Monday, January 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎర్రజెండాలన్నీ ఒకే జెండాగా ఎగరాలి

ఎర్రజెండాలన్నీ ఒకే జెండాగా ఎగరాలి

- Advertisement -

ముందుగా సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు కలవాలి
ఆ తర్వాత మిగిలిన కమ్యూనిస్టు పార్టీలు ఏకమవుతాయి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశంలోని ఎర్రజెండాలన్నీ ఒకే జెండాగా రెపరెపలాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆకాంక్షించారు. సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు ముందుగా కలిసిపోవాల్సిన అవసరముందని తెలిపారు. ఆ తర్వాత మిగిలిన అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా ఢిల్లీలోని ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరే అవకాశాలు ఉంటుందని చెప్పారు. మనమంతా ఒక్కసారి పునరాలోచన చేసుకుందామని కోరారు. అందరం కలిసి ఆలోచన చేస్తే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, సిద్ధ్దాంత వైరుధ్యాలు ఉన్నా పరిష్కారమవుతూనే వచ్చాయని గుర్తు చేశారు. మావోయిస్టులు భిన్నమైన ఎజెండాతో ఉన్నప్పటికీ వారు కూడా ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. అప్పటివరకు ఐక్యత కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. ఆ ఐక్యత లేకపోతే ప్రధాని మోడీ నేతృత్వంలో మానవ హననం కొనసాగుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఎదుర్కొవాలంటే కమ్యూనిస్టులు ఏకం కావడమే మార్గమని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కమ్యూనిస్టులు విడిపోయి ఉంటే దేశ భవిష్యత్తుకు మంచిందికాదన్నారు. వీర తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆశువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీకి మరణం లేదనీ, ఈ జెండాను మోసే వాడు నేలకొరిగే లోపే మరొకరు జెండాను ఎత్తేందుకు సిద్దంగా ఉంటారని తెలిపారు.

‘మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం కమ్యూనిజం. పేదవాడి కంచంలో మెతుకు. నిరుపేదల ఆశాజ్యోతి ఎర్రజెండా. మనిషి ఉన్నత వరకు ఎర్రజెండాకు మరణం లేదు. నిజమైన దేశ భక్తులు కమ్యూనిస్టులు’ అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రజాస్వామిక పార్టీ అన్నారు. ఆ పార్టీ నేతల్లో తాను ముఖ్యమంత్రి, మంత్రి అనే భేషజాలు ఉండవని తెలిపారు. ప్రజా విప్లవకారుడు ముఖ్యమంత్రి రేవంత్‌ అన్నారు. అందుకే ఆయనను సీపీఐ వందేండ్ల ముగింపు ఉత్సవాలకు ఆహ్వానించామని చెప్పారు. అదేవిధంగా గొప్ప మేధావి అయిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందరికంటే ఎక్కువగా మంత్రిగా పని చేసిన తుమ్మల నాగేశ్వరరావు సైతం బహిరంగ సభలో భాగస్వామ్యం కావడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌కు మోడీ బానిసగా మారారని సీపీఐ జాతీయ నేత కే నారాయణ విమర్శించారు. మోడీ పక్కన కేసీఆర్‌, చంద్రబాబునాయుడు, జగన్మోహన్‌రెడ్డి చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ పోటు నుంచి గంజాయి పెద్ద ఎత్తున సరఫరా అవుతుంటే ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ప్రశ్నించారు. సమ్మక్క సారలమ్మలు దేవుళ్లు కారనీ, ప్రజల కోసం పోరాడిన ధీరులని కొనియాడారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ కమ్యూనిస్టులు 1964లో ఒకసారి చీలిపోయామనీ, ఆ తర్వాత ఎన్నో చీలికలొచ్చాయన్నారు. మనం ఇంకా ఎన్ని ఏండ్లు ఇలాగే ఉందామని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -