కేరళంలో ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం
ఎల్డీఎఫ్ తరపున ఆరోగ్య శాఖమంత్రి వీణాజార్జ్
మూడోసారి గెలుపు కోసం దూసుకెళ్తున్న మంత్రి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
శబరిమల ఆలయం ఉన్న పత్తనంతిట్ట జిల్లా పరిధిలోని, పంబా నది ఒడ్డున ఉన్న ఆరన్ముళ అనే చిన్న పట్టణంలో ఎండల తీవ్రతతో పాటు ఎన్నికల వేడి పెరిగింది. ఆరన్ముళ నియోజకవర్గంలోని రాజకీయ పోటీ శ్రద్ధగా గమనించే ఓటర్లకు ఏ విషయాన్నీ దాచదు. ఆరన్ముళలో పూజ్యమైన పార్థసారథి ఆలయంలో ముడిపడి ఉన్న ప్రసిద్ధ పడవ పందెం ‘ఉత్రట్టతి జలమేళా’ జరుగుతుంది. ఏప్రిల్ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల రాజకీయ పోటీని అందరూ నిశితంగా గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి కేరళం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున అబిన్ వర్కీ కొడియాట్టు, బీజేపీ తరపున కుమ్మనం రాజశేఖరన్‌లు పోటీ చేస్తున్నారు. వీణాజార్జ్ ప్రచారం ప్రధానంగా వామపక్ష కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి అనే సందేశంపై ఆధారపడి ఉంది. దీంతో ఓటర్ల నమ్మకాన్ని మరోసారి గెలుచుకోవచ్చని ఆమె ఆశిస్తున్నారు. వీణా జార్జ్ 2016లో తొలిసారిగా 7,646 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2021లో ఆమె మెజార్టీ గణనీయంగా పెరిగింది. ఆ ఎన్నికల్లో 19,003 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. మూడోసారి మెజార్టీ పెంచుకోవడానికి ప్రచారం తీవ్రతరం చేశారు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ తరువాత, గత ఐదేండ్లుగా కేరళంలో ప్రతిపక్షాల ప్రధాన లక్ష్యాల్లో వీణాజార్జ్ ఒకరిగా ఉన్నారు. ఆమెపై ఆరోపణలు, భౌతిక దాడులకు కూడా కాంగ్రెస్ నేతలు వడిగట్టారు. అయితే వీణాజార్జ్ ఎక్కడా చలించిపోకుండా ముందుకు సాగారు. ”కేరళంలో ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్ధిని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయిలో చూడొచ్చు. దేశంలోని అన్ని ఆరోగ్య సూచికల్లో మేం అగ్రగామిగా ఉన్నాం” అంటూ ఆమె ప్రచారం చేస్తున్నారు. ”కాంగ్రెస్ పార్టీ ప్రయివేట్ ఆస్పత్రి యాజమాన్యాల నుంచి ఎన్నికల బాండ్లతో భారీ మొత్తంలో నిధులు సేకరించి, కేరళం ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోంది” అని విమర్శించారు. ”ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోనే అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తుంటే, ప్రయివేట్ ఆస్పత్రులు ఎలా అభివృద్ధి చెందగలవు? ప్రయివేట్ ఆస్పత్రులకు సహాయపడి, ప్రభుత్వ ఆస్పత్రుల సామర్థ్యాన్ని కాంగ్రెస్ నాశనం చేయాలని చూస్తోంది” అని విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్యేగా తన పనితీరుపై వీణాజార్జ్ విశ్వాసం వ్యక్తం చేస్తూ అరన్ముళలో బిడ్జీల నిర్మాణం, ఆసుపత్రుల ఆధునీకరణ, పాఠశాలల మౌలిక సదుపాలయాల మెరుగుదల వంటి అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టామని తెలిపారు. ఈసారి తన మెజార్జి మరింత పెరుగుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. ఆమె ప్రత్యర్థి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబిన్ వర్కీ కొడియట్టు తనను తాను మార్పు తెచ్చే అభ్యర్థిగా నిలబెట్టుకుంటున్నానని అంటున్నారు. 2011లో చివరి సారిగా ఈ నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్, 15 ఏండ్ల తరువాత ఇప్పుడు దానిని తిరిగి కైవసం చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. అభివృద్ధి అంశాన్ని కాకుండా, శబరిమల బంగారం అంశాన్ని యూడీఎఫ్, ఎన్డీఏ రెండూ ఎన్నికల అంశంగా తీసుకున్నాయి. ”రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఏం తెచ్చారు? ఆమె ఆరోగ్య మంత్రిగా విఫలం అయ్యారు” అని అబిన్ వర్కీ కొడియట్టు ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేస్తున్నారు.



