లేదంటే ఆర్థిక ముఖ్యకార్యదర్శి కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వేర్వేరు శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్, జీపీఎఫ్, కమ్యుటేషన్, గ్రాట్యూటీ, ఆర్జిత సెలవు, సరెండర్ సెలవు, గ్రూపు ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాల చెల్లింపులో నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని హైకోర్టు రాష్ట్ర ఆర్థిక శాఖను హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వులను ఆషామాషీగా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. న్యాయస్థానాలతో ఆటలాడే పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలని హితవు చెప్పింది. పాక్షిక చెల్లింపులు చేసి వాయిదాలపై వాయిదాలు తీసుకుంటామంటే కుదరదని చెప్పింది. జూన్ 10కి విచారణను వాయిదా వేస్తున్నామని, అప్పటిలోగా రిటైర్డు ఉద్యోగులం దరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఒక్క రిటైర్డు ఉద్యోగికి చెల్లించక పోయినా అందుకు కారణం ఏమిటో వివరించేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. దాదాపు 758 మంది రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 221 మందికే పూర్తిస్థాయిలో చెల్లింపులు చేశారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వం 737 మందికి చెల్లించామని చెప్పినప్పటికీ, కోర్టులో పరిశీలించిన రికార్డుల ప్రకారం ఆస్థాయిలో చెల్లింపులు చేయలేదన్నారు. టోకెన్‌లు జారీ చేయడాన్ని చెల్లింపుగా పరిగణించలేమన్నారు. మొత్తం 3,656 టోకెన్‌లు జారీ చేశామనీ, వాటిలో 1,056 టోకెన్‌లకు మాత్రమే చెల్లింపులు జరిగాయనీ, ఇంకా వేల సంఖ్యలో టోకెన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొన్నది. పిటిషనర్ల తరుపు న్యాయవాది వాదిస్తూ, ఒక్కో పిటిషనర్‌కు పలు హెడ్‌ల కింద టోకెన్‌లు జారీ అయినప్పటికీ, కొన్నింటికి మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. దీనిపై మరో అవకాశం ఇస్తున్నామనీ, నిర్ణీత గడువులోగా అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించి ప్రతి పిటిషనర్‌కు చెల్లింపులు జరిగినట్లు స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించింది. చెల్లింపులు ఒక్కరికి జరగకపోయినా గత ఉత్తర్వుల ప్రకారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని హెచ్చరించింది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వ అనుగ్రహం కాదనీ, అవి ఉద్యోగులు తమ సేవ కాలంలో సంపాదించిన హక్కులని చెప్పింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో దాఖలైన వందలాది కోర్టు ధిక్కరణ పిటిషన్‌లపై తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.
పవన్ ఖేరా బెయిల్ పిటిషన్ విచారణార్హతపై నేడు ఉత్తర్వులు
అసోంలో నమోదైన కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత పవన్ ఖేరా దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణార్హతపై ముందుగా నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. కేసు గౌహతిలో నమోదవగా, పిటిషనర్ ఢిల్లీలో నివసిస్తున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు ఈ పిటిషన్‌ను విచారించే పరిధి ఉందా? అన్నది తేల్చాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ముందస్తు బెయిలు కోరుతూ పవన్ ఖేరా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ఇది రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసు అని పేర్కొన్నారు. పరువు నష్టం కేసులోనే పిటిషనర్ నివాసానికి పెద్ద ఎత్తున పోలీసులు వెళ్లడం దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు. అసోం రాష్ట్రం తరఫున ఏజీ దేవజిల్ షైకీ వాదిస్తూ, ఇది సాధారణ పరువు నష్టం కేసు కాదని, కుట్ర కోణం ఉందని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషన్ విచారణార్హత అంశంపైనే శుక్రవారం ఉత్తర్వులను జారీ చేస్తామన్నారు.
ఆ ఆలయ ముఖద్వారం – చట్టబద్ధతపై జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకోవాలి
హైదరాబాద్ నగరంలోని తార్నాక ప్రాంతంలో శ్రీదుర్గ పోచమ్మ దేవస్థానం నిర్మించిన ముఖద్వారం చట్టప్రకారం జరిగిందా? కాదా? అన్నది తేల్చాలని హైకోర్టు జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తూ ఇరుపక్షాల వాదనలు వినిపించుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినట్టు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ విచారణ జరిపారు. పిటిషనర్ వినతిపత్రాన్ని చట్టబద్ధంగా పరిశీలించి, సంబంధిత పత్రాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ నిర్మాణం అక్రమమని తేలితే కూల్చివేత చర్యలు చేపట్టాలని, దానికి సంబంధించిన ఖర్చును ఆలయం నుంచే వసూలు చేయాలని స్పష్టం చేశారు. దీంతో కేసును ముగించారు.
జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల వివాదం
జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్‌పై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సొసైటీ తరఫు వాదనలు జరిగాయి. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు విని ఇరు పక్షాలు తమ రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈవివాదంపై గతంలో సింగిల్ జడ్జి.. ఎన్నికల నోటిఫికేషన్ సహకార సంఘ చట్టం నిబంధనలు, సొసైటీ బైలాస్‌కు విరుద్ధంగా జారీ అయ్యిందని ఆరోపిస్తూ స్టే విధించారు.
పెన్షన్ బకాయిలన్నీ చెల్లించాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



