మా ఇంటికి ఓట్ల కోసం రావొద్దు
ఇంటి ముందు బ్యానర్ కట్టిన ఓటరు
నవతెలంగాణ-మహాబూబాబాద్
”మా ఇంటికి ఓట్ల కోసం ఎవరూ రావద్దు.. మా కాలనీ అభివృద్ధి కోసం మాజీ కౌన్సిలర్ సుర్ణపు సోమయ్య నిరంతరం పనిచేస్తున్నారు.. అందుకే మా ఓట్లన్నీ సీపీఐ(ఎం) నేత సోమయ్యకే..” అని ఓ వ్యక్తి తన ఇంటి ముందు బ్యానర్ కట్టారు. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 29వ వార్డు మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య పోటీలో నిలిచారు. ఆయనకు కాంగ్రెస్ మద్దతు ఉంది. నాలుగు దశాబ్దాలుగా సోమయ్య ఓటమి ఎరుగని నేతగా ఎన్నికలలో గెలుస్తూ వస్తున్నారు.
అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వార్డు పరిధిలో కాలనీలలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేయించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో మరోసారి 29వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తుండగా సుర్ణపు సోమయ్యకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ క్రమంలో రొయ్యల సంపత్ అనే వ్యక్తి తన ఇంటి ముందు ‘మా ఇంటికి ఓటు అడగడం కోసం ఎవరూ రావొద్దు.. మా ఓట్లన్నీ సోమయ్యకే..” అని బ్యానర్ కట్టడం ఆసక్తికరంగా మారింది.



