– 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 200 రన్స్
– బెంగాల్‌పై హైదరాబాద్ ఘన విజయం
రాజ్‌కోట్ (గుజరాత్) : హైదరాబాద్ యువ బ్యాటర్, 21 ఏండ్ల ఆమన్ రావు అదరగొట్టాడు. 12 ఫోర్లు, 13 సిక్సర్లతో బెంగాల్ పేసర్లు, స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఆమన్ రావు.. ప్రతి విరామం తర్వాత విశ్వరూపం చూపించటం మొదలెట్టాడు. 108 బంతుల్లో శతకం సాధించిన ఆమన్ రావు.. మరో 46 బంతుల్లోనే కెరీర్ తొలి ద్వి శతకం బాదాడు. ఇన్నింగ్స్ ఆఖరు బంతికి సిక్సర్‌తో 200 పరుగుల మైలురాయిని అందుకున్న ఆమన్‌రావు.. ఈ క్రమంలో లిస్ట్-ఏ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ రికార్డును చెరిపేశాడు. 1994-95 సీజన్‌లో గోవాపై అజహరుద్దీన్ అజేయంగా 161 పరుగులు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో హైదరాబాద్ తరఫున అజహరుద్దీన్‌నే అత్యధిక స్కోరు కాగా మంగళవారం బెంగాల్‌పై విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆమన్ రావు సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆమన్ రావు 50 ఓవర్ల ఫార్మాట్ కెరీర్‌లో మూడో మ్యాచ్‌లో ద్వి శతకంతో పాటు రికార్డులు తిరగరాయటం విశేషం. మూడోఓపెనర్ రాహుల్ సింగ్ (65, 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించిన ఆమన్ రావు.. ఆరంభంలో నెమ్మదిగా ఆడాడు. తొలి గంటలో పిచ్ నుంచి పేసర్లకు అనుకూలత లభించగా రాహుల్ సింగ్ ఎక్కువగా స్ట్రయిక్ తీసుకున్నాడు. మహ్మద్ షమి, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్‌లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. హైదరాబాద్ తొలి 100 పరుగుల్లో ఆమన్ రావు భాగస్వామం 33 పరుగులే. అర్థ సెంచరీతో తర్వాత రాహుల్ సింగ్ అవుటైనా.. కెప్టెన్ తిలక్ వర్మ (34, 45 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి ఆమన్ రావు మరో కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. 9 ఫోర్లు,3 సిక్సర్లతో 108 బంతుల్లో సెంచరీ చేసిన ఆమన్ రావు.. ఆ తర్వాత పేసర్లు, స్పిన్నర్లపై మరో పది సిక్సర్లు కొట్టాడు. ఆమన్ రావు ద్వి శతక జోరుతో తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసింది. బెంగాల్ పేసర్లలో మహ్మద్ షమి (3/70) రాణించాడు. భారీ ఛేదనలో బెంగాల్ 44.4 ఓవర్లలోనే కుప్పకూలింది. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/58) నాలుగు వికెట్లతో విజృంభించాడు. బెంగాల్ టాప్ ఆర్డర్‌లో సుమిత్ నాగ్ (10), అభిమన్యు ఈశ్వరన్ (15), సుదిప్ కుమార్ (0)లను సిరాజ్ సాగనంపాడు. మిడిల్ ఆర్డర్‌లో షాబాజ్ అహ్మద్ (108 నాటౌట్, 113 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), మంజుదార్ (59, 72 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా బెంగాల్ 245 పరుగులకే ఆలౌటైంది. 107 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. విజరు హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో హైదరాబాద్ ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించింది. నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ గ్రూప్ దశ ఆఖరు మ్యాచ్‌లో గురువారం జమ్మూ కశ్మీర్‌తో తలపడుతుంది.
ఆమన్‌రావు అదరహో
- Advertisement -
- Advertisement -



