర్పాట్లు, భద్రత చర్యలు, త్రాగునీరు ,కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బ్యారికేడ్లు వంటి భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులంతా బాధ్యతతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో లు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, అడిషనల్ డి.ఆర్.డి.ఓ సురేష్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.



