– గుట్టు రట్టు చేసిన బోధన్ రూరల్ పోలీసులు
– మూడుకోట్ల విలువైన సరుకు పట్టివేత : వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య
నవతెలంగాణ-కంఠేశ్వర్
మహారాష్ట్ర కేంద్రంగా సాగుతున్న నిషేధిత మత్తు పదార్థాల తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఫార్మా కంపెనీ కేంద్రంగా అక్రమంగా అల్పాజోలంను ఉత్పత్తి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసినట్టు సీపీ సాయి చైతన్య తెలిపారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కమిషనరేట్‌లోని కార్యాలయంలో సీపీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నార్కోటిక్ డ్రగ్ బృందం ఇంటర్న్‌షిప్ ద్వారా బోధన్ రూరల్ సీఐ విజరు బాబు ఆధ్వర్యంలో అల్పాజోలం కేసు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని సతారాలో సూర్యప్రభ ఫార్మాకెన్ ఇండిస్టీలో నిషేధిత మత్తు పదార్థాలు తయారీ అవుతున్నట్టు గుర్తించారు. ఇండిస్టీ నడుపుతున్న అమర్ సింగ్ దేశ్ముఖ్, ప్రసాద్ కడేరీ, బయో సిమ్యులెంట్ కంపెనీ యజమాని బాబురావు, అల్పాజోలం కొనుగోలు చేసిన లక్ష్మణ్ గౌడ్, రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ విశ్వనాథ్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులు తెలంగాణలోని కల్లు డిపోలకు అక్రమంగా అల్పాజోలం రవాణా చేస్తున్నట్టు గుర్తించామని సీపీ వెల్లడించారు. లక్ష్మణ్‌గౌడ్ ఇచ్చిన సమాచారంతో నిందితులు బోధన్ గ్రామీణ పరిధిలోని సాలూరు గ్రామంలో లక్ష్మణ్‌గౌడ్‌కు 2.5 కిలోల ఆల్పాజోలం డెలివరీ చేసే సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కోసం నిందితులను కస్టడీకి తీసుకుంటామని చెప్పారు. సుమారు రూ.3కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని ఉమేర్గా నుంచి సోలాపూర్ వెళ్లే జాతీయ రోడ్డుపై నిందితుల్లో ఒకడైన బాబురావు నుంచి రూ.3 కోట్ల విలువ చేసే 30 కిలోల అల్పాజోలం సీజ్ చేశారు. అలాగే సతారాలోని అమర్ సింగ్ దేశ్ముఖ్ నివాసంలో రూ.12 లక్షల నగదు, రూ. 4 కోట్ల విలువ చేసే సూర్యప్రభ ఫార్మా కంపెనీని సీజ్ చేశారు. అల్పాజోలంను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వినియోగిస్తున్న ఫోర్డ్ కారును కూడా సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ విజరు బాబు, నార్కోటిక్స్ బృందాన్ని సీపీ అభినందించారు. కేసు చేధించడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందికి సీపీ చేతుల మీదుగా రివార్డ్ అందజేశారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ అమ్మిన.. సేవించిన.. పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజరు బాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫార్మా పేరుతో అల్పాజోలం దందా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES