Saturday, April 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రభుత్వ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి

ప్రభుత్వ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి

- Advertisement -

నిరుద్యోగ జేఏసీ పోరాటానికి మద్దతు
పోరాటాల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొంటాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఏప్రిల్‌ 30న ఎస్వీకేలో నిరుద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు : నిరుద్యోగ జేఏసీ, డీవైఎఫ్‌ఐ


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలనీ, నోటిఫికేషన్లను జారీ చేయాలని కోరారు. రానున్న కాలంలో నిరుద్యోగ జేఏసీ చేసే పోరాటానికి అన్ని విధాలా మద్దతిస్తామనీ, వారి పోరాటాల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొంటామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌ ఆర్‌.ఎల్‌.మూర్తి, డీ.వై.ఎఫ్‌.ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌, అధ్యక్షులు కోట రమేశ్‌, జేఏసీ నాయకులు కిరణ్‌, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాన్‌ వెస్లీ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 60 లక్షల ఖాళీలున్నాయనీ, ఒక్క రైల్వే శాఖలోనే 10 లక్షల ఖాళీలున్నాయని తెలిపారు. కార్పొరేట్‌ విధానాల పేరిట ప్రభుత్వ రంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ అణగారిన వర్గాల వారికి ఉద్యోగ అవకాశాలు లేకుండా మోడీ సర్కారు చేస్తున్నదని విమర్శించారు. 2014లో ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ హామీ ఏమైందని బీజేపీని ప్రశ్నించారు. తెలంగాణలో తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీనిచ్చి నిరుద్యోగుల కుటుంబాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 28 నెలల పాలనలో కేవలం 16,798 పోస్టులను మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు. రాహుల్‌ గాంధీ స్వయంగా అశోక్‌ నగర్‌ చౌరస్తాకు వచ్చి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

నిరుద్యోగుల సమస్య, ఉద్యోగాల భర్తీ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో కనీసం చర్చకు రాకపోవడాన్ని బట్టే సమస్యపై పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. అడ్డగోలు జీవోలను జారీ చేసి నిరుద్యోగులను గందరగోళపర్చడం దుర్మార్గమని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం పట్లనే మతం మారిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోతుందా అని ప్రశ్నించారు. దేశంలో ఏ మతాన్ని అయినా స్వీకరించే హక్కును రాజ్యాంగం కల్పించిందనీ, మతం మారారనే కారణంతో రిజర్వేషన్లు తొలగించడం సహేతుకం కాదని చెప్పారు. సుప్రీం కోర్టు ఆ తీర్పును పున్ణ సమీక్షించాలని కోరారు.

గాదె ఇన్నయ్య అరెస్టును ఖండించిన సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై ఉపా కింద నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అక్రమ కేసులను, నిర్బంధాలను ప్రశ్నించడం ప్రాథమిక హక్కు అని చెప్పారు. పోటు రంగారావుపై ఉపా కేసును ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. కేరళం కంటే తెలంగాణ అన్నింటిలోనూ ముందంజలో ఉందని ఆ రాష్ట్ర ఎన్నిక ప్రచారానికి వెళ్లి సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అక్కడ విద్య, వైద్యం ఉచితంగా అందిస్తుంటే తెలంగాణలో పూర్తిగా వ్యాపారమయం అయిందనీ, కేరళం ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులు, బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కార్పొరేట్ల కోసం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. ఆరు గ్యారంటీలను తెలంగాణలో బాగా అమలు చేస్తున్నామని కేరళం వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆర్‌ఎల్‌.మూర్తి, ఆనగంటి వెంకటేశ్‌, కోట రమేశ్‌ మాట్లాడుతూ… జూన్‌ రెండో తేదీ నాటికి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనీ, లేదంటే దశలవారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ నెల 30న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. యూత్‌ డిక్లరేషన్‌ ఏమైందని రేవంత్‌ రెడ్డి సర్కారును ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఒక రాజకీయ అస్త్రంగా మారిందని విమర్శించారు. రాజీవ్‌ యువ వికాసం పేరిట 16,25,000 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. నిరుద్యోగులు వేల రూపాయలు ఖర్చుపెట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారనీ, పోస్టులు పడుతాయనే ఆశతో రూ.5 భోజనం చేస్తూ చదువుకుంటున్నారని పలు ఉదహరణలను వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పోస్టులను భర్తీ చేయడం లేదనే నిరాశతో 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయకుంటే నిరుద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -