Friday, January 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యవస్థాగత సంస్కరణలతోపాటు నైపుణ్యమే రైల్వేల అభివృద్ధికి కీలకం

వ్యవస్థాగత సంస్కరణలతోపాటు నైపుణ్యమే రైల్వేల అభివృద్ధికి కీలకం

- Advertisement -

దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం సంజయ్ కుమార్‌ శ్రీవాస్తవ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
వ్యవస్థాగత సంస్కరణలతోపాటు నైపుణ్యమే రైల్వేల అభివృద్ధికి కీలకమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్ కుమార్‌ శ్రీవాస్తవ అన్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని న్యూబోయిగూడలోని రైల్‌కళారంగ్‌లో 70వ రైల్వే వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్ కుమార్‌ శ్రీవాస్తవ ముఖ్యఅతిథిగా హాజరై ఆయా డివిజన్లు విభాగాలకు జోనల్‌ సామర్థ్య షీల్డ్‌ను, అలాగే అధికారులు సిబ్బందికి వ్యక్తిగత విశిష్ట రైల్‌ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో అదనపు జనరల్‌ మేనేజర్‌ సత్యప్రకాష్‌, సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ అశిష్‌ మెహాత్రా, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (జి) ఉదయనాథ్‌ కోట్లా, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, డివిజనల్‌ రైల్వే మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంజయ్ కుమార్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. 2024 సంవత్సరంలో అందించిన అత్యుత్తమ సేవలను ప్రశంసించారు. సంస్థకు నిజమైన బలం ఉద్యోగులేనని అన్నారు. జోన్‌ తన సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. జనరల్‌ మేనేజర్‌ జవాబుదారీతనం కార్యాచరణతో కూడిన, రైలు వినియోగదారుల సేవ, నిర్వహణ, ఉత్పత్తి మొదలైన అన్ని రంగాలలో కాలపరిమితితో కూడిన మార్పులతో వ్యవస్థాగత సంస్కరణలను తీసుకురావాలని పిలుపునిచ్చారు. నూతన ఆలోచనలను ప్రోత్సహిస్తూ వాటిని స్వాగతించాలని అన్నారు. మూల్యాంకనం చేసి అమలు చేయాలని చెప్పారు.

జనరల్‌ మేనేజర్‌ ఆధునికంగా సాంకేతిక పరిజ్ఞానాలతో ముందుకు సాగడానికి నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆయా డిజిటల్‌ మాధ్యమాల్లో అందుబాటులోనున్న అపారమైన జ్ఞానాన్ని ఉపయోగించుకుని సమర్థవంతమైన శ్రామిక శక్తిని నిర్మించాలని అధికారులను సిబ్బందికి పిలుపునిచ్చారు. భారత రైల్వేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిరంతరం అభివృద్ధి వైపు వెళుతున్నాయని అన్నారు. భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి స్ఫూర్తితో ముందుకు సాగుతూ, తన విజయపతాకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని గట్టిగా నమ్ముతున్నానని అన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన డివిజన్లు, జోనల్‌ అధికారులు, సిబ్బందికి షీల్డ్‌లను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -