ఆ దేశ ఆర్థికమంత్రి భారత్ పర్యటనపై సీపీఐ(ఎం) ఖండన
న్యూఢిల్లీ : ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మాట్రిచ్ భారత్ పర్యటనను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. భారత ప్రభుత్వంతో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఆయన నేతృత్వంలో ఇజ్రాయిల్ ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటించింది.
పాలస్తీనా ప్రజలను బలవంతంగా తరలించడం ద్వారా గాజాను ఆక్రమించినందుకు నెతన్యాహు ప్రభుత్వాన్ని బలపరిచే మితవాద జాత్యహంకార పార్టీకి చెందిన వ్యక్తి స్మాట్రిచ్. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయిల్‌లో విలీనం చేసుకోవాలన్న ప్రతిపాదనలు తొలుత చేసింది కూడా ఆయనే.
పాలస్తీనా జాతి ప్రక్షాళనకు సంబంధించిన ఆయన విస్తరణవాద విధానాల ఫలితంగా ఆయన తమ దేశానికి రాకూడదని అనేక దేశాలు నిషేధం విధించాయి. వాటిల్లో కొన్ని దేశాలైతే ఇతరత్రా ఆంక్షలు కూడా విధించాయి. ఆ దేశాల్లో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, నార్వే, నెదర్లాండ్స్, స్లొవేనియా, న్యూజీలాండ్‌లు వున్నాయి.
అటువంటి వ్యక్తికి మోడీ ప్రభుత్వం ఆతిథ్యమివ్వడం, పైగా ప్రతిరోజూ గాజా ప్రజలు ఊచకోతకు గురవుతున్న తరుణంలో ఇజ్రాయిల్ ప్రభుత్వంతో ఒప్పందాలపై సంతకాలు చేయడం సిగ్గుచేటైన విషయమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ అధ్యాయం చూస్తూంటే నెతన్యాహు ప్రభుత్వంతో మోడీ ప్రభుత్వం ఎంత లోతైన, ధృఢమైన సంబంధాలు కొనసాగిస్తోందో, పైగా గాజాలో కొనసాగుతున్న భయంకరమైన మారణకాండపై మోడీ ప్రభుత్వ ఉదాసీనత కూడా స్పష్టమవుతోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
గాజాలో తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించి, పాలస్తీనా సమస్యకు న్యాయమైన, శాంతియుత పరిష్కారం దిశగా కృషి చేసేవరకు ఇజ్రాయిల్‌తో అన్ని రకాలైన సైనిక, భద్రతా, ఆర్థిక సహకార సంబంధాలను భారత ప్రభుత్వం రద్దు చేసుకోవాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.