Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

- Advertisement -

కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా కొనసాగిన లక్కీ డ్రా
భారీ పోలీసు బందోబస్తు
నవతెలంగాణ- కంఠేశ్వర్

మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం నిజామాబాద్ నగర శివారులోని భారతీ గార్డెన్ లో లాటరీ పద్దతిలో వైన్ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సయిజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 2786 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు.

లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్ లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భారతీ గార్డెన్ తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీసు బందోబస్తును పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించబడిన వారు నిబంధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా కొనసాగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -