– పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తటం ముఖ్యం
– ఎమ్మెల్యేలందరూ సభకు హాజరయ్యేలా చూడాలి
– జనవరి ఒకటిన పీపీటీకి ఎవ్వరికీ మినహాయింపు లేదు
– మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాటాలకు సంబంధించి అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే అవకాశమున్నందున ఆయా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తద్వారా ప్రధాన ప్రతిపక్షంపై యుద్ధానికి సిద్ధమై రావాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. సోమవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మంత్రులు, ప్రభుత్వ విప్‌లతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…తెలంగాణ నీటి వాటాలపై నిగ్గు తేల్చాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అందువల్ల అందరూ సరిగ్గా ప్రిపేరై రావాలని, పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తటం ద్వారా ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని సూచించారు. ఈ మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ సభకు హాజరయ్యేలా చూడాలంటూ మంత్రులు, ప్రభుత్వ విప్‌లను ఆదేశించారు. జనవరి ఒకటిన బేగంపేట ప్రజాభవన్‌లో ఏర్పాటు చేయబోయే పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు ఏ ఒక్కరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల పేరు చెప్పి, ఎవరు డుమ్మా కొట్టినా ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. దాదాపు 35 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో సీఎం ప్రధానంగా నీటి వాటాల గురించే మాట్లాడినట్టు సమాచారం. కాగా అసెంబ్లీ లాబీల్లో తనకు ఎదురైన పాత్రికేయులతో ముచ్చటించిన సీఎం… బీఆర్‌ఎస్‌పైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని ఎద్దేవా చేశారు. సభలో కేసీఆర్‌తో ఏం మాట్లాడారంటూ అడగ్గా…’అది మీకెలా చెబుతాం…’ అంటూ చమత్కరించారు. ప్రతీ సభ్యుడిని గౌరవించినట్టుగానే కేసీఆర్‌ను గౌరవిస్తామన్నారు. కేసీఆర్ గతంలో అనారోగ్యం పాలైనప్పుడు కూడా తాను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించానంటూ సీఎం గుర్తు చేశారు. అసెంబ్లీ నుంచి తొందరగా కేసీఆర్ వెళ్లిపోవటాన్ని ప్రస్తావించగా…’ఆ విషయంపై ఆయన్నే అడిగితే బాగుంటుంది…’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఆ ప్రాంత ఎమ్మెల్యేలందరూ ప్రిపేరై రావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



