Wednesday, July 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనృత్య గురువులందరికీ జీవనోపాధి కల్పించాలి

నృత్య గురువులందరికీ జీవనోపాధి కల్పించాలి

- Advertisement -

– కోవిద ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ అధ్యక్షులు డా||పి.అనూహ్య రెడ్డి
– తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో నృత్యగురువుల సమస్యలపై సభ
నవతెలంగాణ – ముషీరాబాద్‌

నృత్య గురువులందరినీ గుర్తించి, సమాన అవకాశాలు, జీవనోపాధి కల్పించాలని కోవిద ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ అధ్యక్షులు డా.||పి. అనూహ్య రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్‌కే హాల్‌లో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్‌కే), కోవిద ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ సంయుక్తంగా నృత్య గురువుల సమస్యలపై సమాలోచన సభను గోవిందా ఆర్ట్స్‌ కల్చరల్‌ అండ్‌ అకాడమీ సలహాదారులు పీఎన్‌ మూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అనూహ్య రెడ్డి మాట్లాడుతూ.. నృత్య గురువులకు భారతదేశంలో విశేషమైన స్థానం ఉందన్నారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం, సంక్షేమం అందడం లేదని తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహా కమిటీ సభ్యులుగా నృత్య గురువులనూ చేర్చాలని డిమాండ్‌ చేశారు. శాస్త్రీయ సంగీత, నృత్య అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు.
టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలంగాణలో సాంస్కృతిక సచివాలయం ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో ఆడిటోరియంలను పునరుద్ధరించాలని, ప్రతి బడిలో ఒక నృత్య టీచర్‌ ఉండాలని, కళాకారులకు కల్చరల్‌ కోటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గురువులకు నిరంతర శిక్షణా శిబిరాలు, వర్క్‌షాప్‌లు, రికార్డింగ్‌లు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. సభాధ్యక్షులు పీఎన్‌ మూర్తి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నృత్య గురువులు ఎంతో మంది ఉన్నారని, వాళ్ళ కండ్లల్లో కనిపించని కన్నీళ్లున్నాయని, సవాలక్ష సమస్యలున్నాయన్నారు. కాబట్టి వారి హక్కులు సాధించేందుకు ఐక్యంగా సకల కళల శోభాయాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. కళాకారులందరికీ ఆర్థిక ప్రోత్సాహకం అత్యంత అవసరం అని అన్నారు. దేవాలయాలు, పర్యాటకశాఖలు, సాంస్కృతిక కళాక్షేత్రాలు.. అన్నిట్లో నృత్య గురువులకు అవకాశాలు కల్పించాలని కోరారు. నృత్య గురువులకు ఆర్థిక గౌరవం, ఉపాధి అవకాశాలు వెంటనే అమలు చేయాలని కళాకారులందరూ ముక్తకంఠంతో నినదించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నృత్య గురువులు రమణీ, సిద్ధి ఇందిరా, పరాశరం చిన్న జీయర్‌ స్వామి, పవన్‌, డాన్స్‌ మాస్టర్‌, తెలుగు వెలుగు శ్రీరామ్‌ దట్టి, సీనియర్‌ జర్నలిస్టు సుమన్‌, సామాజికవేత్త సురేష్‌ గౌడ్‌, అనుదీప్తి, హిందుమతి, రాధిక శ్రీనివాసులు, లావణ్య, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -