మావోయిస్టులతో చర్చలు జరపాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-జనగామ
అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న మావోయిస్టుల బూటకపు ఎన్‌కౌంటర్లను వెంటనే ఆపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌కౌంటర్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం హత్యలు చేస్తోందని, బూటకపు ఎన్‌కౌంటర్‌లు ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. బూటకపు ఎన్‌కౌంటర్ల పేరిట మావోయిస్టులను హత్య చేయడాన్ని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తోందని చెప్పారు. లొంగిపోయేందుకు వచ్చిన వారిని ఎన్‌కౌంటర్లు చేయడం హేయమైన చర్య అన్నారు. మావోయిస్టులతో వెంటనే చర్చలు జరపాలన్నారు. మావోయిస్టు అగ్రనేత తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారమని, ఆయనను వెంటనే కోర్టు ముందు హాజరు పరచాలని, ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
బూటకపు ఎన్‌కౌంటర్లన్నీ బీజేపీ ప్రభుత్వ హత్యలేనని, లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్న మావోయిస్టులను పట్టుకొని బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. హిడ్మాను, దేవోజిలను ఎన్‌కౌంటర్ల పేరిట చంపినంత మాత్రాన దేశంలో ఆర్థిక అసమానతలు, లైంగికదాడులు, హత్యలు, అరాచకాలు తగ్గవన్నారు. రాజ్యహింసను, మతోన్మాదాన్ని, అసమానతలను, దోపిడీని వ్యతిరేకించడంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన పంథా అవలంబిస్తారన్నారు. మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని నమ్మారని గుర్తు చేశారు. కానీ, ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. మావోయిస్టుల పట్ల అవలంబిస్తున్న విధానం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మావోయిస్టులను పట్టుకుని జైల్లో పెట్టే అవకాశం ఉన్నప్పటికీ, వారిని పట్టుకొని బూటకపు ఎన్‌కౌంటర్ పేరిట హత్య చేయడం అప్రజాస్వామికం కాదా? అని ప్రశ్నించారు.
మావోయిస్టులను మట్టుపెట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు ఆగవని జాన్‌వెస్లీ అన్నారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా దోచిపెట్టడానికే ఆపరేషన్ కగార్ పేరుతో నరమేధం సృష్టించడం సరైంది కాదన్నారు. బలం ఉందని.. తామేం చేసినా నడుస్తుందని విర్రవీగిన నియంతలందరూ చరిత్రలో, మట్టిలో కలిసిపోయారని, అందుకు హిట్లర్ చరిత్రనే నిదర్శనం అని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, దోపిడీ ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరంతరం ప్రజల కోసం పనిచేసే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలు అలాంటి అవకాశాన్ని వినియోగించుకుని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
రైతు భరోసా డబ్బులు జమ చేయాలి: అబ్బాస్
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ.. యాసంగి సీజన్ ప్రారంభమవుతున్నందున రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వెంటనే వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని, రైతులందరికీ బ్యాంకు రుణాలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, రాపర్తి రాజు, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్, పుత్కనూరి ఉపేందర్, బోడ నరేందర్, ఎండి అల్లారుద్దీన్, నాయకులు మల్లేశం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.



