స్థానిక ఎన్నికలు జరుగుతాయా? లేదా?
షెడ్యూల్ వచ్చినా వీడని ఉత్కంఠ
హైకోర్టు తీర్పు ఏం వస్తుందో : రాజకీయ పార్టీల్లో టెన్షన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎనిమిదో తేదీన ఏం జరుగబోతున్నది? స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదలైనా ఎన్నికల ప్రక్రియ ముందుకెళ్తుందా? లేదా? అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అందరి చూపూ హైకోర్టు తీర్పు ఏం వస్తుందనే దానిపైనే ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచు అభ్యర్థిత్వాలను ఆశిస్తున్న ఆశావాహులు పార్టీలతో సంబంధం లేకుండా అసలేం జరుగుతున్నదనే దానిపైనే ఆరా తీస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా..రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపు జీవోన్యాయబద్ధంగా నిలుస్తుందా? దానికి చట్టబద్ధతా ఉందా? అన్న ధర్మసందేహం అందరి మెదళ్లనూ తొలుస్తున్నది. గతంలో ఆయా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వచ్చిన తీర్పులను, ఎన్నికల రద్దు అంశాలను రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతు న్నారు. మరోవైపు ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానం నుంచి ఆయా పార్టీల నుంచి ముగ్గురు, నలుగురు ఆశావాహులు రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మండలంలోని, గ్రామాల్లోని కీలక నాయకు లను ఆర్థిక, సామాజిక, ఇతరత్రా అంశాల ఆధారంగా తమవైపు తిప్పుకుని తమ బలాలను పార్టీల నాయకత్వాలకు చూపించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంత ఖర్చుపెట్టినా? ఒకవేళ హైకోర్టు తీర్పు అను కూలంగా రాకపోయినా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో చెల్లదు పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినా? ఎన్నికల ప్రక్రియ అంతా మొదటికొస్తుందనే ధర్మసందేహా లను ఆశావాహులు వ్యక్తం చేస్తున్నారు. తాము పెట్టిన ఎఫర్ట్ అంతా వృథా అవుతుందనే గందరగోళంలో ఉన్నారు. గతంలో ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి మీడియా ప్రతినిధులు లేవనెత్తే సందేహాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు నివృత్తి చేసేవారు. ఇప్పుడు ఏది అడిగినా నో కామెంట్ అని దాటవేస్తున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం వద్ద కూడా స్పష్టతలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. అన్ని పార్టీలు కూడా 42 శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నామని క్లారిటీ ఇవ్వాలని అధికార పార్టీ నేతలు కోరడం కూడా చర్చనీయాంశం అవుతున్నది.
మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదం తెలిపేలా జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావుపై బీసీ సంఘాల నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయన కూడా అనివార్యంగా తాము ఎక్కడ కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అందరూ అనుకూలమే అయిన ప్పుడు రాజకీయంగా ఈ రాద్ధాంతం ఏంటి? అసలు దానికి అడ్డు పడుతు న్నదెవరు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటే సర్దు మను గదా? ఎందుకీ జాప్యం? ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగు తుందా? లేదా? అన్న ప్రశ్నలు బీసీ సంఘాల నుంచి ఉత్పన్నం అవుతు న్నాయి. రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ముందుకు సాగుతుందా? లేదా? కోర్టు ఏమైనా సూచనలు చేసి ఆ విధంగా ముందుకెళ్లాలని చెబుతుందా? లేదా పూర్తిగా కొత్త షెడ్యూల్‌తో ముందుకెళ్లాలని ఆదేశిస్తుందా? వంటి ప్రశ్నలకు సమా ధానాలు రావాలంటే అక్టోబర్ ఎనిమిదో తేదీ వరకు వేచిచూడాల్సిందే.
అందరి చూపు 8 వైపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES