Thursday, October 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఆల్మట్టి ఎత్తు పెంపు- తెలంగాణ ప్రాజెక్టులకు నీటికొరత

ఆల్మట్టి ఎత్తు పెంపు- తెలంగాణ ప్రాజెక్టులకు నీటికొరత

- Advertisement -

కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ గత పదిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్‌ శాఖ, ప్రకట నలు చేస్తున్నది. గతంలో ఈ ప్రాజెక్టుపై ఐదుగురు ముఖ్యమంత్రులతో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని సుప్రీంకోర్టులో రిజిస్ట్రీ చేశారు. తిరిగి ఐదు మీటర్ల ఎత్తు పెంచడానికి రహస్యంగా నిర్మాణం కావించింది. ప్రస్తుతం నీటి పంపిణీకి వేసిన ట్రిబ్యునల్‌ బ్రిజేష్‌ కుమార్‌ 2010లో ఆల్మట్టి ఎత్తు పెంచడానికి అవకాశం కల్పించింది. దాని ఆధారంగా కర్నాటక ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నది. ట్రిబ్యునల్‌ ముందు మన రాష్ట్ర ప్రభుత్వ తరపున వాదనలు బలహీనంగా ఉన్నాయి.

ఒకదశలో ”తెలంగాణలో మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులు నిర్మించడం లేదని మన తరపు అడ్వకేట్లు బ్రిజేష్‌ ట్రిబునల్‌ ముందు అఫిడవిట్‌ దాఖలు చేశారు” దీనిపై రాష్ట్రంలోని అన్ని ప్రతి పక్ష పార్టీలు, కాంగ్రెస్‌తో సహా విమర్శించడంతో ఆ అఫిడవిట్‌ను వాపస్‌ తీసుకున్నట్టు అడ్వకేట్లు ప్రభుత్వం ప్రకటించింది. అల్మట్టి చరిత్రను మొత్తంగా పరిశీలిస్తే గనుక బచావత్‌ తీర్పు అనంతరం దాని పర్యవేక్షణ, పరిశీలనా లోపాల వలన కర్నాటక-ఆంధ్రప్రదేశ్‌ మధ్య నాలుగు బేసిన్‌ ప్రాంతాల్లో జలవివాదాలు వస్తున్నాయి. అవి 1.మధ్యకృష్ణా సబ్‌-బేసిన్‌, 2. తుంగభద్ర సబ్‌-బేసిన్‌, 3.పెన్నా సబ్‌-బేసిన్‌.4.రాజోలిబండ డైవర్షన్‌ స్కీం.

మధ్య కృష్ణా జలవివాదం
1978లో ప్లానింగ్‌ కమిషన్‌ ఆమోదం ప్రకారం స్టేజి-1 ఆప్పర్‌ కృష్ణా ప్రాజెక్టుకు (ఆల్మట్టి డ్యాం) పూర్తి రిజర్వాయర్‌ మట్టం + 512.2 మీటర్లు గాను 42.2 టీఎంసీ నిల్వ శక్తి గల దానికి అనుమతి నిచ్చింది. రెండవ దశ +524.256 మీటర్ల పథకాన్ని పెండింగ్‌లో పెట్టారు. తర్వాత కర్నాటక రెండవ దశ ప్రారంభించగా ఆంధ్రప్రదేశ్‌ వాదనపై కేంద్రం జోక్యం చేసుకుని ఉభయులకు ఆమోదయోగ్యంగా డి.పి.గోస్వాల్‌ (పశ్చిమ బెంగాల్‌ చీప్‌ ఇంజనీరు) కన్వీనరుగా నిపుణుల కమిటీని వేసింది. మధ్య కృష్ణాలో బచావత్‌ తీర్పు ప్రకారం కర్నాటక 160 టీఎంసీలు వినియోగించాలి. ఇందుకు ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు దిగువన నారాయణపూర్‌ ప్రాజెక్టు ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు మధ్య కృష్ణా బేసిన్‌ పరిధిలోకి వస్తాయి.

ఆల్మట్టి కింద సాగుభూమి లేదు. ఆల్మట్టిలో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా నారాయణపూర్‌ ప్రాజెక్టులోకి నీరువస్తుంది. నారాయణపూర్‌ ప్రాజెక్టు కింద 16.50 లక్షల ఎకరాల సాగు ఆయకట్టుకు నిర్ధారించారు. నారాయణపూర్‌ ఎడమ కాల్వకు 103 టీఎంసీలు, కుడి కాల్వకు 52 టీం ఎసీలు, హిప్పర్గి వైర్‌ ప్రాజెక్టుకు ఐదు టీఎంసీలు ప్లానింగ్‌ కమిషన్‌ కేటాయిచింది. ఇందుకు భిన్నంగా కర్నాటక ఆల్మట్టి ఎత్తు+524.25 మీటర్లకు పెంపుదలకు నిర్మాణం చేపట్టింది. అంత ఎత్తు నిర్మాణం చేపడితే ఆల్మట్టిలో173 టీఎంసీలు ఉంటాయి. దిగువ నారాయణపూర్‌లో మరో 37 టీఎంసీలు ఉంటాయి. వస్తున్న నీటిలో మరో 100 టీఎంసీలు వినియోగించుకోవచ్చు. ఆ విధంగా 300ల టీఎంసీలు వినియోగించుకోవడానికి కర్నాటక ప్రణాళిక రూపొందించింది.

ఆంధ్రప్రదేశ్‌ ఈ తగాదాపై కేంద్రాన్ని పరిష్కారానికి కోరగా కేంద్రం 1996లో కమిటీ వేసింది. నాటి పశ్చిమబెంగాల్‌, అస్సాం, బీహార్‌, తమిళనాడు ముఖ్యమంత్రులతో సహా ఆయా రాష్ట్రాల ఛీఫ్‌ ఇంజనీర్లచే నిపుణులను అందులో చేర్చింది. ఆ కమిటీ తుంగభద్ర, హిపర్గి, ఆల్మట్టి, నారాయణపూర్‌, శ్రీశైలం కుడికాలువ, తెలుగుగంగ, నాగార్జున సాగర్‌, శ్రీశైలం ఎడమకాలువలను 1996 నవంబరు 15-18 తేదీల్లో సందర్శించింది. వారికి పశ్చిమబెంగాల్‌ ఇంజనీర్‌ డి.పి గోస్వాల్‌ నాయకత్వం వహించి పరిష్కారం చూపారు. ఆల్మటి డ్యామ్‌ను +519.6 మీటర్లకు పెంచుకోవచ్చునని సూచించారు. దీనివలన ఆల్మట్టిలో నీటి నిల్వ 129.72 టీంఎసీలు నారాయణపూర్‌లో 37.65 టీంఎసీలు నిల్వ ఉంటాయి.

ఈ తీర్మానాన్ని మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించి సుప్రీంకోర్టు నుండి ధృవీకరణ పొందారు. కానీ దామాషా పద్ధతి లేకపోవడంతో ఈ ఏడాది పైరెండు ప్రాజెక్టులు పూర్తిగా నిండినప్ప టికీ దిగువకు నీరు విడుదల చేయలేదు. ప్రస్తుత బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కూడా దామాష పద్ధతిని ప్రకటించలేదు. మధ్యకృష్ణాలో లభ్యమౌతున్న నీరు కర్నాటక ఎక్కువగా వినియోగించుకుంటుంది. కర్నాటకకు బచావత్‌ తీర్పు కేటాయించిన జలాలను పునఃపంపిణీ చేసుకుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం చెప్పలేదు. కె-2 (మధ్యకృష్ణా)లో 160 టీఎంసీలు బచావత్‌ కేటాయించగా పునఃపంపిణీలో 187.20 టీఎంసీలకు పెంచుకుంది. ఇప్పుడు 300ల టీఎంసీలకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నది. దీనివలన జురాల, శ్రీశైలం ప్రాజెక్టులకు నీటిరాక తగ్గింది.

రెండవ ట్రిబ్యునల్‌ మధ్యంతర తీర్పు
ప్రస్తుతం మిగులు జలాల పంపిణీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ఛైర్మన్‌గాను, అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌పి శ్రీవాత్సవ, కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి డికె సేత్‌ సభ్యులుగా గత ఎన్డీయే ప్రభుత్వం 30జూన్‌2004న రెండవ ట్రిబ్యునల్‌ను నియమించింది. ఈ ట్రిబ్యునల్‌ 30డిసెంబర్‌2010న ప్రాథమిక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై 20 ఏప్రిల్‌ 2012న ఆంధ్రప్రదేశ్‌ ఆప్పీల్‌ చేసింది. రాష్ట్రాలకు 7 మే 2012 వరకు ఇచ్చిన అవకాశాన్ని నేటికి (21 డిసెంబర్‌ 2012) కొనసాగిస్తున్నది. వాదనలు జరుగుతున్నాయి. మిగులు జలాలపై బ్రిజేష్‌కుమార్‌ ప్రాథమిక తీర్పు ఈ కింది పట్టికలో చూపిన విధంగా ఉంది. (కేటాయింపులు టీఎంసీలలో). (బచావత్‌ అవార్డ్‌లో 75శాతం నికర జలాలు చూపి 2060 టీఎంసీలు నిర్ణయించగా, బ్రిజేష్‌కుమార్‌ అవార్డులో 65శాతం తగ్గించగా నికర జలాలు 147 టీఎంసీలు అదనంగా వచ్చాయి) జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ కమిషన్‌ నికర జలాల సూత్రాన్ని 75శాతం నుండి 65 శాతానికి తగ్గించింది.

పైగా ఆల్మటి ఎత్తు 519.6 మీటర్ల నుండి 524.256 మీటర్ల పెంపుదలకు అనుమతినిస్తూ మధ్యకృష్ణాలో కర్నాటకకు మిగులు జలాలు సహా అదనంగా 130 టీఎంసీలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని జూరాలకు 9 టీఎంసీలు, తెలుగుగంగకు 25 టీఎంసీల నికర జలాలు మాత్రమే ఇచ్చారు. శ్రీశైలం, నాగర్జునసాగర్‌ ప్రాజెక్టులకు క్యారీఓవర్‌ స్టోరేజ్‌ (రాబోయే సంవత్సరానికి నిల్వ) 150 టీఎంసీలు కేటాయింపు చూపారు. ఆల్మట్టి నుండి జూన్‌-జూలై మాసాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 8-10 టీఎంసీలు ఇవ్వాలి. పర్యావరణ పరిరక్షణకు మూడు రాష్ట్రాలు నదిలో పదహారు టీఎంసీలు కనీస ప్రవాహం ఉంచాలి. కాని దామాషా పద్ధతిన నీటి విడుదల చూపలేదు. బ్రిజేష్‌కుమార్‌ తీర్పు వలన ఏపీకి నష్టమే తప్ప లాభం లేదు.

ట్రిబ్యునల్‌ బ్రిజేష్‌కుమార్‌ తీర్పు అమలు జరిపినచో ఆల్మట్టిలో 300 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. క్రిష్ణాపై గల ప్రాజెక్టులు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు సంబంధించినవి. అవి నిండిన తర్వాత జూరాలకు నీరు వస్తుంది. ప్రతి రెండుమాసాలకోసారి దామాషా పద్ధతిలో నీటిని దిగువకు విడుదల చేసే నిబంధనలు లేనందున మహారాష్ట్ర, కర్నాటకలు క్రిష్ణా జలాలతో లబ్ది పొందు తున్నాయి. శ్రీశైలానికి తుంగభద్రలోని తుంగ నుండి 400 టీఎంసీల నీరువస్తుంది. ఆ నీరే కీలకంగా తెలంగాణకు వినియోగం అవుతుంది. పదకొండు టీఎంసీలతో జూరాల, 269 టీంఎసీిలతో శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జునసాగర్‌కు చేరుతుంది. నాగార్జునసాగర్‌లో మొత్తం నీటి నిలువ 240 టీఎంసీిలు ఉంటాయి. ఈ మధ్య పూడికతో కొంతతగ్గింది.

నాగార్జునసాగర్‌ డెడ్‌ స్టోరేజి 130 టీఎంసీల నీరు ఉంటుంది. క్రిష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలి. ఇంతకాలం 66:34 చొప్పున ఆంధ్రా,తెలంగాణలు నీటిని వాడుకుంటున్నాయి. గత పదేండ్లలో ఏనాడూ తెలంగాణకు నిర్ణయించిన 34శాతం నీరు రాలేదు. అత్యధికంగా 30 శాతం ఐదేండ్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన కాలంలో 25 శాతం నీరుమాత్రమే దిగువకు వస్తున్నది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, క్రిష్ణా డేల్టాలకు సకాలంలో నీరందక పంటలు దెబ్బతింటున్నాయి. తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటి దృష్ట్యా ఆల్మట్టి సమస్యను పాలకులు త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది.

సారంపల్లి మల్లారెడ్డి
9490098666

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -