Thursday, May 29, 2025
Homeప్రధాన వార్తలుదు:ఖమే మిగిలింది

దు:ఖమే మిగిలింది

- Advertisement -

– సంచులియ్యక.. కాంటాలు పెట్టక..
– రైతన్న ఆరుగాలం శ్రమంతా నీటిపాలు
– వరుస అకాల వర్షాలతో తీవ్ర నష్టం.. మొలకెత్తుతున్న ధాన్యం
– ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం
– వేగంగా కొనుగోళ్లు జరిపేలా చూడాలంటున్న అన్నదాతలు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/ వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

”రైతే రాజన్నదెవడు.. మా కట్టాలు సూడండి.. 20 రోజులైంది.. ఇక్కడికి తెచ్చి ఆరబోసినం .. మంచిగ ఎండినరు.. సీరియల్‌ నంబర్లని సంచులియ్యలే.. వర్షాలు పడి వడ్లు తడిసి పాడైనరు.. మొలకెత్తినరు.. ఈ నట్టం ఎవ్వలు భరించాలే..? సంచులిత్త్తలేరు.. టార్పాలిన్లు మేమే పట్టుకొచ్చుకున్నం.. ఈళ్లు చేసేదేముంది..?” అంటూ రైతులు వాపోతున్నారు. సోమవారం జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ‘నవతెలంగాణ’ సందర్శించింది. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడగా.. కేంద్రాల్లో జరుగుతున్న ఆలస్యంపై తీవ్ర అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. చిల్పూరు మండలకేంద్రంలో మూడు ప్రాంతాల్లో ధాన్యాన్ని ఆరబోసుకొని రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు పడిగాపులు పడుతున్న దుస్థితి కనిపించింది.
‘అప్పు చేసి రెండు ఎకరాల్లో పంట వేసిన. వచ్చిన పంటను ఆరబెట్టేందుకు నెల కిందటే సింగిల్‌ విండో సెంటర్‌కు వచ్చిన. వాళ్లేమో టైంకు కొనలే. ఇప్పుడు వానకు వడ్లన్నీ తడిసి మొలకొచ్చినరు. తడిసిన ధాన్యం కొంటున్నరుగానీ బస్తాకు బాగా తరుగు తీస్తున్నరు’ అంటూ కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లికి చెందిన బైరి లక్ష్మి వాపోయింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలు, ఇతర జిల్లాల్లో ఆయా కొనుగోలు కేంద్రాల్లో ఎవరిని కదిలించినా.. పెట్టుబడుల్లో పావు వంతు కూడా మిగలడం లేదంటూ ఆవేదన చెందారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈసారి పెద్దమొత్తంలో వరి సాగు చేశారు. ఇతరత్రా పంటలుగా మొక్కజొన్న సహా మిరప ఇతర కూరగాయల్ని వేశారు. అయితే, అకాల వర్షాలకు తోడు నైరుతి రుతుపవనాలు కూడా ముందస్తుగా రావడంతో రాష్ట్రంలో వానలు పడుతున్నాయి.. యాసంగి ధాన్యం అమ్మడానికి పెట్టిన రైతులకు దు:ఖాన్ని మిగుల్చుతున్నాయి. ఏప్రిల్‌ నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో కన్నీరే మిగిలింది. రాష్ట్రంలో ఏ జిల్లాను చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. కొనుగోళ్లు జరగక.., ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. వరుస వర్షాలతో ధాన్యం మొలకెత్తుతోంది. ఏప్రిల్‌ మొదటి వారంలో కురిసిన వర్షాల ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సుమారు లక్ష ఎకరాల వరకు పంట పొలాల్లోనే ధాన్యం రాలింది. అందులోనూ అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలోనే సుమారు 30వేల ఎకరాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మిగిలిన పంటను కోసి అమ్ముకుందామనే సమయానికి ఇటీవల వర్షాలు మరింత నష్టాన్ని చేకూర్చాయి. మొత్తంగా ఈ నాలుగు జిల్లాల్లో అకాల వర్షాలకు సుమారు 4 లక్షల క్వింటాళ్లకుపైగా ధాన్యం తడిసి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. నీళ్లలో కొట్టుకుపోయింది ఎక్కువగానే ఉంది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 9.5లక్షల వరి సాగు విస్తీర్ణంలో సుమారు 1.5లక్షల ఎకరాల్లో పంట దిగుబడి దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. ఈ నష్ట తీవ్రత ఇతర పంటలన్నీ కలిపితే మరింత ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఈ సీజన్‌లో ఒక్కో రైతు ఎకరానికి రూ.20వేల నుంచి రూ.25వేల పెట్టుబడి నష్టపోయారు. అందులోనూ కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయమేనని చెప్పొచ్చు.
జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 30,112 మంది రైతుల నుంచి 1,47,777 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్నాలు కేవలం 20,103 మెట్రిక్‌ టన్నులు మాత్రమే రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. చిల్పూరు మండల కేంద్రంలో ఇప్పటి వరకు 160మంది రైతుల నుంచి దొడ్డురకాలు, సన్నరకాలు కలిపి 1,417 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 19 మంది రైతుల నుంచి 1,297 బస్తాల సన్న రకం ధాన్యం కొనుగోలు చేసినా వారికి నేటికీ బోనస్‌ చెల్లించలేదు. చిల్పూరు మండల కేంద్రం నుంచి ఇప్పటి వరకు 56 లారీల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 12 లారీల ధాన్యం తరలించాల్సి ఉంది. కాగా, కొనుగోలు కేంద్రంలో సీరియల్‌ నెంబర్ల నెపంతో రైతులకు గన్నీ సంచులు ఇవ్వడం లేదు. కేంద్రంలో సంచులున్నా.. రైతులకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. అంతేకాక, ఇచ్చిన సంచులు సైతం చిల్లులు పడి ఉంటున్నాయి. దాంతో కల్లాల్లోనే రైతులు ధాన్యం ఆరబోసుకొని వర్షానికి తడవకుండా ఉండటానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

మంత్రి ఉత్తమ్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం..
నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హన్మకొండ కలెక్టరేట్‌లో రెండు శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డామేజీ సంచులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లారీలను అధికంగా వినియోగించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు సరఫరా చేయాలని, లేకుంటే వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సూచించారు. ఈ సూచనలను అధికార యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.
కొనుగోలుపైనే ఆశలు
తడిసిన ధాన్యం విషయంలో ప్రభుత్వం, అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొంటామని కలెక్టర్లు ప్రకటించినప్పటికీ కేంద్రాల వద్ద ప్రస్తుతం కాంటా పెట్టే పరిస్థితి లేదు. సేకరణ ప్రక్రియ ఎలా చేస్తారనేదే ఇప్పుడు అధికారుల ముందున్న సవాలు. కొన్ని చోట్ల కొంటున్నా.. తరుగు పెద్దఎత్తునే తీస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -