Monday, April 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనాదర్‌గుల్‌ భూములపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం

నాదర్‌గుల్‌ భూములపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం

- Advertisement -


మంత్రి పొంగులేటి కుటుంబానికి ఏలాంటి సంబంధంలేదు
2021లో స్థలం చుట్టూ రేకులతో ప్రహరి నిర్మాణం
2015లో సుప్రీంకోర్టు తుది తీర్పుతో రాజా శివ్‌రాజ్‌ బహదూరు వారసులు హక్కుదారులుగా గుర్తించబడ్డారు
భూవివాదం కోర్టులో ఉన్న కారణంగా ల్యాండ్‌ రిఫార్మ్స్‌ చట్టం వర్తించదు
బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండిస్తున్నాం : కోహినూర్‌ గ్రూప్‌ వివరణ


నవతెలంగాణ- హైదరాబాద్‌ బ్యూరో
నాదర్‌గుల్‌ భూముల వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నాయకుల ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమని, ఈ భూముల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వారి కుమారుడు హర్షరెడ్డికి ఏలాంటి సంబంధంలేదని కోహినూర్‌ గ్రూప్‌ వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించింది. వివరణకు సంబంధించిన వివరాలు…రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌ గ్రామంలో సర్వే నెంబర్‌ 613లో ఉన్న 373.22 ఎకరాల భూమి హక్కులపై జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలను వెల్లడించారు. ఏక్యూ స్క్వేర్‌ రియల్టర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2021లో మొత్తం స్థలం చుట్టూ రేకులతో ప్రహరిని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని గూగుల్‌ ఎర్త్‌ వెబ్‌సైట్‌లోని టైమ్‌లైన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్రహరి పనులు 2022 మే నెలలో పూర్తయ్యాయి. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టినవికావు.

ఏక్యూ స్క్వేర్‌ రియల్టర్స్‌(ఇండియా) ప్రయివేట్‌ లిమిటెడ్‌లో డిసెంబర్‌ ఆరు 2021 నుంచి మార్చి ఒకటి 2023 వరకు పొంగులేటి హర్షరెడ్డి అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. అనంతరం బోర్డు నుంచి రాజీనామా చేశారు. అట్టి వివరాలు ఎంసీఏ రికార్డుల్లో నమోదయ్యాయి. నాదల్‌గుల్‌ భూ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ప్రేరేపితంగానే నిరాధార ఆరోపణలు చేస్తూ పొంగులేటి హర్షరెడ్డికి ఆపాదిస్తున్నారు. అట్టి భూమి రాజా శివ్‌రాజ్‌ బహదూర్‌కు చెందిన ప్రయివేట్‌ ఆస్తి. 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ఆయన వారసులే హక్కుదారులని దృవీకరించబడింది. భూమిపై 2005లో ఓఎస్‌ నెంబర్‌ 155తో వివాదం ప్రారంభమైంది. యాజమాన్యం, ఆక్యుపెన్సీ హక్కులపై డిక్లరేషన్‌, రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ పిటిషనర్లు కోర్డును ఆశ్రయించగా 2007 ఏప్రిల్‌ 20న ట్రయల్‌ కోర్టు ఈ కేసును కొట్టివేసింది. దీనిపై హైకోర్టులో ఏఎస్‌ నెంబర్‌ 274/2007 ద్వారా అప్పీల్‌ దాఖలైంది.

డివిజన్‌ బెంచ్‌లో భిన్నాభిప్రాయాల కారణంగా కేసు మూడో న్యాయమూర్తికి వెళ్లింది. 2011 డిసెంబర్‌ 19న వెలువడిన తీర్పులో పిటిషనర్లను పూర్తిగా యాజమానులుగా కోర్టు గుర్తించింది. రాష్ట్రం జోక్యం చేసుకోకుండా శాశ్వత ఇంజక్షన్‌ కూడా మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ 2013లో దాఖలు చేసిన సివిల్‌ అప్పీలు(2963,2964)ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సదరు భూయజమానులకు ఆక్యుపెన్సీ హక్కులు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. భూమి విస్తీర్ణం అధికంగా ఉండడంతో ల్యాండ్‌ రిఫార్మ్స్‌ చట్టం వర్తించాలనే ప్రశ్న తలెత్తినప్పుడు 2015 వరకు భూమి వివాదంలో ఉండడంతో ఆ చట్టం అమలు కాదు. 2020 జనవరి 9న ల్యాండ్‌ రిఫార్మ్స్‌ ట్రిబ్యునల్‌(ఎల్‌ఆర్‌టీ) నోటీసులు జారీ చేసిందని, దీనిపై భూయజమానులు అప్పీల్‌ దాఖలు చేయగా అది ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.

రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి ”పాట్‌ ఖరాబ్‌”గా నమోదైంది. అర్బన్‌ పరిధిలో ఉండడంతో ల్యాండ్‌ రిఫార్మ్స్‌ చట్టం వర్తించదు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్డులో పెండింగ్‌లో ఉంది. 2016లో దాఖలైన రివ్యూ పిటిషన్‌ కూడా తిరష్కరించబడింది. 2021లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. భూమికి సంబంధించిన డెవలప్‌మెంట్‌ ఒప్పందం ఏక్యూ స్క్వేర్‌ రియల్టర్స్‌, ప్రవేట్‌ లిమిటెడ్‌ వద్ద ఉంది. రాజా శివ్‌ రాజ్‌ బహదూర్‌ వారసుల ప్రతినిధి కరీం అల్లాదీన్‌తో ఏక్యూ స్క్వేర్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. అదే విధంగా ఒమేగా డెవలప్‌మెంట్‌ వెంచర్స్‌, ఆల్ఫా ఎస్టేట్‌ హౌల్డింగ్స్‌, యునైటెడ్‌ ల్యాండ్‌మార్స్క్‌ సంస్థలతో కూడా ఒప్పందాలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -