మేడారం వెళ్లేముందు కొమురవెల్లి, వేములవాడ మొక్కుల సందడి
నవతెలంగాణ – పరకాల
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర గడియలు దగ్గరపడుతుండటంతో పల్లెల్లో జాతర సందడి నెలకొంది. ‘పల్లెల్లన్నీ జాతర్ల తొవ్వకే’ అన్నట్లుగా గ్రామాలు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నాయి. అయితే, వనదేవతల దర్శనానికి వెళ్లేముందు తమ ఇలవేల్పులైన కొమురవెల్లి మల్లన్న, వేములవాడ రాజన్న, ఐలోని మల్లన్నలకు మొక్కులు చెల్లించుకోవడం మన ప్రాంత ఆచారంగా వస్తోంది.
మొక్కులు చెల్లించి.. మేడారం బాట పట్టి..
మేడారం జాతర కంటే ముందే భక్తులు తమ కులదైవాలను దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల ప్రజలు కొమురవెల్లి మల్లన్న పట్నాలు వేయడం, వేములవాడ రాజన్నకు కోడె మొక్కులు చెల్లించడం, ఐలోని మల్లన్న దర్శనం చేసుకోవడాన్ని పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్కులు పూర్తయ్యాకే మేడారం అడవి వైపు అడుగులు వేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.
జాతర వాతావరణంలో శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గంగిరెద్దుల ఆటలు, శివసత్తుల ఊగిసలాటలతో గ్రామాలు మార్మోగుతున్నాయి. సమ్మక్క-సారలమ్మ ఎత్తు బంగారం తీసుకెళ్లే క్రమంలో భక్తులు చూపే భక్తిశ్రద్ధలు అద్వితీయం. ఇంటింటా అంటు ప్రసాద పంపిణీ చేస్తూ, బంధుమిత్రులను పిలిచి విందులు ఏర్పాటు చేయడం ఈ జాతర సంస్కృతిలో భాగమైంది.
సందడిగా పల్లెలు
గ్రామాల్లో ఎటు చూసినా జాతర ప్రయాణాల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. బంధుమిత్రులను ఆహ్వానిస్తూ, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల రోజులు భక్తి మార్గంలోనే పల్లెలు ప్రయాణించనున్నాయి. ఇలవేల్పుల ఆశీస్సులు తీసుకుని, అడవి తల్లుల ఆశీర్వాదం కోసం భక్తులు మానసికంగా సిద్ధమవుతుండటంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.



