టీయూఎంహెచ్‌ఇయూ ప్రతినిధులతో ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ కార్యదర్శి గోపికాంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందనీ, దీంతో అన్ని ఫలితాలను నవంబర్ తర్వాత ప్రకటిస్తామని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయూఎంహెచ్‌ఇయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్ ఆధ్వర్యంలో నాయకులు, అభ్యర్థులు గోపికాంత్ రెడ్డిని కలిసి పారామెడికల్ పోస్టులను భర్తీ చేయాలని వినతి పత్రం సమర్పించారు. నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి మెరిట్ లిస్ట్ ఇప్పటికే ఇచ్చినందున అభ్యంతరాలు అన్ని క్లియర్ చేసి వెంటనే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని కోరారు. ల్యాబ్ టెక్నీషియన్ల వెరిఫికేషన్ పూర్తి చేసినందుకు కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు. వీరికి త్వరగా ఫైనల్ లిస్టు ఇచ్చి అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
గోపికాంత్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 16 తర్వాత పారామెడికల్ పోస్టులు ముఖ్యంగా నర్సింగ్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎం, ల్యాబ్ టెక్నిషియన్లకు సంబంధించిన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఫార్మసిస్టులకు సంబంధించి డ్రగ్ కంట్రోల్ అథారిటీ రిపోర్టు వచ్చిన తర్వాత లిస్టు పెడతామని చెప్పారు. అయితే ఈ నెల 24న హైకోర్టులో తుది తీర్పు వస్తుందనీ, ఆ తర్వాతే లిస్టు ప్రిపేర్ చేస్తామని చెప్పారు. కార్యదర్శిని కలిసిన ప్రతినిధుల్లో నర్సింగ్ ఆఫీసర్స్ నుంచి సుష్మ, శిరీష, రమేశ్ రెడ్డి, సురేష్, విజేత, రాకేశ్ తదితరులు, ల్యాబ్ టెక్నీషియన్ల నుంచి ఆదిత్య, సంగమేశ్, ఏఎన్‌ఎంల నుంచి నిజామాబాద్‌కు చెందిన కొంత మంది నాయకులు, ఫార్మసిస్టు నాయకులు పాల్గొన్నారు. నవంబర్ 17న పారా మెడికల్ పోస్టుల ఫలితాలు ప్రకటించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నాయకత్వం నిర్ణయించుకుంది.