సీపీఐ(ఎం) మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
మోడీ పాలనలో వ్యవస్థలన్నింటిని బలహీన పర్చారని సీపీఐ(ఎం) మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దివాలా కోరు విధానాల కారణంగా నిరుద్యోగం పెరిగిందన్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపణలు విఫలం చెందాయని విమర్శించారు. 2026 జనవరి 18,19,20 తేదీల్లో ఇబ్రహీంపట్నంలో జరగనున్న డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా మంగళవారం ఇబ్రహీంపట్నం కేంద్రంలో ఆహ్వాన కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. విద్యా, ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే ఇతర సంఘాలు పని చేస్తున్నాయన్నారు. డీవైఎఫ్ఐ మాత్రం దేశ సమగ్రతను కాపాడుతూ ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజాతంత్ర ఉద్యమాల్లో అనేకమంది యువకిశోరాలు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ప్రజాతంత్ర యువజన సమాక్య నాయకులపై నిర్బంధాలు, పెరుగుతున్న జైలలో మగ్గుతున్న వెనకడుగు వేయకుండా సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు.
కానీ పాలక పక్షాలు నిరుద్యోగాన్నీ రూపు మాపడంలో విఫలమయ్యాయన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా పోయాయన్నారు. దేశ యువతను ప్రోత్సహించక పోవడం వల్లనే ఈ దేశ యువత ఇతర దేశాలకు వెళుతుందన్నారు. వారి శక్తిని ఇతర దేశాలు ఉపయోగించుకుని అభివృద్ధి సాధిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా పేరుగాంచిన చైనా పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. నిరుద్యోగం అనేది లేకుండా చేస్తుందని తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత దేశ ప్రభుత్వం ప్రయత్నం ఎందుకు చేయడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్య పాలన సాగడం లేదన్నారు. ఎన్నికల ప్రక్రియ అద్దం పడుతుదని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో అది బట్టబయలైందన్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేకుండా చేసిన ఘనత నేటిపాలక బీజేపీకే దక్కిందని విమర్శించారు. అడ్డదారుల్లో అధికారంలోకి వస్తున్న బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
విద్యా, వైద్య రంగాలు అనుభవం లేని వ్యక్తులు చేతుల్లోకి వెళుతున్నాయని మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఏడాదికి ఉన్న రెండు కోట్ల ఉద్యోగాలను తొలగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల నియంత్రణ మరిచిందని విమర్శించారు. ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కోటి 85 లక్షల కోట్ల రూపాయల అప్పులు దేశ ప్రజలపై మోపిందన్నారు. దేశ సంపదనుబడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని విమర్శించారు. కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి 1000 మంది రైతులకు ప్రాణాలు బలి తీసుకుందని మండిపడ్డారు. మోడీ పాలనలో చరిత్ర కనుమరుగవుతుందని మండిపడ్డారు. అందుకే పాలకపక్షాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైందని గుర్తు చేశారు. యువకులు రోడ్లపైకి వచ్చి తిరుగుబాటు ఉద్యమాలను ఆరంభించారని వివరించారు. అందుకు ఇటీవల ఆయా దేశాల్లో జరిగిన ఎన్నికల్లో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు విజయం సాధిస్తున్నారని చెప్పారు.
మాజీ ఎమ్మెల్సీ పలుకుపల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. మితవాద ఉద్యమాలు ముందుకు వస్తున్న తరుణంలో డీవైఎఫ్ఐ యువజన సంఘం వాటిని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మతం పేరుతో విద్యారంగాన్ని విషపూరితం చేస్తుందని మండిపడ్డారు. ప్రశ్న అనేది లేకుండా చేసే ఆలోచనగా దోపిడీ వర్గాలు ముందుకు వస్తున్నాయన్నారు. ప్రశ్నించే గొంతులను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. అసమానతలను పెంచి పోషిస్తుందనీ మండిపడ్డారు. ఈ దేశ సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువత దానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రపంచం సంక్షోభంలోకి వెళుతుందని వివరించారు. యువత ఈ పరిణామాలపై నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. పని చేయగలిగే యువతకు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించడం లేదన్నారు. ఏడాదికి మూడు లక్షల 50 వేల మంది డిగ్రీలు సర్టిఫికెట్లు పొందుతున్నారని వారికి ఉద్యోగ, ఉపాధి కల్పించడంలోనూ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండి పడ్డారు.
ఇలాంటి తరుణంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించడం శుభ పరిణామమని గుర్తు చేశారు. ప్రతి గడపను తడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న యువజన, ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర, అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనంగంటి వెంకటేష్, జిల్లా కార్యదర్శి పి జగన్, మాజీ జెడ్పీటీసీ పి.యాదయ్య, మాజీ డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కాడిగళ్ల భాస్కర్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సామెల్, ప్రకాష్ కరత్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్, వ్యకాస జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి జగదీష్, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అరుణ్ కుమార్ తదితరులున్నారు.




