ప్రతీ మనిషిపై సమాజంలోని కొన్ని ఆంశాలు ప్రభావితం చేస్తాయి. తను ఎంచుకున్న ప్రయాణంలో సాగుతున్న క్రమంలో తనకు కావాల్సినవి కాలమే తన వద్దకు చేరవేస్తుంది. కావాల్సిన పరిస్థితులను సైతం కాలమే నిర్ణయిస్తుంది. చిన్న, చిన్న కవితలు రాసుకునే నాకు కూడా కాలమే ఓ పుస్తకాన్ని పరిచయం చేసింది. ఆ పుస్తకమే ఇప్పుడు నాకు తోడుకు చుట్టమైంది. ఒంటరిగా ఉన్నప్పుడు నేస్తమైంది. ప్రేమలో ఓదార్పు అయింది. తిరుగుబాటులో ధిక్కారం నేర్పింది. ఆ పుస్తకమే ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత.’ నేను చిన్నప్పటి నుంచి చిన్న, చిన్న కవితలు, పాటలు రాసే వాడిని. విద్యాభ్యాసం పూర్తి అయ్యాక 9 ఏండ్ల క్రితం జర్నలిజంలో అడుగుపెట్టాను. నవతెలంగాణ పత్రికలో కరీనంగర్ రీజియన్ పరిధిలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. అప్పటికే అలిశెట్టి ప్రభాకర్ గురించి విన్నాను. తను జగిత్యాలకు చెందిన వ్యక్తి కావడంతో అతని జయంతి, వర్థంతి సందర్భంగా నవతెలంగాణలో కథనం ప్రచురితమైంది. అది చదివిన తరువాత నాలో ఏదో తెలియని కొత్త ఉత్తేజం మొదలైంది. తను గురించి చదువుతుంటే.. చాలా గొప్పగా అనిపించింది. అలిశెట్టి పుట్టుక, జననం ఒకే రోజు ఉండడం నాకు బాగా నచ్చింది.
గొప్ప వ్యక్తులకే ఇది సాధ్యమేమో.. కాలంపై చెరగని సంతకం చేసే వారికి ఆ కాలం ఇచ్చే కానుక ఇది అనుకున్నా. ఆ తరువాత తన గురించి మరింతగా తెలుసుకున్నాను. కరీంనగర్‌లోని నవతెలంగాణ పబ్లిష్‌హౌజ్‌కి ఓ రోజు అనుకోకుండా వెళ్లాం.. ఓ పుస్తకం నవ నూతనంగా ప్రకాశిస్తోంది. వేల పుస్తకాల్లో ఆ పుస్తకమే నన్ను ఆకర్షిస్తోంది. ఎంతలా అంటే ప్రేమలో ‘ఫస్ట్ సైట్ లవ్’ ఉంటుందో లేదో చెప్పలేను కానీ అలిశెట్టి పుస్తకం మాత్రం నన్ను అంతకంటే ఎక్కువగానే ఆకర్షించింది. నవతెలంగాణలో ఉండడంతో అప్పటికే నాకు పుస్తకాలు చదవడం అలవాటు అయింది. వెంటనే ఆ పుస్తకం తీసుకున్నాను. ఒకటి, రెండు రోజుల్లోనే ఎంతో ఇష్టంగా ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ పుస్తకం చదివేశాను. ఆ పుస్తకం తను చనిపోయిన తరువాత తన స్నేహితులు తీసుకొచ్చారు. నేను పదే పదే కాలం గురించి ఎందుకు చెబుతున్నాను అంటే.. అలిశెట్టి ఉన్నప్పుడు తన రచనలు పుస్తకం రూపంలో తెలేదు.. కానీ ఆ పుస్తకం ఈ సమాజానికి ఎంతో అవసరం. గతం, వర్తమానం, భవిష్యత్ తరాలకు కూడా ఈ పుస్తకం నిత్యనూతనమే. అందుకే కాలం అలిశెట్టి స్నేహితులతో ఆ పుస్తకాన్ని అచ్చువేయించింది.
ఈ పుస్తకంలో ప్రతీ అక్షరం ఓ అగ్నికణం. ప్రతీ కవిత.. ఓ ధిక్కార స్వరం. శిల్పి రాయిని చెక్కితే.. శిలాగా ఎలా మారుతుందో.. అలిశెట్టి అక్షరాలను అంతే అందగా చెక్కి వాటికి ‘కవిత’ రూపాన్ని ఇచ్చాడు. సమాజంలోని ప్రతీ ఆంశాన్ని స్పర్శించాడు. సమాజం పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్న నాలాంటి వాడిని తన అక్షరాలతో తట్టిలేపాడు. చిన్న, చిన్న పదాలతో రెండు, మూడు లైన్లలో ఉన్న కవితలు నిగూఢ అర్థాన్ని చెబుతాయి. ప్రతీ కవిత కూడా ఆలోచింపజేస్తుంది.. ప్రత్యేకంగా ఈ కవిత బాగుంది అని చెప్పడానికి వీలు లేదు.. అన్నీ కవితలు అద్భుతమే ఆనడంలో అతిశయోక్తి లేదు. ‘వేశ్య గొప్పతనం కీర్తించిన.. ఆకలి ఆర్తనాదం వినిపించినా.. రాజకీయ గుడ్డలు ఊడదీనినా.. (ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలు), నిరుద్యోగికి బాసటగా నిలిచినా.. లాయర్ గొప్పతనాన్ని వివరించినా.. బూటకపు ఎన్‌కౌంటర్లను ధిక్కారించినా..’ ప్రతీ కవిత ఆలోచింపజేస్తుంది. సమాజాన్ని నగ్నంగా నిలబెడుతుంది.
మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు.. ప్రతీ కవిత.. ప్రతీ అక్షరం కాగితంపై భగభగ మండుతుంది. అన్యాయాన్ని, అవినీతిని, అక్రమాలకు ఆ మంటల్లో దహనం చేస్తుంది. ఆ పుస్తకం చదివితే ఎంతటి పిరికివాడినైనా.. పిడికిలి బిగించి పోరాటం వైపు అడుగులు వేసేలా చూస్తుంది. రచయితలకు కవితంపై మరింత మక్కువను పెంచుతుంది. మన బాధ్యతను, మన గమ్యాన్ని, మన లక్ష్యాన్ని కూడా నిర్దేశిస్తుంది. అంతలా ప్రభావితం చేస్తుంది ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ పుస్తకం. ఈ పుస్తకం గురించి.. ఆ అక్షర శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే. కవిత్వంలోకి నూతనంగా అడుగులు వేసే వారు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ పుస్తకం. నా గ్రంథాలయంలోకి వందల పుస్తకాలు చేరాయి.. అనేక పుస్తకాలు చదివాను.. చదవాక పోయినా కొన్ని తెచ్చుకుని పెట్టుకున్నాను. కానీ ఎన్నీ వేల పుస్తకాలు నా గ్రంథాలయంలోకి చేరినా.. నన్ను ప్రతీ క్షణం తట్టిలేపేది.. నాలో నిత్యం ‘స్ఫూర్తి’ని నింపేది మాత్రం అలిశెట్టి కవిత్వమే…
- అజయ్ కుమార్, 8297630110