– హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసిన ఐపీఎస్‌లు
నవతెలంగాణ-హైదరాబాద్
తమ భూములన్నీ చట్టబద్ధమైనవేననీ, భూదాన్ భూములపై ఇటీవల సింగిల్ జడ్జి జస్టిస్ భాస్కర్‌రెడ్డి వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పలువురు ఐపీఎస్‌లు హైకోర్టులో అప్పీల్ పిటిషన్లు వేశారు. పిటిషనర్ మల్లేశ్ పిటిషన్‌లో అభ్యర్థించని అంశాల్లోకి జడ్జి వెళ్లి ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు రవి గుప్త, తరుణ్ జోషి, బీకే రాహుల్ హెగ్దే, జితేందర్ కుమార్ గోయల్ భార్య రేణుగోయల్, ఐఏఎస్ అధికారి జనార్దన్‌రెడ్డి కొడుకు రాహుల్ బుసిరెడ్డి, ఐపీఎస్ అధికారులు మహేష్ మురళీధర్ భగవత్, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, ఉమేశ్ షరాఫ్ భార్య రేఖ షరాఫ్, వ్యాపారవేత్త వీరన్నగారి గౌతంరెడ్డి వేర్వేరుగా నాలుగు అప్పీళ్లను దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం సర్వే నంబర్ 181, 194, 195లో భారీ భూ కబ్జాలపై ఫిబ్రవరి 16న, మార్చి 8న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 26 మంది ఉన్నతాధికారులు భూ కబ్జాలో ఉన్నందున ఈ అంశంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని కోరారు. ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. నాగారం గ్రామంలోని 181, 182, 194, 195 సర్వే నెంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించడాన్ని ఐపీఎస్ అధికారులు అప్పీల్ పిటిషన్లలో సవాల్ చేశారు. ఈ అప్పీళ్లను డివిజన్ బెంచ్ విచారణ చేయనుంది.
విద్యుత్ సంస్థల్లో ప్రమోషన్లు ఇవ్వొద్దు : హైకోర్టు
తెలంగాణ విద్యుత్ సంస్థలైన జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో పనిచేసే సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వరాదని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్ 2 నుంచి ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగోన్నతులు కల్పించడం వల్ల నష్టపోయిన ఓసీ, బీసీ ఉద్యోగులకు కూడా సీనియార్టీ మేరకు ఉద్యోగోన్నతులు కల్పించాలని 2018లో వెలువడిన ఉత్తర్వులపై రివ్యూ చేయాలన్న పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయనీ, పిటిషనర్లకు ఏవిధమైన ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆయా విద్యుత్ సంస్థలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులు వెలువడి ఏడేండ్లు అయ్యిందనీ, ఇప్పటి వరకు అమలు కాలేదని, రివ్యూ పిటిషన్‌పై తుది ఉత్తర్వులు వెలువడే వరకు పదోన్నతులు కల్పించరాదని తాజాగా తేల్చి చెబుతూ మధ్యంతర స్టే ఆదేశాలను జారీ వెలువరించింది.
మా భూములన్నీ చట్టబద్ధమైనవే
- Advertisement -
RELATED ARTICLES