ఫైలట్ ప్రాజెక్టుగా వేములవాడలో గోశాల ఏర్పాటు
విపత్తుల సమయంలో జంతువులకు జరిగే ప్రమాదాల నివారణపై సదస్సులో మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మానవతావాదిగా జంతువుల రక్షణకు కట్టుబడి ఉన్నాననీ, పశువుల రక్షణ బాధ్యత మానవాళి ఆర్థికాభివృద్ధికి చేయూత అని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఫైలట్ ప్రాజెక్టులో భాగంగా వేములవాడలో గోశాల ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ లోని ఓ హోటల్‌లో జరిగిన విపత్తుల సమయాల్లో జంతువులకు జరిగే ప్రమాదాల నివారణపై సదస్సు లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే జంతువులు పసిగడు తాయని తెలిపారు. విపత్తుల వల్ల మూగజీవాలకు జరిగే నష్టాన్ని నివారిం చడానికి మంత్రిగా కాకుండా మానవత్వంతో పని చేస్తానని హామీనిచ్చారు. తెలంగాణలో గో సంరక్షణ పేరుతో ప్రభుత్వ పాలసీ తీసుకొచ్చామన్నారు. గోశాల నిర్వహణ విధివిధానాలు రూపొందిస్తున్నా మని తెలిపారు. గ్లోబల్‌వార్మింగ్, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవజాతితో పాటు జంతువులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొం టున్నాయని వివరించారు. తెలంగాణ వరదలకు, కరువు కాటకాలకు గురయ్యే ప్రాంతమనీ, ఆ సమయాల్లో జంతువులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని తెలిపారు.
2024లో సంభవించిన వరదల వల్ల ఎన్నో పశుపక్షాదులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్కర సమయాల్లో జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి శాఖల మధ్య సమన్వయం చాలా అవసరమని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో పశు వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. మొబైల్ వెటర్నరీ సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. జంతువుల రక్షణ కోసం పనిచేస్తున్న అన్ని ఎన్‌జీవో సంస్థలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. తెలంగాణ లో 26 లక్షల కుటుంబాలు పశు సంపద, పౌల్ట్రీ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నాయని వివరిం చారు. గ్రామీణ ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవితంలో పశు సంపద కీలక పాత్ర వహిస్తుందని చెప్పారు. సదస్సు నిర్వహించిన హ్యూమన్ ఫర్ యానిమల్స్ ఇండియా, యునిసెఫ్ ఇండియా సంస్థలను అభినందించారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ గోపాల్, డాక్టర్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.



