పంట పొలాలకు తీవ్ర నష్టం
ప్రాజెక్టులపై ప్రభావం
ఆల్మట్టి ఆపకపోతే ఆందోళన చేస్తాం..: సీపీఐ(ఎం)
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కర్నాటక ప్రభుత్వం కృష్ణానదిపై ఉన్న అల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలని తీసుకున్న నిర్ణయం తెలంగాణలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. డ్యామ్ ఎత్తు పెంచితే ఆ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్నా.. తెలంగాణకు భవిష్యత్‌లో మరింత నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయని సాగునీటి నిపుణులు, రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తెలిపారు. అల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరుకు సైతం ఇబ్బందులు వస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రకటనలు, రైతు సంఘాల సూచనలతో దీనిని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వెనక్కుబోమని, రాష్ట్రం వాదనలు కేంద్రానికి గట్టిగా వినిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దాని కోసం న్యాయపరంగా తమ వాదనలు వినిపించేందుకు అన్ని రకాలుగా సిద్ధమైనట్టు తెలిసింది.
పదేండ్ల కిందట కర్నాటక ప్రభుత్వం గిరిజాపూర్ డ్యాం నిర్మించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంగా ఉన్నప్పుడే ఈ డ్యాంను నిర్మించారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్నామని చెప్పినా.. ఈ ప్రాజెక్టు ద్వారా 70వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తున్నారు. తక్కువ వర్షాలు పడితే గిరిజాపూర్ డ్యాం కిందికి నీరు రావడం కష్టమే. ఇప్పుడు మళ్లీ అల్మట్టి డ్యాం ఎత్తును పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. జూరాల ప్రాజెక్టుకు ఎగువన గిరిజాపూర్ డ్యాం నిర్మించారు. తర్వాత నారాయణపూర్, ఆ తర్వాత అల్మట్టి ఉంది. ఇప్పుడు అల్మట్టి ఎత్తు పెంపుతో దిగువన ఉన్న మహబూబ్‌నగర్‌కు నీటి సమస్య ఏర్పడనుంది. అల్మట్టి ఎత్తు పెంచితే మునిగిపోయే 1.33,867 ఎకరాల భూమి కోసం కర్నాటక ప్రభుత్వం రూ.70వేల కోట్లు కేటాయించింది. ఇందులో 75,563 ఎకరాలు ముంపుకు గురైన భూమి, 51,837 ఎకరాలు కాలువల కోసం, 6,469 ఎకరాలు పునరావాసం కోసం సేకరిస్తున్నారు. ఇందులో 20 గ్రామాలు, 11 వార్డులు ముంపుకు గురవుతున్నాయి. ఇది పూర్తయితే 123.08 టీఎంసీలకు తోడుగా మరో 130 టీఎంసీల నీటిని కర్నాటక వాడుకునే అవకాశం ఉంటుంది.
రైతుల నోట్ల మట్టి..
అల్మట్టి ఎత్తు పెంపు పూర్తయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా తీరని నష్టం జరగనుంది. ప్రస్తుతం కోయిల్‌సాగర్ ఆరుతడి 5600 ఎకరాలు, తరి 30వేల ఎకరాలు, భీమా ఆరుతడి 2100 ఎకరాలు, తరి 58,210 ఎకరాలు, జూరాల 24,728 ఎకరాలు ఆరుతడి 84,568 ఎకరాలు తరి, నెట్టెంపాడు ఆరుతడి 95వేల ఎకరాలు, తరి 25వేల ఎకరాలు, భీమా ఆరుతడి కింద 68,767 ఎకరాలు, తరి కింద 68,767 ఎకరాలు, ఆర్డీఎస్ కింద ఆరుతడి 40వేల ఎకరాలు, తరికింద 15వేల ఎకరాలు సాగు అవుతోంది. కల్వకుర్తి కింద ఆరుతడి 2,38,851 ఎకరాలు, తరి కింద 2లక్షల 55వేల ఎకరాలు సాగవుతోంది. వీటితోపాటు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సైతం సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి పరిధిలో మరో 12లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. అల్మట్టి ఎత్తు పెరిగితే ఈ పంటలకు నష్టం రానుంది.
తాగునీటి కటకట..
అల్మట్టి ఎత్తు పెంచితే మంచినీటికీ సమస్య ఎదువుతుంది. ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్ నగరానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతుంది. పైన డ్యాం ఎత్తు పెంచితే ఇక్కడ తాగునీటి సమస్య పునరావృతం అవుతుందన్న ఆందోళన నెలకొంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అల్మట్టి ఎత్తు పెంచకుండా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.
ఆల్మట్టి ఎత్తు పెంచడం సరికాదు.. కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా
కర్నాకట ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచి పాలమూరు రైతుల నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం చేస్తోంది. వెంటనే ఆ ప్రయత్నం ఆపాలి. దశాబ్దాల తరబడి ఈ జిల్లా వాసులు ఆకలితో ఆలమటించారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఇది పిడుగు లాంటి వార్త. ఆల్మట్టి ఎత్తు పెంపుదలను విరమించుకోకపోతే న్యాయపరంగా ముందుకు పోతాం.
ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతలు, పాలమూరు – రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, కోయిల్‌సాగర్, నెట్టెం పాడు, బీమా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం అల్మట్టి ఎత్తు పెంచితే.. ఇక్కడ ఈ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు
కర్నాటక ప్రభుత్వం అల్మట్టి డ్యామ్ ఎత్తును 524 అడుగులకు పెంచడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. నీటిపారుదల పరిస్థితిని పరిశీలిస్తే.. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓసారి వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ సమయంలో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఈ విషయం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది. తెలంగాణ నీటి వాటా గురించి ఉమ్మడి రాష్ట్రంలోనే సుప్రీంకోర్టులో మన వాదన వినిపించాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్మట్టి ఎత్తు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
పార్థసారథి, ఈఈ-పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్
ఆల్మట్టి పెంచితే ఆందోళనే
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే ప్రతిపాదన ను విరమించుకోవాలి. కర్నాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే పాలమూరు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండాపోతుంది.
కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే అల్మట్టి ఎత్తు పెంచే ప్రతిపాదనను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేనిచో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం తప్పదు.
ఎండి జబ్బార్, సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు