Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజనుల సంక్షేమానికి.. బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించాలి

గిరిజనుల సంక్షేమానికి.. బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించాలి

- Advertisement -

తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు కోసం 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్‌, ఆర్‌.శ్రీరాం నాయక్‌లు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి దళితులు, గిరిజనుల ఓట్లే ప్రధానమని తెలిపారు. చేవెళ్ల డిక్లరేషన్‌ పేరుతో వారికి అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను గ్యారెంటీ కార్డుగా ఉపయోగించి చేవెళ్ల డిక్లరేషన్‌ ప్రకటించిందని చెప్పారు. గిరిజనులకు 15 రకాల వాగ్దానాలను ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. గత రెండేండ్లలో బడ్జెట్‌లో గిరిజనులకు కేటాయించిన రూ.30 వేల కోట్లలో కేవలం రూ.4 వేల కోట్లు కూడా ఖర్చు చేయకుండా మిగిలిన నిధులను దారిమళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేడ్కర్‌ అభయహస్తం పేరుతో ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు లక్ష కుటుంబాలు ఉన్నందున రూ.12 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. సమ్మక్క సారక్క గ్రామీణ అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడెం, తండాల గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా రూ. 25 లక్షలు ప్రత్యేక నిధి హామీ అమలు కోసం 5,727 గిరిజన గ్రామ పంచాయతీలకు రూ.1,573 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. గిరిజనులకు మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఒక్కో కార్పరేషన్‌కు రూ.500 కోట్ల చొప్పున రూ.1,500 కోట్లు ప్రతి ఏటా కేటాయిస్తామని కూడా వాగ్ధానం చేశారని పేర్కొన్నారు. మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి 5 జిల్లాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఒక్కో దానికి రూ.500 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,500 కోట్లు, ప్రస్తుతం ఉన్న మూడు ఐటీడీఏలను కలుపుకుంటే మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ. 4 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. విద్యాజ్యోతి పథకం ద్వారా పదో తరగతి పాస్‌ అయితే రూ.10 వేలు, ఇంటర్‌కు రూ.15 వేలు, గ్రాడ్యుయేట్‌ కు రూ.25 వేలు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌కు రూ.1 లక్ష, ఆపైన చదువులకు రూ.5 లక్షలు ఇస్తామన్న హామీకి ఒక్క ఏడాదిలోనే రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను కాపాడి గిరిజనులకే హక్కులు కల్పిస్తామన్నారు. ఎక్కడైనా అసైన్డ్‌ భూములను ప్రభుత్వం లాక్కుంటే 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తామన్నారు. రాష్ట్రంలో గిరిజనులు సాగులో ఉన్న ఏడు లక్షలకు పైగా పోడు భూములకు హక్కులు కల్పిస్తామన్నారు. అందుకు సరిపడా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటికీ నిధులు కేటాయించకుంటే గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -