Monday, April 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅక్కడ వైద్యమంతా ఉచితమే!

అక్కడ వైద్యమంతా ఉచితమే!

- Advertisement -

– ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా ప్రజలకు చేరువ
– ప్రపంచానికే ఆదర్శం

ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలకు వైద్యం, విద్య ఎంత ఖరీదైనవిగా మారాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలో, మన రాష్ట్రంలో జ్వరం వచ్చినా ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక శస్త్ర చికిత్సల ఖర్చు అయితే లక్షల్లో ఉంటుంది. ప్రభుత్వ రంగంలో వైద్యారోగ్యాలకు తగినన్ని నిధులు కేటాయించకపోవటంతో ఈ దుస్థితి ఏర్పడుతోంది.
కరేబియన్‌ సముద్రం మధ్యలో చిన్న ద్వీపంగా ఉన్న క్యూబా వైద్యరంగంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. తన ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తోంది. పరిమిత వనరులున్నప్పటికీ ఆ దేశం సాధించిన ఆరోగ్య ఫలితాలు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉన్నాయి. అక్కడ ప్రయివేట్‌ ఆసుపత్రులు ఉండవు.
1961లో క్యూబా ప్రభుత్వం కొత్త వైద్య విధానాన్ని ప్రవేశపెట్టింది. దానిని ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ ప్రగతి పథంలో ముందుకెళుతున్నది. ప్రస్తుతం ఆ దేశంలో ప్రతి 400 మంది ప్రజలకు ఒక డాక్టర్‌, నర్సు ఉన్నారు. అంటే మనదేశంలో ఒక పెద్ద వీధి లేదా రెండు చిన్న చిన్న వీధుల్లో ఉండే ప్రజలకు ఒక డాక్టర్‌ ఉన్నట్టు అన్నమాట! దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఆసుపత్రులు, క్లినిక్‌లన్నీ ప్రభుత్వ నిర్వహణలోనే ఉంటాయి.
‘వ్యాధి వచ్చాక చికిత్స కాదు – వ్యాధి రాకుండా చూడడమే ప్రధానం’ అనే సూత్రంపై క్యూబా వైద్య విధానం పనిచేస్తుంది. ఇదే ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానం… వీరు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను నిత్యం గమనిస్తూ ఉంటారు. వారికి ఏ స్థాయిలో చికిత్స అవసరమో గుర్తించి అక్కడికి పంపించడంలోనూ, ఆ తరువాత పర్యవేక్షణ చేయడంలోనూ డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ప్రత్యక్షంగానే పాలుపంచుకుంటారు. ప్రపంచంలోనే అత్యధిక డాక్టర్‌- రోగి నిష్పత్తి ఉన్న దేశాల్లో క్యూబా ఒకటి.
ఉచితంగా వైద్య విద్య
క్యూబాలోని లాటిన్‌ అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌.. ప్రపంచంలోనే అతి పెద్ద వైద్య కళాశాలల్లో ఒకటి. ఇక్కడ అనేక దేశాల విద్యార్థులకు ఉచితంగా వైద్యవిద్యను అందిస్తారు. సొంతంగా కేన్సర్‌ చికిత్సకు మందులు, కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడంలో క్యూబా ముందుంది. క్యూబా తన వైద్యులను ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా దేశాలకు పంపింది. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా తదితర విపత్కర సమయాల్లో క్యూబా వైద్య బృందాలు ముందుండి సేవలందించి ప్రశంసలందుకున్నాయి. శిశు మరణాల రేటులో అమెరికా వంటి ధనిక దేశాల కంటే క్యూబాలో తక్కువ. సగటు జీవన కాలం సుమారు 78-79 ఏళ్లుగా ఉంది.
కోవిడ్‌ సమయంలో క్యూబా సాధించిన విజయాలు, చూపిన మానవతా స్ఫూర్తి యునెస్కో ప్రశంసలు పొందింది. కోవిడ్‌ నిరోధక టీకాను దేశంలోనే అభివృద్ధి చేసి, శీఘ్రగతిన ప్రజలందరికీ ఉచితంగా అందించింది. అప్పట్లో అమెరికా తన టీకాను మార్కెట్లో అమ్మకానికి పెట్టగా, క్యూబా… లాటిన్‌ ఆమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు మానవతా సాయంగా పంపించింది. లాభాలు కన్నా మానవత్వమే గొప్పదని చాటింది.
క్యూబా ఆరోగ్య వ్యవస్థ ప్రాథమిక వైద్యానికి అద్బుతమైన నమూనా అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్యపరంగా అనేక సవాళ్లనెదుర్కొంటోంది. క్యూబాలో సోషలిజాన్ని కూల్చాలని అమెరికా కుట్రలనేకం పన్నుతూనే ఉంది. ట్రంప్‌ ఆధ్వర్యాన మరింత తీవ్రమైన నిర్బంధం కొనసాగటంతోనూ ఆరోగ్యరంగంలోనూ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

ఖాజావలి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -