Saturday, April 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅందరి చూపు ఇస్లామాబాద్‌ వైపు

అందరి చూపు ఇస్లామాబాద్‌ వైపు

- Advertisement -

నేడే అమెరికా-ఇరాన్‌
ప్రతినిధుల మధ్య కీలక చర్చలు యుద్ధం ముగింపునకు పరిష్కారం లభించేనా?
పటిష్టమైన భద్రత నడుమ పాకిస్తాన్‌ రాజధాని
ట్రాఫిక్‌ ఆంక్షలు.. పాఠశాలలు, మార్కెట్లు మూసివేత
లెబనాన్‌పై ఆగని ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదం
తాజా వైమానిక దాడుల్లో ఆరుగురు మృతి
ఈ దాడుల నేపథ్యంలో పాక్‌కు బయలుదేరని ఇరాన్‌ బృందం!
హంగేరీ నుంచి ఇస్లామాబాద్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్‌ బృందం


ఇస్లామాబాద్‌ : మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు యావత్‌ ప్రపంచాన్ని అనిశ్చితిలోకి నెట్టేశాయి. అమెరికా-ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఇంధన కొరతతో అల్లాడి పోయాయి. వ్యాపార, వాణిజ్య మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్‌ సంయుక్త దాడులు జరపడం, అదే స్థాయిలో ఇరాన్‌ నుంచి ప్రతిదాడులు ఎదురు కావడంతో యుద్ధం నలభై రోజులకుపైగానే కొనసాగింది. యుద్ధం విరమించాలంటూ పలు ప్రపంచ దేశాలు విజ్ఞప్తులు చేస్తున్నా ఎలాంటి ఫలితం కనబడలేదు.

చివరకు పాకిస్తాన్‌ అభ్యర్థన మేరకు రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఉంటుందని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ కేంద్రంగా అమెరికా-ఇరాన్‌ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. దీంతో రాజధాని నగరంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఈ చర్చల్లో యుద్ధం ముగింపునకు సంబంధించి ఏదైనా పరిష్కారం లభిస్తుందా? అని ప్రపంచ దేశాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి.

సాధారణ వాహనాలకు నో ఎంట్రీ
పార్లమెంట్‌, కీలక ప్రభుత్వ కార్యాలయాలు, లగ్జరీ హౌటళ్లు, ఎంబసీలు, విదేశీ సంస్థల కార్యాలయాలు ఉన్న రెడ్‌ జోన్‌ ప్రాంతంలోని రహదారులు సాధారణ వాహనాలను పూర్తిగా మూసివేశారు. పోలీసు బలగాలు నగరవ్యాప్తంగా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాయి. అధికార ప్రతినిధుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్‌ మళ్లింపులు అమలు చేస్తున్నారు. ఈ కీలక చర్చల ముందు ప్రజల రాకపోకలు తగ్గించేందుకు గురువారం, శుక్రవారం రోజులను ప్రభుత్వ సెలవులుగా ప్రకటించారు. పాఠశాలలు, దుకాణాలు మూతబడ్డాయి. కొన్ని చోట్ల మాత్రమే పరిమిత కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

అమెరికా, ఇజ్రాయిల్‌ సంయుక్త దాడుల్లో ఫిబ్రవరి 28న ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ హత్యకు గురైన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. అది అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల మధ్య యుద్ధానికి దారి తీసింది. అయితే పాక్‌ అభ్యర్థన మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొన్ని రోజుల కిందట రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల మధ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. పాక్‌ అభ్యర్థనతో తాత్కాలిక ఒప్పం దానికి దారులు ఏర్పడ్డాయి. ఇది అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య చర్చలకు అవకాశం కల్పించింది. దీంతో మరింత ఘర్షణను నివారించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.

ఆంక్షల నడుమ ఇస్లామాబాద్‌
మధ్యప్రాచ్యంలో సున్నితమైన కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో నేడు అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఇస్లామాబాద్‌పై నిలిచింది. పాకిస్తాన్‌ రాజధానిలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. పోలీసులు, మిలిటరీ, స్పెషల్‌ సర్వీస్‌ కమాండోల ఆధీనంలోకి నగరం వెళ్లింది. ముఖ్య రహదారులు, ప్రభుత్వ భవనాల వద్ద భద్రతా దళాలు గస్తీ కాస్తున్నాయి. నగరంలోని రెడ్‌ జోన్‌ ప్రాంతం కఠిన భద్రత కింద ఉంది. అక్కడ సాధారణ ప్రజల రాకపోకలు చాలా పరిమితంగా అనుమతిస్తున్నారు.

భద్రతపై హామీ
పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహిసిన్‌ నక్వీ.. అమెరికా రాయబారికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 30 మంది సభ్యులతో కూడిన అమెరికా బృందం ఇస్లామాబాద్‌కు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలిచింది. అయితే ఈ కీలక సమావేశాన్ని నిర్వహించే హౌటల్‌ సెరీనా వద్ద భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హౌటల్‌ సాధారణంగా ఉన్నతస్థాయి దౌత్య సమావేశాలకు వేదికగా ఉపయోగిస్తారు. కాగా వైట్‌ హౌజ్‌ మాజీ ప్రెస్‌ సెక్రెటరీ ఎరీ ఫ్లీషెర్‌ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో భద్రతా పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో లేదని వ్యాఖ్యానించారు.

గగనతల భద్రత కట్టుదిట్టం
చర్చల నేపథ్యంలో గగనతల భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 1ఎల్‌-78 ట్యాంకర్లు, సీ-130 విమానాలను మోహరించింది. ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ ప్రాంతం మీదుగా పాకిస్తాన్‌ యుద్ధ విమానాలు గస్తీ కాస్తున్నాయి. ఇవి ఇరాన్‌ ప్రతినిధి బృందం ప్రయాణించే విమానానికి భద్రత కల్పిస్తున్నాయి. అలాగే ఏడబ్ల్యూఏసీఎస్‌ వ్యవస్థను కూడా వినియోగిస్తున్నారు. ఇది మొత్తం విమాన రంగాన్ని పర్యవేక్షిస్తూ ”రక్షణ కవచం”లా పని చేస్తుంది. ఇజ్రాయిల్‌ దాడులను నివారించడమే దీని లక్ష్యం.

ఇరాన్‌కు మరో మార్గం లేదు: ట్రంప్‌
అంతర్జాతీయ జలమార్గాలను ఉపయోగించి ప్రపంచాన్ని కొన్ని రోజులు దోపిడీ చేయడం తప్ప ఇరాన్‌ నేతలకు మరో మార్గం లేదన్నారు. కేవలం చర్చలు జరపడానికి మాత్రమే వారు సజీవంగా ఉన్నారంటూ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. అమెరికా-ఇరాన్‌ మధ్య మరికొద్ది గంటల్లోనే శాంతి చర్చలు జరగనున్న వేళ ట్రంప్‌ ఈ తరహాలో స్పందించడం గమనార్హం.

‘హార్ముజ్‌’ ఫీజు చెల్లింపులు ఇరాన్‌ కరెన్సీలోనే.. : ఇరాన్‌ ప్రతిపాదన
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు చెల్లించే ట్రాన్సిట్‌ ఫీజులను ఇకపై ఇరాన్‌ కరెన్సీ ‘రియాల్‌’లో చెల్లించా లనే ప్రతిపాదనను ఇరాన్‌ ముందుకు తెచ్చింది. ఇరాన్‌ పార్ల మెంట్‌ జాతీయ భద్రతా కమిషన్‌ అధిపతి ప్రకారం… హార్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి వసూలు చేసే రవాణా రుసుములను రియా ల్‌లో చెల్లించేలా పార్లమెంట్‌లో ఒక ప్రతిపాదన తీసుకొ చ్చారు. ఈ విషయాన్ని ముంబయిలోని ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించింది. కాగా అమెరికా డాలర్‌ ప్రపంచ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఇరాన్‌, చైనా కలిసి మార్గాలు అన్వేషిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.

అమెరికా- ఇజ్రాయిల్‌ దాడుల అనంతరం హార్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నౌకలకు ‘టోల్‌ బూత్‌’ విధానం అమలు చేసింది. ఆ సమయంలో వాణిజ్య నౌకల నుంచి ట్రాన్సిట్‌ ఫీజులను చైనా కరెన్సీ యువాన్‌లో వసూలు చేసినట్టు పలు నివేది కలు వెల్లడిం చాయి. అయితే.. ఆ నిర్బంధ సమయంలో ఎన్ని నౌకలు యువాన్‌లో చెల్లింపులు చేశాయన్నది స్పష్టంగా తెలియకపోయినా… మార్చి 25 నాటికి కనీసం రెండు నౌకలు ఈ విధంగా చెల్లింపులు చేసినట్టు లాయిడ్స్‌ లిస్ట్‌ నివేదిక పేర్కొంది.

పాకిస్తాన్‌ విజయవంతంగా నిర్వహిస్తుందా?
మధ్యప్రాచ్య ఘర్షణల నడుమ పాకిస్తాన్‌కు ఒక కీలక మధ్యవర్తిగా మారే అవకాశం లభించిందని విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికా-ఇరాన్‌ మధ్య జరిగే ఈ కీలక చర్చలను పాకిస్తాన్‌ విజయవంతంగా నిర్వహించగలదా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. దీంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇస్లామాబాద్‌ వైపు దృష్టి సారించింది.

లెబనాన్‌పై ఆగని ఇజ్రాయిల్‌ దాడులు
అల్‌జజీరా నివేదిక ప్రకారం… లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లో కార్‌వాష్‌ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడుల్లో ఆరుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. అయితే అమెరికా-ఇరాన్‌ మధ్య కీలక చర్చల నేపథ్యంలో ఇజ్రాయిల్‌ తీరు ఆందోళనను కలిగి స్తున్నది. అమెరికా అధ్యక్షుడి నుంచి రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఇజ్రాయిల్‌ ఇలాంటి దాడులకు దిగడం చర్చలకు ఆటంకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాద పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ ప్రతినిధి బృందం ఇంకా పాకిస్తాన్‌కు బయలుదేరలేదు. అయితే కాల్పుల విరమణ అనేది లెబనాన్‌ విషయంలో వర్తించదని ఇజ్రాయిల్‌ వాదిస్తోంది. కాగా అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్‌ తన బృందంతో హంగేరీ నుంచి ఇప్పటికే ఇస్లామాబాద్‌కు బయలుదేరారు. అమెరికా బృందానికి జె.డి వాన్స్‌ నాయకత్వం వహించనున్నారు. ఈ బృందంలో ట్రంప్‌ చీఫ్‌ నెగోషియేటర్‌ స్టీవ్‌ విట్కాఫ్‌, ఆయన అల్లుడు జారెడ్‌ కుష్నర్‌లు కూడా ఉన్నారు. ఇక ఇరాన్‌ బృందానికి ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి, పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘెర్‌ ఘలిబఫ్‌లు నేతృత్వం వహించనున్నట్టు సమాచారం.

వీసా సదుపాయం
ఈ చర్చల కోసం పాకిస్తాన్‌ ప్రత్యేకంగా వీసా-ఆన్‌-అరైవల్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతినిధులు, జర్నలిస్టులు సహా అందరికీ విమానాశ్రయంలోనే వీసా ఇవ్వనున్నారు. ఇందుకు ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ మాట్లాడుతూ.. ఈ చర్చలకు మద్దతుగా ప్రవేశ విధానాలను సులభతరం చేసినట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -